రిజర్వేషన్ల వివరాలు సరిచూసుకొని నామినేషన్లు స్వీకరించాలి

Dec 4, 2025 - 20:48
 0  1
రిజర్వేషన్ల వివరాలు సరిచూసుకొని నామినేషన్లు స్వీకరించాలి

 జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆయా పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లను సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. 

గురువారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ భవనంలో క్లస్టర్1, క్లస్టర్2 నామినేషన్లను స్వీకరించు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ ఎర్రవల్లి తో పాటు సాసనోలు, ఆర్. గార్లపాడు తిమ్మాపూర్, షేక్ పల్లె, బీచుపల్లి, జింకలపల్లి, కొండేరు, బి. వీరాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను కూడా స్వీకరిస్తుండడంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు. పోటీ చేయు అభ్యర్థులు పూరించాల్సిన వివిధ దరఖాస్తులను, నామినేషన్ వేసేందుకు అవసరమైన ఇతర సామాగ్రిని రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారికి తగిన సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందికి సూచించారు.

సర్పంచు, వార్డు సభ్యులు పదవులకు పోటీ చేయు అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపరచాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలనీ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. పోటీ చేయు అభ్యర్థులు గ్రామ పంచాయితీకి చెల్లించాల్సిన పన్నులు పెండింగ్లో ఉండకుండా కట్టించుకోవాలన్నారు. నామినేషన్ల డిపాజిట్  స్వీకరించాక అభ్యర్థులకు రసీదును అందజేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పత్రాలను విధిగా నామినేషన్ వేసిన వారికి అందజేయాలన్నారు. నామినేషన్ వేసిన వారి వివరాలను ఎప్పటికప్పుడు టీ-పోల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. సాయంత్రం ఐదు గంటల లోగా నామినేషన్ కేంద్రం లోపల ఉన్న వారి నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, నిర్దేశిత సమయం మించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలోకి అనుమతించరాదన్నారు. 

ఈ పర్యటనలో ఎర్రవల్లి మండల తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో అబ్దుల్ సయ్యద్ ఖాన్, తదితరులున్నారు. 
..........................................

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333