సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో ప్రతి ఆశా పాల్గొనాలి CITU
జోగులాంబ గద్వాల 7ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు పదిన జరిగే జైల్ బరో కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి ఆశా కార్యకర్త పాల్గొనాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన ఆశా కార్యకర్తల జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాల వల్ల ఆశ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత ఉండదని, పదోన్నతులు కల్పించరని,సమ్మె చేసే హక్కు, సంఘటితం అయ్యే హక్కులు కోల్పోతారని అన్నారు. దశాబ్దాల నుండి గ్రామీణ,పట్టణ పేదలకు విస్తృతస్థాయిలో సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 24 గంటలు అత్యవసర సేవలు అందిస్తున్నప్పటికీ అతి తక్కువ వేతనాన్ని ఇస్తున్నారని, పోరాటాల ఫలితంగా ఇచ్చిన హామీలను సైతం అమలు చేయడం లేదని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఆశ వర్కర్లు పదవీ విరమణ చెందుతున్నప్పటికీ వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం లేదని, పని చేస్తున్న వారికి సైతం ఎటువంటి పదోన్నతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కనీస వేతనం 26000 ఇవ్వాలని,ఉద్యోగ భద్రత, కల్పించాలని, 50 లక్షల ఇన్సూరెన్స్ 50 వేల మట్టి ఖర్చులకు తక్షణమే జీవో విడుదల చేయాలని, ఆశాలకు పని భారం తగ్గించాలని, పారితోషకం లేని పనులు ఆశలతో చేయించరాదని ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి ఆశా కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ కు ఉదయం 10 గంటలకు చేరుకోని, జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ,సునీత కార్యకర్తలు శ్రీదేవి, శ్రీలత, చెన్నమ్మ, సంతోష, సరస్వతి, హేమలత తదితరులు పాల్గొన్నారు.