హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం

Sep 14, 2024 - 16:46
 0  5
హైడ్రా చర్యలపై హైకోర్టు అసంతృప్తి: రేవంత్ సర్కారుకు కీలక ఆదేశం

హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎలాంటి నోటీసులు, సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైడ్రాను ప్రశ్నించింది.

జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ వాదించారు.

జీహెచ్ఎంసీకి యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని తెలిపారు. జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని.. కానీ, ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించారు.

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్‌పూర్‌లో సెప్టెంబర్ 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా.. కూల్చివేశారని తెలిపారు. వాదనల అనంతరం ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

కాగా, హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, నాలాల కబ్జాలపై ఫోకస్ చేసిన హైడ్రా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటివరకు 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. దాదాపు 262 అక్రమ నిర్మాణాలను కూల్చేసి.. 117 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రధానంగా అమీన్ పూర్ చెరువులో అత్యధికంగా 51 ఎకరాలకుపైగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో 7 ఎకరాలు, 8 ఎకరాల భూములను కూడా స్వాధీనం చేసుకుంది హైడ్రా. అక్రమ నిర్మాణాలను తొలగించడం ద్వారా మొత్తం 117.2 ఎకరాల భూములు స్వాధీనం అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333