అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి కలెక్టర్ .
జోగులాంబ గద్వాల 24 జులై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల. అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్. సంబంధిత అధికారులకు సూచించారు బుధవారం జిల్లా కలెక్టర్ ఎర్రవల్లి మండలం బీచుపల్లిలోని టి.జి. ఆయిల్ ఫెడ్, ఆయిల్ ఫామ్ నర్సరీ, ఆయిల్ ఫాంను సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ నర్సరీలోని ఆయిల్ ఫాం మొక్కలను పరిశీలిస్తూ మొక్కల సేకరణ, వాటిని నాటడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి పారుదలతో పాటు సాగుకు సంబంధించిన వివరాలను సంబంధితులయో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాకు టార్గెట్ 2 లక్షలు మొక్కలు అవసరమని, సంవత్సరం రెండున్నర్ర సంవత్సరాల నుంచి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఇంత వరకు 36,000 మొక్కలు రైతులకు పంపిణి చేశామని ఇంకను 63,000 మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. అలాగే నర్సరీలోని కల్లింగ్ మొక్కల వివరాలు సాగులో తీసుకుంటున్న జాగ్రత్తలు, మెళకువలు, ఎరువుల యాజమాన్యం, మొక్కల సంరక్షణ, కలుపు నివారణ, నీటి వసతి, ఇతర అంశాల గురించి వారు కలెక్టర్ కు తెలియజేశారు. ఆయిల్ పామ్ తో పాటు వివిధ రకాలకు చెందిన అంతర పంటలను కూడా సాగు చేసి దీని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన తరువాత నాలుగో సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభం అవుతాయని, 30సంవత్సరాల వరకు ఈ మొక్క దిగుబడి ఇస్తూ రైతులకు ఆదాయాన్ని ఇస్తుందన్నారు. ప్రభుత్వం కూడా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రాయితీలను ఇస్తుందన్నారు. రైతులు ఆయిల్ ఫాం సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. స్వల్ప పెట్టుబడితో అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫాం సాగు విషయంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక చర్యల గురించి గ్రామాల్లో ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కొండపేట గ్రామంలో ఒక రైతు యొక్క ఆయిల్ ఫాం తోటను సందర్శించారు. ఆయిల్ ఫాం తోట సాగు పద్ధతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ఆ రైతుతో సాగు మరియు డ్రిప్ ఇరిగేషన్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిమ్మాపూర్ లోని జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మెగా అయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మరో ఆయిల్ పాం తోటను సందర్శించి, అక్కడ ఓ మొక్కను నాటారు. “ఆయిల్ పాం సాగుతో రైతుల ఆర్థికస్థితిలో పురోగతి వస్తుందని తెలిపారు. మునగాల గ్రామ శివారులోని మూడు సంవత్సరాల ఆయిల్ పాం తోటను, షాబాద్ గ్రామంలో ఉన్న నాలుగు సంవత్సరాల ఆయిల్ పాం తోటను కలెక్టర్ పరిశీలించారు. తోటలోని గెలల సేకరణ, హార్వెస్టింగ్ విధానాలను పరిశీలించి రైతులకు ఆయిల్ పాం సాగుపై మరింత అవగాహన కల్పించడంపై దృష్టి సారించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉద్యాన వన శాఖ అధికారి అక్బర్ అలీ, నర్సరీ ఇంచార్జ్ చంద్ర శేఖర్ , అన్ని మండలాల ఉద్యాన వన శాఖ అధికారులు, టి.జి ఫెడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు .