రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి కలెక్టర్
జోగులాంబ గద్వాల 11 మార్చి 2026తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు సమయానికి ఆసుపత్రికి హాజరవుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలిస్తూ రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ల్యాబ్ రిపోర్టులు, సర్జరీలు వంటివి వివరంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది వంద శాతం హాజరు ఉండాలన్నారు. ప్రతి రోజు హాజరు వివరాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ వ్యవస్థ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. బయోమెట్రిక్ లో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే రెండు రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు కూడా తమ హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలన్నారు. కొన్ని వార్డులలో ఫ్యాన్లు పనిచేయడం లేదని గమనించి, వాటిని వెంటనే సరి చేయించి అన్ని ఫ్యాన్లు పని చేసేలా మరమ్మత్తులు చేయాలన్నారు. ఆసుపత్రిలో ఎక్కడా పేషెంట్లు నిలబడకుండ, వారికి సౌకర్యంగా, వేగంగా వైద్య సేవలు అందేలా టోకెన్ సిస్టమ్ అమలు చేయాలన్నారు. ఆసుపత్రి టాయిలెట్లు ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేసి చార్ట్ లో రాయాలని, ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా, పిచ్చి మొక్కలు లేకుండా ఉంచాలని శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. వేసవి నేపథ్యం లో రోగులకు త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలో పలుచోట్ల ఫ్లోర్, పై కప్పు సంబంధించి ఉన్న లోపాలను సరిచేసేందుకు టీఎస్ఎంఐడీసీ సిబ్బంది రిపేర్ల వివరాలతో నివేదిక అందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసుపత్రిలో భోజనం అందిస్తున్న సిబ్బందితో మాట్లాడి పౌష్టికాహారం అందించాలన్నారు. ల్యాబ్, రేడియాలజీ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్స్‌ను పరిశీలించి, ల్యాబ్ రిపోర్టులు, ఎమర్జెన్సీ టెస్టులు త్వరగా పూర్తి చేసి రోగులకు అందజేయాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రోగులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించుకోగా, కలెక్టర్ వెంటనే స్పందించి రోగులకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్ఎంఓ హేమలత, డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.