సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిన సమరశీల పోరాటాల కవి అలిశెట్టి ప్రభాకర్ .

Jan 24, 2025 - 20:01
 0  2

సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిన  సమరశీల పోరాటాల కవి అలిశెట్టి ప్రభాకర్ .

గతాన్ని విస్మరిస్తే, చరిత్రను అధ్యయనం చేయకపోతే  భవిష్యత్తు నిర్వీర్యమే కదా!  

యువతఆలోచించి, అలిశెట్టి స్ఫూర్తితో సామాజిక రుగ్మతలపైయుద్ధం చేయాలి.

---  వడ్డేపల్లి మల్లేశం

సామాజిక స్ఫూర్తితో సమసమాజ నిర్మాణానికి అడ్డుగోడలైనటువంటి అసమానతలు అంతరాలను  దోపిడీ పీడన వివక్షతను  అంతం చేయడానికి  ప్రజా ఉద్యమాలతో పాటు ప్రజా కళాకారులు రచయితలు  మాత్రమే  సిద్ధంగా ఉంటారని మనకు తెలుసు. ఏ ప్రజలయితే అష్ట కష్టాలు పడుతున్నారో,  పెట్టుబడిదారులు ప్రభుత్వము  సంపన్న వర్గాల  వివక్షత కారణంగా  పీడనకు గురవుతున్నారో   వారి పట్ల ఉక్కు పాదం మోపడానికి  ప్రభుత్వాల కంటే ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రజాసంఘాలే ఎక్కువ చొరవ చూపవలసి ఉంటుంది.  ఈ రకమైన సామాజిక  అవగాహనతో  వాస్తవ విషయాలను సమాజంలోని విభిన్న వర్గాలకు అర్థం చేయించడం ద్వారా  ప్రజా చైతన్యాన్ని పెంపొందించడానికి దోహదపడాలి అనే లక్ష్యంతో ముందుకెళ్లిన  అసమానదీరుడు  ప్రతిఘటన శీలి  ప్రజాకవి  అలిశెట్టి ప్రభాకర్  అనితర సాధ్యమైన కృషిని అర్థం చేసుకోవడం చాలా అవసరం.   కేవలం ఆయన జయంతి వర్ధంతి సందర్భంగా అనే కాకుండా ఆయన  అందించి తదనంతర వారసత్వానికి మిగిల్చినటువంటి 
కార్య భారాన్ని మనము భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కళాకారులు రచయితలు  సామాజిక అసమానతలు రుగ్మతల పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.  పాలకులు, సామ్రాజ్యవాద  శక్తులు, పెట్టుబడిదారులు ఎవరితో మనకు అవసరం లేదు మనం నిజంగా ప్రజల పక్షాన ఉండే వాళ్ళం కనుక ప్రజల కోసం మాత్రమే ఎంతటి శత్రువుతోనైనా పోరాడవలసిన అవసరాన్ని  గుర్తింపచేసిన మహాకవి అలిశెట్టి ప్రభాకర్.

కవి పరిచయం మొక్కుబడిగా  కాకుండా స్ఫూర్తివంతంగా ఉండాలి.  ఆలోచనలు, గత చరిత్ర,  బాల్యం,  కుటుంబ నేపథ్యం కూడా రచయిత యొక్క ఆలోచన సరలిని   ప్రభావితం చేస్తుంది.  కుల వివక్షత పేదరికం వంటి అసమానతలను  ఎదుర్కొన్న వ్యక్తి  రచయిత కవి అయితే   ఆ అంశాల పైన సమరశీల  పోరాటాలు చేయడానికి వెనుకాడరు.  లక్ష్యం కోసం జీవించడమే తప్ప సంపాదన కోసం ఆరాటపడనటువంటి సామాజిక స్ఫూర్తి కలిగిన  రచయిత కవి అలిశెట్టి ప్రభాకర్ అంటే అతిశయోక్తి కాదు. తన కళ,  గళం, కలం   ప్రజల కోసమే అని నమ్మడమే కాదు కార్యాచరణలో కూడా ఆ వైపుగా  కొట్లాడిన వ్యక్తి కూడా. చిత్రకారుడుగా ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని కొనసాగించినప్పటికీ  ఆ వృత్తి నిర్వహణ క్రమంలో ఎదురైన సందర్భాలు సన్నివేశాలను ఆకలింపు చేసుకోవడం ద్వారా అతడు కవిగా ఎదిగినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.  కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల పట్టణంలో 1956 జనవరి 12న  ఒక సామాన్య  కుటుంబంలో జన్మించిన  అలిశెట్టి ప్రభాకర్కు ఏడుగురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు  పెద్ద కుటుంబం కావడమే కాదు తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడడంతో  11 ఏళ్ల వయస్సులో  అలిశెట్టి ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించక తప్పలేదు. అది ఒక దయనీయమైన పరిస్థితి. ఆదర్శాలు వల్లించడం కాదు  ఆచరణలో చూపిన టువంటి  అభ్యుదయ వాదిగా అలిశెట్టి ప్రభాకర్ పేద కుటుంబానికి  చెందిన  భాగ్యoను పెళ్లి చేసుకుని తన జీవిత యానాన్ని   కొనసాగించిన ప్రభాకర్ గారు  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్లపాటు సీరియల్  సిటీ లైఫ్ పేరుతో  హైదరాబాదు నగర జీవితం పైన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పైన మినీ కవిత్వం రాసి తనదైన శైలిలో ప్రపంచానికి పరిచయమైనాడు .ఆలోచనను కవిత్వంతో మేలవించి  ప్రజల్లో  సామాజిక దృక్పథాన్ని పెంపొందించే క్రమములో చైతన్యాన్ని  రంగరించినటువంటి అతికొద్ది  మంది కవులలో అలిశెట్టి ప్రభాకర్  ఒకరు మాత్రమే కాదు  ఎ  న్న దగిన  కవి అనడంలో సందేహం లేదు.  క్షయ వ్యాధి బారిన పడినప్పటికీ  తన ఆలోచనను రచనను ఏనాడు కూడా ఆపనటువంటి పట్టుదల కలిగినటువంటి కవిగా  ఆయన  1956 జనవరి 12న పుట్టి   1993 జనవరి 12న మరణించడం అనేది  యాదృచ్ఛికంగా ఒకే తేదీ కావడం గమనించదగినది..

చిత్రకారుడు ఫోటోగ్రాఫర్ గా అలిశెట్టి :-

చిత్రకారుడుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన  ప్రజల జీవితాలను కష్టసుఖాలను కన్నీళ్లను చిత్రీకరించడంలో ముందు వరుసలో  ఉన్నాడు.  ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటులు,  ప్రజల జీవన స్థితిగతుల గురించి బొమ్మలు వేసేవాడు అని తెలుస్తున్నది. చిత్రకారుడుగా పనిచేసినప్పటికీ  వైవిద్య భరితమైన జీవితంలోని పలు పార్శ్వాలను  తట్టి లేపిన  అనుభవం తదనంతర కాలంలో కవిగా నిలబడడానికి   తోడ్పడింది..  ఆకాశమంత ఆలోచన ఉన్నప్పటికీ  బతుకు తెరువు కోసం  ఆదాయాన్ని సమకూర్చే పని కోసం ఆరాటపడిన సందర్భంలో  సిరిసిల్లలో రామ్ ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకుని  ఆ అనుభవంతో 1975లో జగిత్యాల లోని సొంత ఇంటిలో  పూర్ణిమ ఫోటో స్టూడియో పేరుతో ఫోటోగ్రాఫర్ గా తన జీవితాన్ని  అధికారికంగా ప్రారంభించిన అలిశెట్టి   జీవితంలో ఎదురైన సంఘటనలు సన్నివేశాలు సందర్భాలను బట్టి  వలస బాట పట్టక తప్పలేదు.  కరీంనగర్లో శిల్పి స్టూడియో పేరుతో 1979లోనూ,  చిత్రలేఖ ఫోటో స్టూడియో పేరుతో హైదరాబాదులోనూ 1983 లో  ఫోటో స్టూడియో లను నడిపి ఫోటోగ్రాఫర్ గా జీవితాన్ని  హైదరాబాదులో కొనసాగించి  చివరి రక్తపు బొట్టు వరకు తను  ఫోటో స్టూడియో వృత్తితోపాటు ప్రవృత్తిగా సామాజిక అంశాలు రుగ్మతల పైన  తన కవితలు రచనల ద్వారా ఎక్కుపెట్టినటువంటి అలిశెట్టి ప్రభాకర్  విప్లవ కవిగా, సామాజిక మార్పుకు ప్రతినిధిగా,  సమసమాజ స్థాపనకు  పోరాడిన వ్యక్తిగా చరిత్రలో స్థిరపడడాన్ని మనం గమనించాలి. అతని ఆదర్శ  జీవితాన్ని,  సాహిత్యాన్ని, మానవతా దృక్పథాన్ని  నేటి తరం  పుక్కిట  పట్టడం చాలా అవసరం.

 సామాజిక మార్పుకు కవిగా అలిశెట్టి :-

సామాజిక చైతన్యమే ధ్యేయంగా  సాహిత్య రంగానికి  అలిశెట్టి ప్రభాకర్  జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి అనే సంస్థ పరిచయంతో  కవితా రంగంలో ప్రవేశించి  అక్కడి అనుభవాలు జ్ఞాపకాలు కవి సమ్మేళనాల  ద్వారా ప్రభావితుడైన ఆయన 19 74లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చయిన ఆయన మొదటి కవితగా చూసుకోవడంతో  మరింత  ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లినట్టు తెలుస్తున్నది.  78లో ఎర్ర పావురాలు పేరుతో అచ్చయిన  మొదటి కవిత సంకలనం  ఆయన కవితా స్థాయిని ఆకాశానికి ఎత్తగా  సిటీ లైఫ్ పేరుతో ఆరేళ్ల పాటు కొనసాగించినటువంటి మినీ కవితలు  ఆయనను  ఉద్యమ స్ఫూర్తిగా  నిలబెట్టి ఆయనకు పేరు ప్రఖ్యాతులను  సాధించిపెట్టింది.  క్షయ వ్యాధి   బాధించినా   ప్రజలకు సాహిత్య రంగానికి దూరమైతానేమోనని భావించక   భయపడక  సమాజం ముందు తన జీవితం అల్పమైనదని భావించి కాబోలు బహుశా  అనారోగ్యంతో బాధపడినా కూడా తన రచనను వదిలిపెట్టకుండా కొనసాగించి  వ్యాధి తీవ్రత కారణంగా 19 93 జనవరి 12వ తేదీన  ప్రజలందరినీ,  సాహిత్య రంగాన్ని,  సామాజిక స్ఫూర్తిని దూరం చేసి కాలగర్భంలో కలిసి పోయినాడు.  ఆయన చనిపోయి 32 సంవత్సరాలు పూర్తి అయినా అయన ద్వారా పొందిన   స్ఫూర్తి చైతన్యము సామాజిక  కోణం  నిరంతరం సాహిత్య రంగాన్ని  ప్రభావితం చేస్తూనే ఉన్నది. వారి ద్వారా ప్రేరణ  పొందిన నాటి తరం తో పాటు నేటి తరం కూడా  అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యాన్ని వారి జయంతి వర్ధంతిలను  నిరంతరం జపిస్తున్నారు అంటే  సాహిత్యం సామాజిక మార్పుకు ఎంత ప్రభావితమైన పాత్ర పోషిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.
       వారి అచ్చయిన కొన్ని కవిత సంకలనాలను  ప్రస్తావించదలచుకున్నప్పుడు ఎర్ర పావురాలు 1978లో, మంటల జెండాలు 1979లో,చురకలు 1981లో, రక్త రేఖ 1985లో, ఎన్నికల ఎండమావి 1989లో, సంక్షోభగీతం 1990లో, సిటీ లైఫ్ 1992తోపాటు  జన జీవితానికి అందించిన ఆయన చివరి రచన "మరణం నా చివరి చరణం కాదు" అని రాసి  అందరిని ఆశ్చర్యానికి గురిచేసి కానరాని లోకాలకు వెళ్లిపోవడం మనం అందరం గమనించాలి.
వేశ్యలు, అసమానతలు, పేదరికం,  వివక్షత  వంటి అంశాల పైన  తను రాసిన మినీ కవితలు  ఆలోచింపచేసి  ఆచరణకు పురికొలిపే  విధంగా  మానసిక మార్పుకు  ప్రేరణగా పనిచేసినవి  అనడంలో సందేహం లేదు .వారి భావోద్వేగాన్ని, కవిత్వాన్ని, సాహిత్యంలో వారి కృషిని,  ఆలోచన కోణాన్ని  నేటి తరం యువత రచయితలు కవులు  పునాదిగా తీసుకోవడం ద్వారా  వ్యవస్థ మార్పుకు  కృషి చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.  అంకిత భావంతో పని చేయగలిగిన నిబద్ధతను  వ్యక్తం చేయడం మాత్రమే మన ముందున్న  సామాజిక బాధ్యత అదే వారికి ఇవ్వగలిగిన ఘనమైన నివాళి.

(ఈ వ్యాసకర్త  సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు  హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333