విద్యార్థులు, యువత పోరాటానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన.....
సూర్యాపేట, 25 జూలై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి వ్యతిరేకిస్తూ వారికి మద్దతుగా సూర్యాపేటలో శుక్రవారం సాయంత్రం సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, కెవిపిఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభమై వాణిజ్య భవన్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలో పాల్గొని ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విద్యార్థులు, యువత గొంతును అణచివేసే చర్యలను ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన ఉద్యమాలపై నిర్బంధాలు, దమనకాండకు పాల్పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులు, యువత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని, విద్యార్థులు, యువత న్యాయమైన పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కో లిశెట్టి యాదగిరిరావు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి మద్దెల జ్యోతి, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగురి గోవింద్, నాయకులు వీరబోయిన రవి వేల్పుల వెంకన్న, జె నరసింహారావు, మేకనబోయిన శేఖర్, బొమ్మిడి లక్ష్మీనారాయణ వల్లపు దాసు సాయికుమార్ పిండిగా నాగమణి ఉప్పుల రమేష్ మేకనబోయిన సైదమ్మ షేక్ జహంగీర్, ప్రముఖ న్యాయవాది కాలేదూ హమ్మద్, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు బయ్య మల్లికార్జున్, చిత్రం భద్రమ్మ, మండల్ రెడ్డి వెంకట్ రెడ్డి, సురేష్, దశరథ, శివతదితరులు పాల్గొన్నారు.