అవకాశవాద రాజకీయా లను తరిమి కొట్టలేమా ?

దశాబ్దాలు అనుభవించి  అవకాశం రాలేదని  శత్రుపక్షం చేరడం  వివేకమా?  నిందించిన పార్టీలోకి మారడం  కుళ్ళు రాజకీయాలకు నిదర్శనం కాదా ?

Apr 11, 2026 - 07:38
 0  2

దశాబ్దాలుగా వివిధ రాజకీయ పార్టీల్లో   పదవులను అనుభవించి  నిరంతరం పార్టీలు మారుతూనే అవకాశవాద రాజకీయాలకు  పాల్పడి  పార్టీలో నిర్లక్ష్యం చేసినారని,   పదవి  కట్టబెట్టలేదని  పార్టీ కార్యకర్తల సమీకరించినట్లుగా నటించి  తన పెద్దరికం  పెత్తందారితనాన్ని చాటుకోవడానికి ఇటీవల కాలంలో అనేక మంది రాజకీయ నాయకులు పార్టీ మారే సందర్భంలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు.  తమ ఉనికి కోసం కోల్పోతున్నటువంటి అడ్రస్ ను కాపాడుకోవడం కోసం చేసే నటన తప్ప  చచ్చేదాకా బతికినంత కాలం పదవులు ఉండాలని కోరుకునే   తత్వం ఏ పాటిదో అర్థం చేసుకుంటే మంచిది. సుమారు 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో వివిధ పార్టీలలో మంత్రిగా  ఎమ్మెల్సీగా పదవులు అనుభవించి  ఆయా పార్టీలకు  క్రమక్రమంగా ద్రోహం చేస్తూనే  తిరిగి పతనమైనటువంటి టిఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి  జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఉబ లాటపడుతూ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమే అయినా నేటి  స్వార్థ చింతనకు  నిదర్శనంగా భావించవలసి ఉంటుంది.  

ఐదు శాతం కూడా లేనటువంటి రెడ్డిలు  పెద్ద మొత్తంలో పదవులను అనుభవిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్య  ఆచరణలో చేసి చూపెట్టాలంటే  బహుజనుల పార్టీ అయిన బిఎస్పీలో చేరి తన నిజాయితీని చాటుకుంటే బాగుండేది. కానీ  10ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి, అప్పులపాలు చేసి,  అగ్రవర్ణ ఆధిపత్యానికి పతాకగా నిలిచి,  పెత్తందారీ వ్యవస్థను పెంచి పోషించి,  భూస్వాముల జేబులను నింపి  అడవులు చెట్లు, పుట్టలు, గు ట్టలు రోడ్లకు కూడా ప్రజాధనాన్ని రైతుబంధు రూపంలో కొల్లగొట్టిన brs  పార్టీలోకి చేరుతానంటూ ప్రకటించడమే కాకుండా  ఆ పార్టీ నాయకత్వంలోనే పరిపాలన బాగుందని చెప్పడం అంటే నిజంగా  సమాజమే సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాబోయే కాలంలో టిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని  గత రెండేళ్ల పాలనలో  ముఖ్యమంత్రి పరిపాలన  వైఫల్యాలపై మాట్లాడిన వీరు  పదవి లేకుండా ఏనాడైనా ఉన్నారా??  పట్టభద్రుల స్థానం నుండి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే  ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా సందర్శించకుండా కేవలం పార్టీ పేరుతో  ప్రతినిధిని చూసి గెలిపించిన పట్టభద్రులను, అవకాశాన్ని  నిన్నటిదాకా నచ్చిన పార్టీ,  స్థాయిని పెంచిన పార్టీ,  పార్టీ అవకాశాలను రాజకీయ విధానాలను సమర్థించి  వేరే పార్టీలోకి మారగానే దాని గుణగణాలు మారినట్లు విమర్శించడం అంటే  ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే  అవుతుంది.

ఇంత వరదాకా కాంగ్రెస్ పార్టీలోనేకొనసాగుతూ  అలక బూని  కేంద్ర నాయకత్వం వరకు కూడా   పలుకుబడిని పెంచుకునే ప్రయత్నం చేసి  అందరూ నాయకులు బుజ్జగించే విధంగా మార్చుకొని  పత్రికల్లో  పేరు పొంది  తిరిగి కార్యకర్తల నిర్ణయం మేరకు పార్టీ మారుతున్నట్టు ప్రకటించడం అంటే  ప్రచారాన్ని పెంచుకోవడమా? లేక  ప్రస్తుతం ఉన్న పార్టీ విధానాలు నచ్చకనా? లేక ప్రతిపక్ష పార్టీలోకి చేరి పదవి పొందాలనే కాంక్షనా? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది . పార్టీ విధాన  నిర్ణయాలలో సమస్యలు ఉంటే  అంతర్గత  చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి.  అది ఒక ప్రజాస్వామిక పద్ధతి కానీ  పదవి లేకపోతే,ప్రతిపక్ష పోడు బలపడితే, పక్క పార్టీ వాడు గెలిస్తే, ప్రతిదానికి అలకబూనడం  పార్టీ పెద్దలతో బ్రతిమిలాడించుకోవడం ప్రచారానికిచ్చిన ప్రాముఖ్యత పార్టీ కోసం పనిచేసిన దాఖలా లేదని చెప్పడానికి నిదర్శనం కాదా ?రాజకీయం అంటే పదవే అని, పదవి లేకుండా రాజకీయంలో ఉండడం నేరమని,  ఆ పదవి కూడా తనకు దశాబ్దాలుగా ఉండాలని కోరుకోవడం అంటే నిజంగా   పక్కవాళ్ళు రెండవ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఎదగకూడదా?

రాజకీయాలలో  10 సంవత్సరాల కాలం పాటు మాత్రమే కొనసాగే విధంగా చట్టం తేవాల్సిన అవసరం కూడా ఉన్నది. అప్పుడు ఈ అవినీతి  అరాచకాలు అలకలు  పార్టీలు మారుడు పదవుల కోసం అధికార దుర్వినియోగం వంటి దుర్లక్షణాలను అంతం చేయడానికి అవకాశం ఉంటుంది.  ఎక్కడైతే గెలిచి పాలన చేపట్టి పదవులను అనుభవించినాడో అదే నియోజకవర్గాల్లోని ప్రజలు  ఇలాంటి నాయకులను ప్రశ్నించి ప్రజల సమక్షంలో దోషిగా నిలబెడితే కానీ ఇలాంటి అవకాశ రాజకీయాలను కట్టడి చేయలేము.

ఎమ్మెల్సీగా కొనసాగినప్పుడు నాయకునిగా  కాంగ్రెస్ పార్టీ జెండా మోసినప్పుడు  కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పెద్దలను అభిమానించి గౌరవించి ఆకాశానికి ఎత్తిఅదే  పార్టీని ధిక్కరించడం, నాయకులను విమర్శించడం, పార్టీ విధానాలను  అంగీకరించకపోవడంతో పాటు ప్రతిపక్షాన్ని సమర్థించడమoటే  చైతన్యం, సమదృష్టి, ప్రజాహితం ఏ పాటిదో అర్థమవుతుంది.  ప్రభుత్వ పాలసీలపైన ప్రజా సంక్షేమ సమస్యల పైన ఏనాడూ మాట్లాడిన దాఖల కనిపించదు.  పదవి రాకపోతే, పదవి లేకపోతే, పక్కవాడు ఎదుగుతే  మాత్రమే రాజకీయ తెర పై కనపడిన సందర్భాలను మనం బాగా చూడవచ్చు.  ఇంత దురాశ  పదవి కోసం ఆరాటపడి ఎంతకైనా దిగజారే తత్వాన్ని ఏ నాయకులలో కనిపించిన  ప్రజలు  గద్దె దించాలి.  ఆ రాజకీయ పార్టీలు కూడా నిర్బంధంగా తరిమికొట్టాలి.  పార్టీలో ఉండి అధికారాన్ని అనుభవించినప్పుడు మౌనంగా ఉండి  అవకాశం రాలేదని, టిక్కెట్ ఇవ్వలేదని, మంత్రి పదవి పొందలేదని  ఏవో సాకులు చూపి ఇతర పార్టీలోకి చేరడానికి వెళ్తున్నారంటే మళ్ళీ ఆ పార్టీలో పదవి పొందాలని ఆశపడడమే కదా!  అంతే కాదు రాబోయే కాలంలో తాను చేరుతున్న పార్టీ అధికారంలోకి వస్తుంది అని   ఆ పార్టీలో మంత్రి పదవి పొందుతానని ఆశించడమే కదా!  ఎవరు ఏ పార్టీలో  పని చేస్తారనేది ప్రజలకు సంబంధం లేని విషయం మీ వ్యక్తిగత ముఖచిత్రాన్ని పెద్దగా ప్రసార మాధ్యమాలలో చూపించుకుని  లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు.

ఈ పరిస్థితులు ఏ  పార్టీలోని నాయకులకు కార్యకర్తలకు ఎదురైన   అంతే అని తెలుసుకుంటే మంచిది.  అవకాశవాద రాజకీయ నాయకులను ఇతర పార్టీలు కూడా స్వీకరించడం అంటే మరొక నాయకుడు వస్తున్నాడని ఆశపడడమే కానీ అంతకుమించిన ద్రోహం పార్టీకి జరుగుతుందని తెలుసుకోకపోవడం అవివేకం.  అంతేకాదు ఏళ్ల తరబడిగా పార్టీని  నమ్ముకుని జెండాలు మోస్తూ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు రెండవ శ్రేణి నాయకులకు ఇవ్వని అధికారాన్ని నిన్న మొన్న పార్టీలో చేరిన వాళ్లకే మళ్లీ టిక్కెట్ ఇచ్చి  విద్రోహానికి తలపడడం కూడా అన్ని రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది.  అలాంటప్పుడు ఫ్రెష్ గా వచ్చిన క్యాండిడేట్కు టికెట్ ఇస్తే పార్టీలో ఉన్న సీనియర్లు అందరు కూడా రాజీనామా చేసి ఆ పార్టీకి కనువిప్పు కలిగించాలి.   అన్ని రాజకీయ పార్టీలలోని  నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని ప్రజలు నిరసించాలి. బుద్ధి జీవులు మేధావులు  ప్రజలు అసహించుకున్నప్పుడు మాత్రమే దారికి వస్తారు.

  ప్రయోజనము  మంత్రి పదవులు ప్రజలకు అవసరం లేదు  పార్టీ వ్యవహారమైతే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ  స్వాగత తోరణాలు కట్టి  ఇతర  పార్టీల ఆహ్వానించడమే ప్రజా జీవితం గా  చిత్రీకరిస్తే మాత్రం ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రజాస్వామ్య o లో  ప్రజలే కేంద్రం కానీ నాయకులే కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నది. ప్రజల సమస్యలు పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఏనాడు చట్టసభల్లో చర్చించకుండా ఉండి  పదవి పోయినప్పుడు మాత్రమే పత్రికలకు ఎక్కడo ఈనాడు  నాయకులకు hobby గా మారిందంటే ఎంత స్వార్థపరులో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నాయకులకు కనువిప్పు కలిగించాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు  మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు  ఓడించాలి..  ఎమ్మెల్సీగా పోటీ చేసిన నాడు  రెండు మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలలో తిరగవలసినటువంటి క్యాండెట్ గా ఉండి కూడా ఏ ప్రాంతాన్ని సందర్శించలేదు. పట్టభద్రులను కలవలేదు, సమస్యల పైన స్పందించలేదు అయినా కూడా పార్టీ పేరు చెప్పుకొని  పార్టీ మీద గౌరవంతో పట్టబదృ లు  ఓటు వేస్తే గెలిచి ఎమ్మెల్సీగా పదవి అనుభవించి   అధికార కాంక్ష తో  ప్రజలు నిరసించిన పార్టీలోకి చేరడం అంటే  అవకాశవాద రాజకీయమే.  గుణపాఠం కావలసినటువంటి సంఘటన కూడా .
      టిక్కెట్టు రాకపోయినా పక్కవాడు ఎదిగిన  మంత్రి పదవి ఇవ్వకున్నా  ప్రజలు అంగీకరించక ఓడించిన  అన్నింటికీ పార్టీ ప్రధాన కారణం అని  అలకబూనడo పార్టీని విమర్శించడం అంటే  అంతకుమించిన ద్రోహం మరొకటి ఉండదు. దీనినే అవకాశవాద రాజకీయం అంటారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం ద్వారా  దేశవ్యాప్తంగా అన్ని  పార్టీలకు  సర్వత్ర అమలయ్యే విధంగా  ఏళ్ల తరబడిగా  రాజకీయాలు చేసే అవకాశాన్ని కల్పించకుండా క 10 సంవత్సరాల పాటు మాత్రమే పదవిలో కొనసాగే విధంగా  రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది. ఎందరికో అవకాశం లభిస్తుంది.ఉద్యోగులకు  సెలవు నిబంధనలు, డ్యూటీకి రాకపోతే శిక్షలు,  సస్పెన్షన్లు, అవమానాలు  ఉన్నప్పుడు  రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం చట్టసభలకు రాకపోయినా,  పదవి సరిగా నిర్వహించకపోయినా, చట్టసభల్లో  చర్చించకపోయినా  వ్యక్తిగత జీవితానికే పరిమితమై కూడా ప్రభుత్వ ధనాన్ని వేతన రూపంలో తీసుకునే అధికారం ఎ క్కడిది?  ఉద్యోగులు డ్యూటీలో ఉన్నట్టుగా విధి నిర్వహణ రికార్డు లాగా  రాజకీయంలో కొనసాగే మంత్రులు శాసనసభ్యులు ఇతరులు చైర్మన్లు ఎవరికైనా  రిజిస్టర్ అంటూ ఉండాలి.  ఆబ్సెంట్ ఉంటే వేతనంలో కోత విధించాలి.  నిబంధనలను అతిక్రమిస్తే పదవి డిస్మిస్ చేసే అధికారం కూడా చట్టంలో పొందుపరచాలి.  

అప్పుడు ఇలాంటి అలకలు, ఏళ్ల తరబడిగా రాజకీయంలో కొనసాగాలనే, ఆశలు,  ఇతర పార్టీలకు ఆశ చూపించడం,  తను ఉన్న కొమ్మనే నరుక్కున్నట్టుగా ఉన్న పార్టీని విమర్శించడం,  పదవిలో ఉన్నప్పుడు మాత్రం సమర్థించడం  వంటి అవివేకమైనటువంటి చర్యలకు స్వస్తి పలకడానికి ఆస్కారం ఉంటుంది.  ఉద్యోగులకున్న నిబంధనలు వారికి కూడా వర్తింప చేయాల్సిన అవసరం చాలా ఉంది.  వ్యక్తిగత పని, రాజకీయ పార్టీ పని పైన  వెళ్లినా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడం అధికార వాహనాలను వినియోగించడం  తన డ్యూటీ నుండి తప్పుకోవడం వంటి  నేరాలకు రాజకీయ నాయకులు పాల్పడుతున్నారు.  తన కుటుంబానికి సంబంధించిన పని మీద వెళ్లినప్పుడు లేదా రాజకీయ పార్టీ కోసం పని చేసినాడు వేతనంలో కోత విధించుకొని తమ విజ్ఞతను నిజాయితీని చాటుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉన్నది. ఈ విషయంలో ప్రజలు చర్చించాలి అంతేకాదు రెండు మూడు పదవులు నిర్వహించిన వాళ్ళు రెండు మూడు రకాల పెన్షన్లను కూడా పొందుతూ  ప్రజాధనానికి గండి కొడుతున్న తీరును ఖండించాల్సిన అవసరం ఉoది.  తమ ఉనికి కోసం అస్తిత్వం కోసం మాత్రమే కాలం గడుపుతున్నారు తప్ప ప్రజా సంక్షేమం అభివృద్ధి  ప్రజల ఆకాంక్షలను అమలు చేయడంలో వాళ్ళ మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు అనడానికి ఇలాంటి పార్టీ మారిన వాళ్లు, అలక భూని   పరస్పరం విమర్శించుకునే వాళ్లను ఎంతోమందిని మనం గతంలో కూడా చూసినం.  ఈ దుర్నీతిని  రాజకీయ పార్టీల యొక్క ద్రోహాన్ని ప్రజల ముందు  పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.  చట్టసభకు రాకుండా లక్షలాది రూపాయలను వేతన రూపంలో తీసుకోవడం  ఎంత అన్యాయము  ప్రజలు ఆలోచించాలి.  చట్ట సభకు రానటువంటి సభ్యులు  ఉన్న నియోజకవర్గ ప్రజలు  ఆ ప్రతినిధి నీ బహిష్కరించాలి. ప్రజలతో పాటు చట్టాలు మారినప్పుడు మాత్రమే  రాజకీయంలో కొనసాగుతున్న  అవకాశవాదo  సమసి పోతుంది.


వడ్డేపల్లి మల్లేశం

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333