వరుణుడి కరుణతో సంతోషంలో మునిగిన రైతన్నలు
తిరుమలగిరి 25 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న పంటలకు వరుణుడు ఊరట కల్పిస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందన్న వాతావరణ అంచనాలతో తొలినాళ్లలోనే రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగు ప్రారంభించినా సరైన వర్షాలు లేకపోవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలన్నది అన్నదాతలకు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా వరిని ప్రధాన పంటగా ఎంచుకున్న రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తుఫాను ప్రభావానికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో నీరసించిన పంటలకు జీవం వచ్చినట్లయింది. పొలాల్లో నీరు నిలవడంతో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అవసరమైన నీరు లభిస్తోంది. వర్షాలు ఆలస్యమైనా ప్రస్తుతం కురుస్తున్న వానలు రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. సాగు చేసిన పంటలకు కీలక దశలో నీరు అందడంతో దిగుబడిపై ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేవలం ఒకటి, రెండు భారీ వర్షాలతోనే పరిస్థితి పూర్తిగా మెరుగుపడదని రైతులు చెబుతున్నారు. పంటల కీలక దశలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లోనూ వర్షాలు సాధారణ స్థాయిలో కురవాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేయడంతో ఆందోళనకు గురైన రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వానలు కొంత ఊరటనిస్తున్నాయి. భూమి తడిసి, పంటలు పచ్చగా కళకళలాడుతుండటంతో అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. వానలు ఇలాగే అనుకూలంగా కొనసాగితే ఈ సీజన్‌లో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో వర్షం కురిస్తే పంటకు ప్రాణం పోసినట్లే. వర్షాలు ఆలస్యమైతే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకే కాకుండా రైతుల ఆశలకు కూడా గొంతు తడుపుతున్నాయి. రానున్న రోజుల్లోనూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.