మున్సిపల్ లో అందరి చూపు చైర్మన్ పీఠం వైపు

Jan 18, 2026 - 20:32
 0  77
మున్సిపల్ లో అందరి చూపు చైర్మన్ పీఠం వైపు

ఏ వర్గానికి దక్కనుందో చైర్మన్ స్థానం..? 

ఓటర్లకు అంతు చిక్కని రాజకీయం.. 

బల ప్రదర్శనలు చేయనున్న రాజకీయ పార్టీలు... 

నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల హామీలు... 

ఆశావాహులకు రిజర్వేషన్ల చిచ్చు..

ఒక్క ఛాన్స్ ప్లీజ్ ....టికెట్ కోసం ఫైరవీలు..

మలుపులు తిరుగుతున్న మున్సిపల్ రాజకీయం..

  ఎంతమందిని బుజ్జగిస్తారో ఎవరికి టికెట్ కేటాయిస్తారో. 

తిరుమలగిరి 19 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ లో రెండోసారి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపాలిటీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చ  వేడివేడిగా జరుగుతున్నది. పోయినసారి ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 4 వార్డుల్లో విజయం సాధించారు. చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోగా 5వ వార్డు కౌన్సిలర్ పోతరాజు రజిని ఛైర్పర్సన్ గా వదవి చేపట్టారు. కొంతకాలం తర్వాత 2023లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోనికి రాగానే కొంతమంది కౌన్సిలర్ లు బి ఆర్ ఎస్ పార్టీ లో గెలిచి తమ రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాటి ఛైర్పర్సన్ రజిని వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి ఛైర్పర్సన్ రజిని పై అవిశ్వాసం తీర్మానం పెట్టడంతో మరో ఏడాది పదవీకాలం ఉండగానే రజిని తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 8వ వార్డులో బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్ శాగంటి అనసూయ ను ఛైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. అయితే ఒకే టర్మ్ లో చైర్మన్ పదవి కోసం రెండుసార్లు ఎన్నిక జరగగా ఎస్సి సామాజికవర్గం నాయకులే చైర్మన్ పదవిని అనుభవించారన్నది వాస్తవం. దీంతో .. రిజర్వేషన్ వివరాలు ప్రకటించడంతో ఆశావాహుల్లో ఉత్కంఠత నెలకొంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారిలో ఆశలు చిగురించడంతో రిజర్వేషన్లు అనుకూలంగా రానివారు నిరాశతో భవిష్యత్తు వ్యూహం కోసం సిద్ధమవుతున్నారు. ఏ వార్డులో తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చింది? ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ పోటీ చేస్తే తమ విజయం ఖాయం? అనే లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తయి గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఏర్పాటు కావడం తదనంతరం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో మరో మారు ఎన్నికల వేడి కనిపిస్తోంది. పార్టీపరంగా జరిగే మున్సిపల్ వార్డు ఎన్నికలలో అధికార పార్టీ కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ పార్టీల తరఫున అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు గతంలో ఓడిపోయిన అభ్యర్థులు పోటీలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో 15 వార్డులు ఉండగా 15 వేల 455 మంది ఓటర్లు ఉండగా 7 వేల 638 మంది పురుషులు ఓటర్లు, 7 వేల 817 మహిళా మంది ఓటర్లు ఉన్నారు... 

వార్డుల వారీగా రిజర్వేషన్లు... 

1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు బీసీ, 3వ వార్డు ఎస్సీ, 4వ వార్డు బీసీ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు జనరల్ మహిళకు కేటాయించారు. అలాగే 7వ వార్డు బీసీ, 8వ వార్డు జనరల్ మహిళ, 9వ వార్డు జనరల్గా నిర్ణయించారు. మిగతా వార్డుల్లో 10వ వార్డు ఎస్టీ, 11వ వార్డు జనరల్ మహిళ, 12వ వార్డు ఎస్సీ మహిళ, 13వ వార్డు జనరల్ మహిళ, 14వ వార్డు జనరల్, 15వ వార్డు ఎస్సీకి రిజర్వ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కావడంతో రాజకీయం వేడివేడిగా ఉంది

రిజర్వేషన్లు ప్రకటనతో ముమ్మర ప్రయత్నాలు..

తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు చైర్మన్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో పోటి రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఈసారి జనరల్ స్థానానికి రిజర్వు చేశారు. వార్డు మెంబర్ గా ఎన్నికైన అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి,బిఆర్ఎస్ పార్టీలో కూడా చైర్మన్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. చైర్మన్ పీఠం దక్కించుకునేది ఎవరో వేచి చూడాల్సిందే...

టికెట్ల కోసం నేతల వేట మొదలు..!

పురపాలక సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే, రిజర్వేషన్లు ఖరారు అయ్యేసరికి టికెట్ల కోసం ఆశావాహ అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన రాజకీయ పార్టీల మంత్రులు, శాసనసభ్యులు,నియోజకవర్గ ఇన్చార్జిల ఎంపీ నివాసాలు టికెట్లు ఆశిస్తున్న నాయకులు వారి అనుచరులతో కిటకిటలాడుతున్నాయి.తమకు టికెట్ ఇస్తే గెలిచి వస్తామని భరోసా ఇస్తూ,కుల సంఘాలు,కాలనీ పెద్దమనుషులను వెంటబెట్టుకొని వెళుతున్నారు .ఎస్సీ,ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు ఎలా ఉన్నా తమకు లేదా తమ భార్యకు టికెట్ ఇవ్వాలని కొందరు ప్రయత్నిస్తున్నారు.మున్సిపల్ చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లు జనరల్ కావడంతో, ఆశావాహుల ప్రయత్నం కొనసాగుతున్నాయి అలాగే చైర్మన్ అభ్యర్థులు,వార్డు అభ్యర్థులు టికెట్ల కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు.

రాజకీయ సమీకరణాలు తారుమారు..

 తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పదవిని అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)గా ప్రకటించడంతో పట్టణ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి.ఈ నిర్ణయంతో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీ బరిలోకి దిగే అవకాశం లభించడంతో రాజకీయ పోరు మరింత తీవ్రంగా మారింది.ఇప్పటివరకు మౌనంగా ఉన్న ఆశావహులు ఒక్కసారిగా చురుగ్గా మారి,తమ బలాబలాలను పరీక్షించుకోనున్నారు. పార్టీల్లో టికెట్ల కోసం అంతర్గత పోటీ ఉధృతమవుతుండగా, కీలక నేతల మద్దతు కోసం లాబీయింగ్‌లు వేగం పుంజుకున్నాయి. తిరుమలగిరి మున్సిపల్ రాజకీయాలు ఇకపై మరింత వేడెక్కనున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఓటర్ ఊహించని రాజకీయం... 

మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా ఒక్కో వార్డుకు 15 నుంచి 20 మంది బరిలో ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ఇలా జరిగితే ఖర్చు కోట్లలో ఉండబోతుందని ఓటరు అంచనా అవకాశం కోసం ఎదురుచూస్తున్న నాయకులు యువత తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈ పుర ఎన్నిక ఊహించని ఫలితాన్ని ఇవ్వబోతుందని ఓటర్లు అంటున్నారు

కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు...

మున్సిపాలిటీని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పురపాలికలోని మొత్తం 15 వార్డులను గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. నియోజకవర్గంలో వివాదరహితుడిగా జనం మెప్పు పొందిన ఎమ్మెల్యే మందుల సామెల్ నేతృత్వంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకుంది.ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తిరుమలగిరి మోత్కూర్ రెండు మున్సిపాలిటీలు కావడంతో రెండిటిని చేజిక్కించుకోవడానికి ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే ఇటీవల కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మాజీ ఎమ్మెల్యేకు అనుకూలించేనా...?

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మోత్కూర్ తిరుమలగిరి మున్సిపాలిటీల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అయితే, శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత గాదరి కిషోర్ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు, కార్యకర్తలకు రైతుల సమస్యలకు అందుబాటులో ఉండటం ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా తిరుమలగిరి మండలానికి తీసుకురావడం,తిరుమలగిరికి కొత్త పురపాలక భవనంకు శంకుస్థాపన చేసి నిధులు తేవడం ఇంకా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమకు తోడ్పడుతాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు....

పావులు కదుపుతున్న బిజెపి... 

గత మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో పరాజయం పాలైన ఈసారి మాత్రం మెజార్టీ వార్డులను గెలిచి మున్సిపాలిటీలో పాగా వెయ్యాలని చూస్తుంది పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని బిజెపి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలను బలంగా ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని భావిస్తుంది ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండలాలలో 16 గ్రామాల్లో ఒక ఉప సర్పంచ్ మరియు కొన్ని వార్డులను గెలవడంతో మరింత బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతూ విజయం సాధించే అవకాశాలు ఉంటాయని పట్టణ ప్రజలు విశ్లేషిస్తున్నారు...

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్..!

మున్సిపల్ నగర మోగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రిజర్వేషన్లు ప్రకటించారు ఇక నోటిఫికేషన్ రావడమే తరువాయి భాగం అయితే నేడు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి నామినేషన్ వేసే లోపే అభ్యర్థుల ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు....

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి