కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ.

Aug 6, 2025 - 21:06
 0  0
కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్నగర్ నుండి సన్నబియ్యం పంపిణి, తిరుమలగిరి నుండి నూతన్ రేషన్ కార్డులు పంపిణి చేయటం మన జిల్లా అదృష్టం అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు లోని రామయ్య పంక్షన్ హల్ లో సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆత్మకూర్ ఎస్ మండలంకి చెందిన వారికి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మకూరు ఎస్ మండలంలో 704 నూతన కార్డుల ద్వారా 2239 మందికి సన్నబియ్యం పంపిణి అర్హత లభించిందని, అలాగే ఇప్పటికే ఉన్న కార్డులలో 1169 మందిని అదనంగా చేర్చి కొత్తగా అవకాశం కల్పించటం జరిగిందని, 1030 ఇందిరమ్మ ఇండ్లు ను మంజూరు అయ్యాయని అన్నారు. రేషన్ కార్డులు రాని వారు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కొత్త కార్డు కొరకు మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని తదుపరి అర్హత ఉంటే తహసీల్దార్ పరిశీలించి పౌర సరఫరాల శాఖ ద్వారా కార్డు మంజూరు చేస్తారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను 400 నుంచి 600 చదరపు అడుగులలో నిర్మించుకోవాలని ముగ్గులు పోసిన తర్వాత ఫొటో క్యాప్చర్ చేస్తామని బేస్ మెంట్ పూర్తి కాగానే లక్ష రూపాయలు, స్లాబ్ లెవెల్ గోడలు పూర్తి కాగానే లక్ష రూపాయలు, స్లాబ్ పూర్తి కాగానే 2 లక్షల రూపాయలు, ఇల్లు పూర్తి కాగానే లక్ష రూపాయలు ఇలా నాలుగు దశలలో 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఇండ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించుకోవాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని తాపీ మేస్త్రీలు, సిమెంటు,ఇనుము లాంటి నిర్మాణసామాగ్రి ధరలు అదుపులో ఉంచేందుకు మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేశామని ఈ బృందం సమావేశం ఏర్పాటు చేసుకొని మేస్త్రీలతో వ్యాపారస్తులతో మాట్లాడి ధరలను అదుపులో ఉంచేలా చూస్తారని అన్నారు. సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన వారందరికీ నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం ఇవ్వటం,ఇల్లులు ఇవ్వటం అభినందనీయం అని ఇండ్లు త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశానికి ఆహానించాలని లబ్ధిదారులకి సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసాక అన్ని అమలు చేయాలని సూచించారు. సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూర్ ఎస్ మండలంలో 1030 ఇందిరమ్మ ఇండ్లు అలాగే 704 నూతన రేషన్ కార్డులకి మంజూరు పత్రాలు ఈరోజు ఇస్తున్నామని అన్నారు. పేదవారికి ఇంకెవరికైనా ఇండ్లు, రేషన్ కార్డులు రానివారు ఉంటే మరల దరఖాస్తు చేసుకోవాలని పేదలు కడుపునిండా అన్నం తినాలని ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవ్, పి ఏ సి ఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ నాయక్,డి ఎస్ ఓ మోహన్ బాబు,హౌజింగ్ పిడి సిధార్థ,తహసీల్దార్ అమీన్ సింగ్, ఎంపిడిఓ మహమ్మద్ హసీం,మార్కెటింగ్ డైరెక్టర్లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ........................................... జారీ చేసిన వారు,జిల్లా పౌర సంబంధాల అధికారి, సూర్యాపేట