హాస్టళ్లలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు భరత్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్.
ప్రభుత్వ బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ నాయకులు
జోగులాంబ గద్వాల 5 ఆగస్టు 2017 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లాలోని ప్రభుత్వ బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహాలను ఏఐఎస్ఎఫ్ నాయకులు సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం, సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు భరత్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ, హాస్టళ్లలో విద్యార్థులకు ఇంకా నాణ్యమైన భోజనం అందించాలని, నాసిరకం సరుకులతో వంట చేయడం వల్ల విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహార పదార్థాలతో భోజనం అందించాలని కోరారు.అలాగే హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్యకు తగినన్ని స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే అదనపు బాత్‌రూమ్‌లు, టాయిలెట్లు నిర్మించి పరిశుభ్రతను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో పారిశుద్ధ్య లోపం కారణంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
జిల్లా సంక్షేమ శాఖ అధికారులు వెంటనే స్పందించి హాస్టళ్లలోని సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు గంగాధర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.