పోస్ట్‌కార్డు ఉద్యమానికి అపార పౌర స్పందన

Sep 7, 2026 - 22:53
Sep 7, 2026 - 22:54
 0  1
పోస్ట్‌కార్డు ఉద్యమానికి అపార పౌర స్పందన
మొదటిరోజు పౌరులు రాసిన రెండువేల కార్డులను పోస్ట్ చేస్తున్న దృశ్యం
పోస్ట్‌కార్డు ఉద్యమానికి అపార పౌర స్పందన

పోస్ట్‌కార్డు ఉద్యమానికి అపార పౌర స్పందన

 తొలి కార్డుపై సూర్యాపేట ప్రథమ పౌరురాలు మొరిశెట్టి నివేదిత సంతకం 

90 ఏళ్ల రంగయ్య చేతుల మీదుగా శిబిరానికి శ్రీకారం 

తొలిరోజే ప్రధానికి 2 వేల పోస్ట్‌కార్డులు 

 సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ జిల్లా కమిటీ 

సూర్యాపేటకు రైలు వచ్చే వరకు పోరాటం ఆగదన్న రైల్వే సాధన సమితి 

సూర్యాపేట, సెప్టెంబర్ 8 :- సూర్యాపేటకు సాధారణ రైలు మార్గం సాధించాలన్న ప్రజల చిరకాల ఆకాంక్ష మరోసారి బలంగా వ్యక్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లక్ష పోస్ట్‌కార్డులు పంపాలన్న లక్ష్యంతో రైల్వే సాధన సమితి చేపట్టిన ‘పోస్ట్‌కార్డు ఉద్యమం’ తొలి రోజే విశేష ప్రజాస్పందన పొందింది. వాణిజ్య భవన్ వద్ద ఉదయం ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగగా, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కార్డులపై సంతకాలు చేశారు. తొలి రోజే సుమారు 2 వేల పోస్ట్‌కార్డులను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు.


సూర్యాపేట రైల్వే ఉద్యమానికి సుదీర్ఘకాలంగా గొంతుకగా నిలిచిన 90 ఏళ్ల మంచాల రంగయ్య చేతుల మీదుగా ఉదయం 8 గంటలకు శిబిరానికి శ్రీకారం చుట్టారు. సూర్యాపేటకు రైలు కావాలని 13 ఏళ్ల క్రితమే అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు లేఖ అందజేసిన రంగయ్యను నిర్వాహకులు ‘రైల్వే ఉద్యమ భీష్మాచార్యుడు’గా అభివర్ణించారు.
అనంతరం సూర్యాపేట ప్రథమ పౌరురాలు, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత తొలి పోస్ట్‌కార్డుపై సంతకం చేసి ఉద్యమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సూర్యాపేటకు రైల్వే మార్గం సాధించేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె ప్రకటించారు.
ఈ సందర్భంగా మంచాల రంగయ్య మాట్లాడుతూ, “నాకు ఇప్పుడు 90 ఏళ్లు సమీపిస్తున్నాయి. సూర్యాపేటకు రైలు రావాలన్నది నా చిరకాల కోరిక. ఆ రైలు వచ్చిన రోజు తొలి టికెట్ నేనే కొనాలన్నది నా ఆశ. నా జీవితకాలంలో ఆ కల నెరవేరాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. సూర్యాపేట రైల్వే కోసం రైల్వే సాధన సమితి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందిస్తూ, లక్ష్యం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని కోరారు.
వాణిజ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రైల్వే సాధన సమితి ప్రతినిధులు “సూర్యాపేట రైలు కోసం సంతకం చేయండి... ప్రధానమంత్రికి పోస్ట్‌కార్డు పంపుదాం” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయగా, రోడ్డుపై వెళ్తున్న వారు సైతం ఆగి ఆసక్తిగా శిబిరం వద్దకు వచ్చి కార్డులపై సంతకాలు చేశారు.
పోస్ట్‌కార్డులపై తమ పేర్లు, చిరునామాలు నమోదు చేసి సూర్యాపేటకు రైలు మార్గం మంజూరు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా జాతీయ రహదారి కారిడార్ వెంట రైల్వే మార్గాన్ని విజయవాడ వైపు అనుసంధానించాలని పలువురు తమ అభిప్రాయాలను కార్డులపై రాశారు. దశాబ్దాలుగా సూర్యాపేటకు రైల్వే సౌకర్యం లేకపోవడం అన్యాయమంటూ పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఒకవైపు పోస్ట్‌కార్డులపై సంతకాల సేకరణ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ నేతృత్వంలో దాదాపు వంద మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు శిబిరానికి తరలివచ్చి రైల్వే ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.
సూర్యాపేటకు రైల్వే మార్గం సాధించేందుకు రైల్వే సాధన సమితి చేపడుతున్న కార్యక్రమాలను బడుగుల లింగయ్య యాదవ్ అభినందించారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రైల్వే సాధనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్, విద్యావేత్త, కౌన్సిలర్ అంగిరేకుల నాగార్జున, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, కౌన్సిలర్ తాహిర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కార్యదర్శి బూర బాలసైదులు, తూడి నరసింహారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోస్ట్‌కార్డు ఉద్యమం సాయంత్రం 6 గంటల వరకు ఉత్సాహంగా కొనసాగింది. తొలి రోజే దాదాపు 2 వేల పోస్ట్‌కార్డులను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించడం ఉద్యమానికి లభిస్తున్న ప్రజాస్పందనకు నిదర్శనంగా నిలిచింది. లక్ష పోస్ట్‌కార్డుల లక్ష్యాన్ని చేరుకునే వరకు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా కొనసాగించాలని రైల్వే సాధన సమితి నిర్ణయించింది.
కార్యక్రమంలో రైల్వే సాధన సమితి కన్వీనర్ డేగల జనార్ధన్, జేఏసీ చైర్మన్ చింతలపాటి చిన్న శ్రీరాములు, కో-కన్వీనర్ రాచూరి ప్రతాప్, నల్లపాటి అప్పారావు, లింగంపల్లి భద్రయ్య, కార్యక్రమ వ్యాఖ్యాత బిక్కుమల్ల ఉపేందర్, మామిడి అంజయ్య, కె. మంజుల, సముద్రాల రాంబాబు, పోతరాజు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333