కొడవటిగంటి కుటుంబరావుగారన్నట్లు "రచయితలు  తామున్న ప్రాంతానికి ఎన్నుకోబడని ప్రతినిధులు"  నిజమేనా?

Apr 11, 2026 - 07:41
 0  0

 అయితే  ప్రజల డిమాండ్లు, ఆకాంక్షల పరిష్కారంలో  ప్రాతినిధ్య బాధ్యత స్వీకరిస్తున్నారా?* వెను తిరిగి సమీక్షించుకుంటే మంచిది.

---- వడ్డేపల్లి మల్లేశం

ప్రజలతో ఎన్నుకోబడిన వారు  ఆయా   నియోజకవర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం  ప్రతినిధులుగా చట్టసభల్లో వ్యవహరిస్తారు.  వారి సకల సమస్యల పరిష్కారంలో బాధ్యత వహిస్తారు, వహించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు బాధ్యత వహిస్తున్నారా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే అవకాశవాద రాజకీయాల   కోసమే  ప్రతినిధులు ఆరాటపడుతున్నారు కనుక. అయితే  తెలుగు సాహితీవేత్త కొడవటిగంటి కుటుంబరావు గారు  రచయితలు కవుల యొక్క కర్తవ్యాలను  ఉద్దేశించి అన్న మాటలు "  రచయితలు కవులు  తామున్న ప్రాంతానికి ఎన్నుకోబడని ప్రతినిధులు "" అని  చేసిన స్ఫూర్తివంతమైన సూచన  హెచ్చరిక గా సాహితీ రంగంలోని ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది.  పేరుకు   ప్రజల హితాన్ని కోరే వాళ్ళమని గర్వంగా చెప్పుకుంటున్న సాహితీరంగం  ప్రజల ఆకాంక్షలను సా కారం చేసే దిశలో ఏమాత్రం కృషి చేయకుండా, మొక్కుబడి సాహిత్యానికి ఎగబడి, వర్ణనకు పరిమితమై, వంతబాడే స్థాయికి  దిగజారితే మాత్రం  కొడవటిగంటి గారి మాటకు అర్థం లేదు.అలాంటి  వాళ్లు సాహితీరంగానికి అనర్హులు కూడా. " రాజకీయ రంగంలో ఉన్న ప్రజా ప్రతినిధులు  ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడి ప్రజల ఆశలు ఆకాంక్షలకు  అచ్చమైన ప్రతినిధులుగా వ్యవహరించవలసినటువంటి  పాలకులే ఈనాడు  చట్టసభలకు రాకుండా, వేతనాలను ప్రజల చెమట చుక్కల రూపంలో వచ్చిన సంపద నుండి  అక్రమంగా సొమ్ము చేసుకుంటూ,  అవినీతి అకృత్యాలకు తెగబడుతూ,  ప్రజాధనాన్ని దోచుకు తింటున్న సందర్భాలు  పత్రికల్లో కల్లారా చూస్తూనే ఉన్నాం.  

అంతేకాదు ప్రజాప్రతినిధులుగా  ఎన్ని పదవులకు ఎన్నిక అయితే అన్ని రకాల  పెన్షన్లు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ భవనాలు సౌకర్యాలకు అంతే లేదు.  విలాసవంత జీవితం, ఉన్నత స్థాయి ప్రయాణ సౌకర్యాలు  అన్నీ కూడా ప్రజలే భరిస్తున్నారు. కానీ అదే నాయకులు ప్రజల మీద స్వారీ చేస్తూ అప్పుల కుప్పలు   పెంచి   ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారు.  అసమానతలు అంతరాలను పెంచి పోషించడమే కాకుండా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ఆకాశానికి  ఎ గ దోస్తున్నారు. " సంపద ఒకరిది అయితే చాకిరి మరొక రిది,  అన్నపురాసులు ఒకచోట  ఆకలి కేకలు మరొకచోట""  అన్నటువంటి వ్యత్యాసాలతో కూడుకున్న భారతావనిలో  ప్రజా ప్రతినిధులు విస్మరించినటువంటి బాధ్యతలను కూడా  రచయితలు కవులు అనే"" ప్రతినిధులు "" అంతకు మించి ఉన్నత స్థాయిలో నిర్వహించాలని  కొడవటి గంటి  చేసిన సూచన చాలా విశిష్టమైనది. ""రచయితలు కవులకు వేతనాలు లేవు,  సెలవులు లేవు,  ప్రభుత్వ విలాస అవకాశాలు అంతకు లేవు, కొంతమంది కవులు అయితే ఆకలి కేకలతో మలమల మాడి చనిపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు.  అయినా ప్రజలే క్షేత్రంగా,  ప్రజా సమస్యల పరిష్కారo  కవితా వస్తువుగా  సేకరించి స్వీకరించి  పాలకులపై  డిమాండ్లు పరిష్కారం రూపంలో ఎక్కుపెట్టి  ప్రజల పక్షాన నిలబడే వాళ్లే కవులు రచయితలు అనే పేరు  గర్వంగా సాధించినా o  అని చెప్పడంలో సందేహం లేదు"". అయితే ఆ క్రియాశీల పాత్ర   పోషించే బాధ్యత సాహితీరంగంలోని ప్రతి ఒక్కరిపై ఉంది.

  సాహిత్య కారులు ఆ బాధ్యతను నిర్వహిస్తున్నారా?

రాజకీయ రంగంలోని ప్రజాప్రతినిధులు  అవకాశవాద రాజకీయాలకు ప్రతినిధులుగా ఉంటారు. కనుక  ఒక్కొక్కసారి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలం అవుతారు లేదా  కక్ష సాధింపు చర్యలకు కూడా పాల్పడతారు. అధికార దర్పముతో ప్రజలను  ప్రజాస్వామిక వాదులను కూడా  ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రజాప్రతినిధులు విస్మరించినటువంటి బాధ్యతలను గుర్తు చేయడం,  హెచ్చరించడం,  సూచన చేయడం ద్వారా  వాళ్లకు మించిన స్థాయిలో బాధ్యతలను మనం నిర్వహించాల ని  కొడవటిగంటి కుటుంబరావు గారి మాటల్లోని అంతరార్థం.  ప్రజా ప్రతినిధుల మాదిరిగానే  కవులు రచయితలు కూడా  బాధ్యతలు విస్మరించి, అవకాశవాద రాజకీయాలకు పాల్పడి,  వర్ణనలకు ఎగబడి,  కీర్తి కోసమే పాకులాడితే  వాళ్లకు మనకు ఏమీ తేడా లేదు.  అందుకే సాహిత్య రంగంలో పనిచేస్తున్న వాళ్లు  ఆత్మ విమర్శ చేసుకోవడం ద్వారా మనం నిర్వహిస్తున్న పాత్ర ఏమిటి? రాస్తున్న రచనలు ఏ కోణంలో ఉన్నాయి?  ప్రజలకు ప్రేరణ కల్పిస్తున్నామా? లేదా మార్గాన్ని నిర్దేశిస్తున్నామా? ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులను డిమాండ్ చేస్తున్నామా? లేదా వంగి వంగి సలాం చేస్తున్నామా?  ఊకదంపుడు రాజకీయాల మాదిరిగా ఊకదంపుడు సాహిత్యాన్ని సృష్టిస్తున్నామా?  అని పరిపరి విధాల  పరిశీలించుకొని  మనలను మనం హెచ్చరించుకోవడం,  ఆత్మావలోకనం చేసుకోవడం చాలా అవసరం. " ప్రజలతో ఎన్నుకోబడని ఆ ప్రాంతానికి చెందిన ప్రతినిధులు అంటే  ప్రగతిరథ చోదకులు  అభ్యుదయవాదులు  సామాజికవేత్తలు అనే  అర్థంలో రచయితలు  తమ బాధ్యతను  ఊహించని స్థాయిలో నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల హితాన్ని కోరేదే సాహిత్యమని  ఆ సాహిత్యాన్ని సృష్టించేవాడు సాహిత్యకారుడని  సమాజం నిన్ను గౌరవించినప్పుడు  ఆ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంతైనా స్వచ్ఛందంగా కృషి చేయవలసిన అవసరం ఉంటుంది.  ప్రజా ప్రతినిధుల లాగా  ఆడంబరాలు  అక్రమాస్తులు సంపదలు వేతనాలు   లేకపోవచ్చు.  కానీ  సమాజ హితం కోసం  మరో ప్రపంచానికి  దారులు తెరిచే మార్గం  అవగాహన  మనకే ఉన్నదని సమాజం గుర్తించి ఈ బాధ్యతను అప్పగించింది .ప్రజల కోణంలో ఆలోచించి రచనలు చేస్తే  ప్రజలను చైతన్యవంతులను చేసి  ఆచరణకు పూనుకునేలా  ప్రేరణ కల్పించగలిగితే  మన లక్ష్యం  నెరవేరినట్లే.  అభ్యుదయ భావజాలం సామాజిక అవగాహన విశాల ప్రాతిపదికన  గనుక లేకపోతే  చిన్న పరిధిలో   గీత గీసుకొన్నట్లుగా  రచనలకు పాల్పడి లక్ష్యం లేకుండా  పేరు కోసం పాకులాడితే మాత్రం ప్రయోజనం లేకపోగా సమాజానికి ద్రోహం చేసి సమాజ విద్రోహులకు  మద్దతిచ్చిన వాళ్ళం అవుతాం జాగ్రత్త .

 సాహితీకారులుగా ఏం చేయగలము?

  ప్రభుత్వం అమలు చేసే ప్రణాళికల, సాహిత్యం  యొక్క పరమ ఉన్నత లక్ష్యం  విప్లవకారుల అంతిమ లక్ష్యం కూడా సమసమాజ స్థాపన.  అంతరాలు అసమానతలు లేని సమాజాన్ని  రూపొందించుకునే కాంక్ష రచయితలకు బలంగా ఉన్నప్పుడు మాత్రమే మన సాహిత్యంలో  పదును ఉంటుంది. ప్రజలను ప్రేరేపిoచి  కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. రాజకీయ రంగం ద్వారా కానటువంటి  పనులు,  తీరని ఆకాంక్షలు, సాధించని  విజయాలు  సాహిత్యం తన సామాజిక బాధ్యతను  గతి తప్పకుండా నిర్వహిస్తే కొంతవరకైనా సాధ్యం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పోరాట సందర్భంలో  కార్యకర్తలు సామాజికవేత్తలకు సమాంతరంగా సాహిత్య రంగం కూడా తన పాత్రను పోషించడం వల్లనే  విప్లవాలు విజయవంతమైన మాట కాదనలేము. ప్రజలకు పౌరుషాన్ని ఇవ్వడంతో పాటు  కర్తవ్య నిర్వహణలో వెన్ను దన్నుగా నిలబడేది సాహిత్యం.  రాజు పేద,  పాలకుడు కార్మికుడు అనే వ్యత్యాసం లేకుండా   దేశ సంపదను అందరం సమానంగా అనుభవించగలిగినటువంటి వ్యవస్థ కోసం ఆరాటపడుతున్న వాళ్లమే .అయితే రాజకీయ పార్టీలు దాదాపుగా  కమ్యూనిస్టు పార్టీ వంటి  ఉద్యమనే పద్యము కలిగిన వాళ్లు తప్ప  సంపద కేంద్రీకరణకు,  అసమానతల కొనసాగింపునకు,  ప్రజా ఐక్యత విచ్చిన్నానికి  కార్పొరేట్  బలోపేతానికి  తద్వారా అధికారంలో కొనసాగినంత కాలం అవినీతి అక్రమాల ద్వారా సొమ్ము చేసుకోవడాన్ని మాత్రమే  కోరుకుంటున్నాయి.

గత పాలకుల  అనుభవాలు కూడా మనకు తేల్చిన విషయం అదే .కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద లేదా కొద్దిమంది చేతుల్లో ఉన్న భూమిని ప్రజలందరికీ పంచగలిగినదే నిజమైన ప్రజాస్వామ్యం, సమసమాజం.  ఆ వైపుగా భారత దేశంలో  జరిగిన కృషి నామ మాత్రమే  విద్యావ్యవస్థ లో  కూడా ప్రైవేట్ రంగాన్ని నిరసిస్తూ,  ప్రభుత్వ రంగంలో హెచ్చు నిధులను కేటాయించడం ద్వారా  సమానత్వాన్ని సాధించి,  వైరుధ్యాల తొలగించగలిగే కామన్ స్కూలు విధానాన్ని  అమలు చేయాలని 1966 కొఠారి కమిషన్ సూచిస్తే  దానివల్ల ప్రజలు సమర్ధులై చైతన్యవంతులవు తారని భయపడినారో ఏమో కానీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు  నేటి వరకు పాలకులు.  సమసామాజ స్థాపనకు  కూడా అందుకే పూనుకోరు. ప్రజలను ఎప్పుడు వంచించి బానిసలుగా చూస్తూ వారిపైన స్వా రీ చేయడానికి పాలకులు సిద్ధపడతారనేది జగమెరిగిన సత్యం.  అందుకే రాజకీయ పార్టీల యొక్క  వికృత ఆలోచన స్వార్థపూరిత  నేపథ్యంలో  ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత కర్తవ్యం సామాజిక చింతన కల కళాకారులు రచయితలకు ఉండాలనేదే కొడవటిగంటి వాదన ఆ ఆవేదన  నుండి వెలువడినదే.   1940 ప్రాంతంలో వెలిబుచ్చిన ఈ అభిప్రాయం  అంతగా  సాహిత్య లోకంలోకి రాకపోవచ్చు కానీ  ఇప్పటికీ  మన కర్తవ్యాన్ని ఆయన  మార్గంలో నిర్వహించకపోతే  మనకు  ప్రత్యేకత ఎందుకు?  సాహిత్యకారులమని గొప్పగా చెప్పుకునే అర్హత మనకు ఎక్కడిది? కాగితం పెన్ను పట్టుకుని ఏదో మనసుకు తోచింది రాస్తూ కవులం అనుకుంటే పొరపాటే.  ""సామాజిక చింతన, లక్ష్య శుద్ధి, ఆచరణ ప్రయోజనము,  తెగువ  సాహిత్య కార్ల కనీస లక్షణాలు.

  ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం చేస్తున్న కృషి  చాలా తక్కువ అని చెప్పక తప్పదు.  ఎందుకంటే ""ప్రజల హితాన్ని కోరేది  సాహిత్యం అనబడుతుందని ఒకప్పుడు నిర్వచిస్తే  ప్రస్తుతం ఆ నిర్వచనం సరిపోదు.  ప్రజలకు మేలు కావాలని కోరుకోవడమే కాదు.  మేలును ప్రజలకు చేకూర్చడంలో  పాలకుల మెడలు వంచి  పని చేయించడం కూడా కవులు  పోషించాల్సిన అదనపు బాధ్యత   అనేది నేటి వాదన .ఆ వైపుగా ఎవరికి వారు ఆలోచించుకొని తమ తమ సాహిత్య రంగాలలో  ప్రజలను జాగ్రత్తపరచడంతో పాటు పాలకులకు కూడా కనువిప్పు కలిగే రచనలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. పాలకులకు అధికారం  బలగాలు  సంపద ఉన్నాయి.  కానీ మనకు చైతన్య  ప్రజా వాహిని తోడుoది  అని తెలుసుకుంటే  అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.  సమాజమే సంపదగా  బాధ్యతలే మన ఆయుధాలుగా  స్వీకరించిన నాడు  సమాజంలోని అన్ని వర్గాలు కూడా రచయితలు కవులు కళాకారుల స్వాగతిoచి  అ క్కున చేర్చుకుంటారు.  ఆ సామాజిక బాధ్యత నిర్వర్తించే విషయంలో  మనం ఏ స్థాయిలో ఉన్నామో ఎవరికి వారు ప్రశ్నించి పరీక్షించుకోవాలి.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333