కుటుంబ ఆదరణ,సామాజిక పరిణతి, సంపద ఉత్పత్తిలో స్త్రీల పాత్ర చాలా గొప్పదే

Apr 11, 2026 - 07:34
 0  0

కుటుంబ ఆదరణ,సామాజిక పరిణతి, సంపద ఉత్పత్తిలో స్త్రీల పాత్ర చాలా గొప్పదే.

అదే సందర్భంలో  కుటుంబ బంధాల విషయంలో మాత్రం  కొంత నిందలు మోయాల్సి రావడం బాధాకరం.

 విశాల హృదయాన్ని అలవర్చుకుంటే  మహిళలు మరింత ఉన్నతలవుతారు.

--- వడ్డేపల్లి మల్లేశం 

ప్రతి మనిషికి సామాజిక వ్యక్తిగత జీవితం అంటూ ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో  మన ప్రవర్తన భావాలు,శీలము,  దయా, సానుభూతి,  సామాజిక అవగాహన,  పేదలు వృద్ధుల పట్ల  విశాల ఆలోచన వంటి  అంశాల ఆధారంగా వ్యక్తులు యొక్క  ప్రవర్తన లేదా శీలము నిర్ణయించబడుతూ ఉంటుంది. ప్రాపంచిక దృక్పథాన్ని ఎంత పెంపొందించుకుంటే అంత హృద్యంగా జీవించడానికి, ఇతరులను అర్థం చేసుకోవడానికి, భిన్న పరిస్థితులలో స్పందించడానికి అవకాశం ఉంటుంది. అయితే మొదటి నుండి కూడా పురుషులు ఎక్కువగా బయట తిరగడం  స్త్రీలు సమాజంతో సంబంధం లేకుండా కేవలం  కార్య క్షేత్రానికి లేదా ఇంటి పనులు పొలం పనులకు మాత్రమే పరిమితం కావడం వలన  ఈ అవగాహనలో  వ్యత్యాసం ఉంటున్నట్లు తద్వారా వాళ్ల యొక్క వ్యవహార శైలిలో  భిన్నాభిప్రాయాలకు కారణమవుతున్నట్లుగా సామాజిక విశ్లేషకులు  మహిళా రచయితలు అభిప్రాయపడుతున్నారు .స్త్రీల పట్ల ఎవరికి దురభిప్రాయం కానీ, ఆగ్రహం కానీ ఆవేశం కానీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే బండికి రెండు చక్రాల మాదిరిగా స్త్రీ పురుషులు కలిస్తేనే సంసారం అనే వాహనం నడుస్తున్నది.  మరింత లోతుగా ఆలోచిస్తే" ఇంటికి  దీపం ఇల్లాలు" అనే సామెత మాదిరిగా  కుటుంబ ఆలనా పాలనాతో పాటు ఇంటికి వచ్చేవాళ్లను సాదరంగా ఆహ్వానించి సత్కరించి  సత్సంబంధాలు కొనసాగించడంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ అనే అభిప్రాయం స్పష్టంగా మనం చూడవచ్చు.  వ్యవసాయ కార్మిక కుటుంబాలలో  పురుషులు  ఎప్పటికీ అందుబాటులో లేకుంటే ఇంట్లో ఉన్న స్త్రీలు కొంతవరకైనా ఆ లోటును భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.  

అంతేకాదు ఉద్యోగాలు వ్యాపారాలలో పని చేసే పురుషులు ఉన్నటువంటి కుటుంబాలలో కూడా స్త్రీలే కుటుంబానికి  ముఖచిత్రంగా పెద్దదిక్కుగా ఉన్నారు అనడంలో సందేహం లేదు.  ఇదంతా స్త్రీ పురుష  సంగమం ద్వారా ఏర్పడుతున్నటువంటి సంసారిక  వృక్ష సంపదగా మనం భావించినప్పుడు మాత్రమే  విశాలమైనటువంటి అర్థం ఉంటుంది.కానీ  దురదృష్టవశాత్తు భిన్నాభిప్రాయాలను మరింతగా పెంపొందించుకొని,  ఇతరుల యొక్క అభిప్రాయాలతో తమ వ్యక్తిత్వాలను చంపుకొని,  ఆధిపత్యంతో ఒకరిపై ఒకరు దురభిప్రాయాన్ని దుర్భాషలను పెంపొందించుకోవడం ద్వారా  పవిత్రంగా కొనసాగుతున్నటువంటి సంసార బంధాలు ఎన్నో  నిప్పుల కొలిమిలా మాడిపోతున్నాయి.  విద్యావంతులైనటువంటి మహిళలు  ఉన్నత అర్హతలు కలిగిన వాళ్లు  మృత్యుపాలవుతూ ఉంటే  పోలీస్ ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత అర్హతలు ఉన్నటువంటి పురుషులు కూడా  సరైన అవగాహన లేక, పరస్పర కోపతాపాల కారణంగా బలవుతున్నటువంటి మాట నిత్య సత్యం.  మనం దాదాపుగా ప్రతిరోజు పత్రికలు టీవీ ప్రసారాలలో గమనిస్తూనే ఉన్నాం.  ఒకప్పుడు వరకట్నానికి సంబంధించిన విషయంలో ఘర్షణలు,  వరకట్నం తెచ్చేంత వరకు ఇంటికి రానివ్వకపోవడం, అత్తవారింట్లో సక్రమంగా చూసుకోకపోవడం,  బాలింతలు  గర్భిణులు అనే సంబంధం లేకుండా హింసించడం వంటి అనేక సంఘటనలు చోటు చేసుకునేవి.  ఇటీవలి కాలంలో  వరకట్న వ్యవహారం అనేది అంతగా ప్రభావితం కావడం లేదు  కానీ దానిని మించినటువంటి ఆధిపత్య భావన ఇరు వర్గాలలో కూడా పెరిగిపోవడం, సినిమా, టీవీ సీరియల్ల కారణంగా కుటుంబాలు విచ్చిన్నమై  పిల్లలు అనాధలు కావడానికి ఆస్కారం ఏర్పడుతున్నది.

స్త్రీల పాత్రను తక్కువగా అంచనా వేయలేము 

వ్యవసాయ కుటుంబాలతో పాటు మధ్యతరగతి కుటుంబాలలో కూడా  స్త్రీలు  అనేక రకాల వ్యాపకాలలో నిమగ్నమై  కుటుంబ ఉత్పత్తులను పెంచడంతోపాటు  దేశ సంపదను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బలమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉన్న కారణంగా భారతదేశం  ప్రపంచ దేశాలలో ఉన్నత స్థాయిలో నిలబడడాన్ని మనం గ్రహించాలి. కానీ ఆధునిక పోకడలు,  అసూయ ధ్వేషా ల  ప్రభావంతో పాటు  ఆర్థికంగా ఎదుగుదల, స్వయం ప్రతిపత్తిని కోరుకోవడం, స్వేచ్ఛ స్వాతంత్రాల పైన అధిక దృష్టి సారించడం,  పరస్పర అభిప్రాయాల ఆమోదానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించడం వంటి అనేక వ్యక్తిగత కారణాలు  ఇటీవల కాలంలో పెరిగిపోయి ఘర్షణలకు వివాదాలకు చివరికి  దుష్ప్రభావాలకు దారితీస్తున్న విషయం నగ్నసత్యం. "మరికొన్ని కుటుంబాల పరిస్థితి గనక గమనిస్తే ఎంతో ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలు ఉన్న కుటుంబాలలో కూడా  ఒకరి వి యోగాన్ని మరొకరు భరించకపోవడం,  ఒకరికి జరిగిన అవమానాన్ని మరొకరు  తట్టుకోలేకపోవడం,  ఏదైనా సందర్భంలో పిల్లలు  మృత్యువాత పడితే తట్టుకోలేని సందర్భాలలో కూడా  అన్యోన్య సంబంధాలు గల భార్యాభర్తలు కూడా ఆత్మ  హత్యలకు పాల్పడుతున్న విషయాన్ని గమనిస్తే....  

ఆత్మస్థైర్యం లోపించడం, ఆత్మ గౌరవాన్ని  అతిగా ఊహించుకోవడం వలన ఇలాంటి దుస్థితి ఏర్పడుతున్నదని అర్థమవుతుంది. " ఏది ఏమైనా  స్త్రీ పురుష మానవ వనరులు అకాల మృత్యువుకు  బలి కావడం ఇటీవల కాలంలో లెక్కకు మించిపోయింది .పిల్లల భవిష్యత్తును కూడా  ఊహించకుండా తమకు తామే ఆత్మార్పణ చేసుకోవడం మరింత విచారకరం .కుటుంబ ఆలనా పాలనా చూస్తూనే పిల్లలకు జన్మనివ్వడం,  వారి వ్యక్తిగత శ్రద్ధతో పాటు పాఠశాలకు పంపించడం, ఎదుగుదలలో నిరంతరం మార్పులను గమనించడం,  సమాజంలో ఏ రకంగా మెలగాలో శిక్షణ ఇవ్వడం వంటి గురుతరమైన పాత్రను పోషించే స్త్రీలు  ఆవేశం ఆగ్రహం వంటి కొన్ని తాత్కాలిక క్షణాల కారణంగా నిందలపాలవుతున్న విషయాన్ని కూడా మనం అంగీకరించి తీరాలి.  బాధాకరమైన విషయం ఏమిటంటే  భార్యాభర్తలు ఇరువురు కూడా  ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటే ఇలాంటి పొరపొచ్చాలు వచ్చే ఆస్కారం అంతగా ఉండదు. కానీ  కొంత వెసులుబాటు ఉన్నటువంటి కుటుంబాలలోనే  అనేక రకాల  అపనమ్మకాలు,  లేనిపోని ఆరోపణలు కల్పించుకోవడం మానసిక స్థితి ద్వారా నిత్యం  ఘర్షణ చోటు చేసుకోవడం  ఏ మాత్రం కూడా సమంజసం కాదు. "భార్యాభర్తల ఘర్షణ అంటే ఉరుములు మెరుపుల లాగా ఎప్పుడో వచ్చి పోవాలి "  అంటూ పెద్దలు సెలవిచ్చారు. కానీ మనం కొన్ని కుటుంబాల చరిత్రను గమనిస్తే అలాగే ఉంటుందా? అనునిత్యం  విధ్వంసమే! ప్రతిరోజు ఘర్షనే! ఇక ఆరోగ్యానికి, సమన్వయానికి,  అభివృద్ధికి,  సమాజంలో గౌరవానికి ఆస్కారం ఎక్కడిది?  ఈ విషయాలను స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి.  

ఇక అనేక కుటుంబాలలో భర్తలు ఉద్యోగం చేస్తూ ఉంటే భార్యలు  గృహిణిగా తమ పాత్ర పోషిస్తూ ఉండడం,  కొన్ని కుటుంబాలలో భార్యలు ఉద్యోగం చేస్తుంటే భర్తలు ఎలాంటి పని లేకుండా ఖాళీగా ఉండడం వంటి వికృతమైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు.  అలాంటి సందర్భాలలో కూడా ఆవేశం, ఆగ్రహం, ఆధిపత్యం పెంచుకొని  ఘర్షణకు దిగడం ద్వారా  కుటుంబ జీవితంలో ప్రశాంతత ఎక్కడ ఉంటుంది? "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అంటూ సాగినటువంటి సినిమా గేయం యొక్క అంతరార్థం కూడా  ఆనందంతో ఉన్నప్పుడు ఉండే ఆరోగ్యము, ఆత్మీయత, అభివృద్ధి,అంతా ఇంతా కాదు."

భార్యాభర్తలు పరస్పరం దూషించుకోవడం ఒక అంశం అయితే  ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను  వారి ఆలనా పాలన పట్ల నిర్లక్ష్యం వహించడం,  బంధు వర్గంలోనూ కుటుంబ సభ్యుల మధ్యన కూడా  ఈర్ష్య అసూయ ద్వేషాలతో వ్యవహ రించడం వంటి  అంశాలు,  కుటుంబాల మధ్యన  ఆర్థిక అంతరాల కారణంగా కూడా  వైఫల్యాలు చోటు చేసుకుంటాయి.  "సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడ వ ని హృదయమిచ్చి పుచ్చుకొo టు  చిరునవ్వుతో గెలవాలని తెలుసుకొనువె యువతీ అలా నడుచుకొనవే యువతి" అని ఏనాడో 50 ఏళ్ల క్రితం  సినీ గేయంలో మనం విని ఉన్నాం.  ఇటీవల  గత దశాబ్దం క్రితం వేటూరి రాసిన పాటలో  "ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం, ఆడనే సంతోషం ఆడనే సంతాపం" అంటూ  భార్యాభర్తల జీవితంలోని  వైశ్యామ్యాలు సంతోషాలు ఆడంబరాలు ద్వేషాలను  నిర్మోహమాటంగా  వర్ణించడం జరిగింది.

"పురుషాధిపత్య సమాజం అనడంలో  ఎంత వాస్తవం లేదో  స్త్రీలు వంటింటి కుందేళ్లు అనడంలో కూడా అంతే. ఎందుకంటే స్త్రీలు  అన్ని రంగాల్లో రాణించి  ఏనాడో ఆదర్శంగా నిలిచారు.  కుటుంబ అధికారమే కాదు  వ్యవస్థల యొక్క నిర్వహణ  స్త్రీల చేతిలో   అత్యున్నతంగా కొనసాగుతూ  ఉంటే  పురుషులు కూడా  అనేక రకాల బాధ్యతలను  స్వేచ్ఛ స్వాతంత్రాలను స్త్రీలకు అప్పగించిన సందర్భాలు కోకొల్లలు.  కాలానుగుణంగా మన అభిప్రాయాలను మార్చుకోవడంతోపాటు  శక్తి సామర్థ్యాలను గౌరవించడం, వ్యక్తిగత విలువలను ఆస్వాదించడం, ఏకచత్రాధిపత్యానికి చరమగీతం పాడడం ద్వారా  అనేక రకాల వివాదాలకు దారి తీ స్తున్నటువంటి స్త్రీ పురుష సంఘర్షణలను  రూపుమాపవలసిన అవసరం ఉంది. నువ్వు ప్రేమించబడాలంటే ఇతరులను ముందుగా ప్రేమించాలి   గౌరవించబడాలి అంటే కూడా ముందుగా ఇతరులను గౌరవించాలి కదా!ఎవరో ముందు  ఈ సూత్రాన్ని ప్రారంభించాలి.అక్కడా
ఘర్షణ మరింత అవివేకం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడుఅరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా  సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333