మహిళలపై నేరాలలో  ప్రజా ప్రతినిధులా! సిగ్గు సిగ్గు

Oct 13, 2024 - 21:11
Oct 14, 2024 - 16:04
 0  2

చట్టసభల ప్రతినిధులు నేరచరిత్ర ఉన్నవాళ్లయితే  దేశానికి ఒరగబెట్టేది ఏమిటి? పెరుగుతున్న నేర ప్రవృత్తిని  కట్టడి చేయలేని పాలకులు  చేసేదే మున్నది  ప్రజల దృష్టిని మళ్లించడం తప్ప. ముప్పు నుండి ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ  కాపాడాలి.
వడ్డేపల్లి మల్లేశం 
దేశం నిండా నేరాలు జరుగుతూ ఉంటే పాలకులుగా చూస్తూ ఊరుకోవడం , స్వయంగా నేరాలలో అందులో మహిళల పైన లైంగిక దాడులలో ప్రజాప్రతినిధులు   ఉన్నప్పటికీ  చట్టాలు ఏమీ చేయకపోవడం,   చట్టసభలలో ఊరేగుతూ  అధికారం చలాయించడం  వంటి వికృత  చేష్టలకు ఆలవాలమైన దేశం  మన దేశం కావడం విచారకరం. 17వ లోక్సభలో 83 శాతం మంది  ప్రస్తుత రాజ్యసభలో 36 శాతం మంది  నేర చరిత్ర ఉన్నవాళ్లు  సభ్యులుగా కొనసాగుతున్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తుంటే  ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?  రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్  ఆశించిన ప్రజాప్రతినిధులు వీరేనా?  ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు,  పీఠికలో సుపరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు సమగ్రంగా ఉన్నప్పటికీ  పాలకులు ఆ అంశాలను  అనుకరించకపోతే  ప్రజల సంక్షేమం అభివృద్ధి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోకపోతే  ఎంత మంచి రాజ్యాంగమైనా విఫలం కాక తప్పదని   అంబేద్కర్ గారు హెచ్చరించడానికి వీరి అక్రమాలు అవినీతి అత్యాచారాలపర్వం  పెద్ద ఉదాహరణ  .అయితే అంతటితో పాలకుల అకృత్యాలను వదిలిపెట్టే సమస్య లేదు  తమ కనుకూలమైన  వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి,  పాలకుల  దుష్ట చేష్టలకు కళ్లెం వేయడానికి,  ఉన్న వ్యవస్థను కూలదోసి తమకు అనుకూలమైన వ్యవస్థను రాజ్యాంగ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని అంబేద్కర్  పదేపదే చేసిన హెచ్చరిక  ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రజా ఉద్యమాలు రావడం లేదు . అందుకే అంబేద్కర్ మాటలు  నిజం కావడం లేదు అనేదే పెద్ద ఆవేదన  అంటే ప్రజా ఉద్యమాలు తీవ్రతరమై, నేరస్తులకు శిక్షలు పడి,  ఆకృత్యాలకు పాల్పడిన వారిని కూలదోచే  ప్రత్యామ్నాయ ధోరణులు, వ్యవస్థ,  ఉద్యమాలు రావలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
        దేశవ్యాప్తంగా జరిగిన మహిళలపై అకృత్యాల విషయంలో  శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల యొక్క పాత్ర ఉన్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.  కొందరు  తప్పించుకోవడానికి ఇతర దేశాలు వెళ్లిపోయిన సందర్భాలు కూడా అనేకం.  అనేక సంఘటనల పైన ప్రభుత్వాలు  విచారణ జరిపించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి అంటే  అధికార పార్టీకి చెందిన వాళ్ల ప్రమేయం కూడా లేకపోలేదు.  సెప్టెంబర్ 9 ,2024 రోజున కలకత్తాలోని  ఆర్జీకర్  ఆసుపత్రిలో  డ్యూటీలో ఉన్న మహిళా విద్యార్థి వైద్యురాలిపై అర్ధరాత్రి జరిగిన అత్యాచారం హత్య సంఘటన అనంతరం  తప్పుడు ప్రకటన చేసిన సూపరింటెండెంట్   పై చర్య తీసుకునే బదులు ఇతర ఆసుపత్రికి బదిలీ చేయడం,  ఆ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు అనే విమర్శలు ఉన్నాయి.  ఈ పరిస్థితులన్నీ  అధికారంలో  ఉన్న వారి  అవకాశవాద
రాజకీయాలకు మచ్చుతునకగా భావించాలి . ఈ నేపథ్యంలో  దేశవ్యాప్తంగా  విస్తరించి ఉన్న నేర సామ్రాజ్యము,  మహిళల పైన లైంగిక వేధింపులు తదితర  కేసులకు సంబంధించి ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి  అఫిడవిట్లను పరిశీలించిన  ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(A D R)విడుదల చేసిన నివేదిక  మహిళలపై నేరాలలో   ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడుల విషయంలో  ఎంపీలు ఎమ్మెల్యేల  విషయంలో  తప్పు పట్టడం సిగ్గుచేటు కాథా?
  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ -
  ఆసక్తికర అంశాలు
**************
151ఎంపీలు ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను   ఎదుర్కొంటుండగా వీరిలో 16 మందిపై అత్యాచార కేసులు కూడా  ఉండడం సిగ్గుచేటు . కోల్కత్తాలో జరిగినటువంటి అత్యాచారం సంఘటన అనంతరం  అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక గగుర్పొడిచే   వాస్తవాలను వెల్లడించింది.  54 మంది ఎంపీలు ఎమ్మెల్యేలతో బిజెపి మొదటి స్థానంలో  క్రిమినల్ కేసులను ఎదుర్కొంటుండగా,  24 మందితో  కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నది  . రాష్ట్రాల వారిగా చూస్తే 25 మంది ఎంపీలు ఎమ్మెల్యేలతో ప.బెంగాల్ మొదటి స్థానంలో, 21  మందితో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో, 17 మందితో ఒడిస్సా మూడవ స్థానంలో  నిలిచినట్లు  గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  నేర చరిత్ర ఉన్నవాళ్లు  విచారణ ఎదుర్కొనే బదులు ఎన్నికల సంఘం దగ్గర నమోదైనప్పటికీ చట్టసభలకు ఎన్నిక కావడం  అంత చిక్కని విషాదం.  2019 నుండి 2024 మధ్య ఎన్నికల కమిషన్కు  ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్పించిన  4809 ఆపిడవి ట్లలో 4693నీ విశ్లేషించి  నేరాలకు సంబంధించిన నివేదిక తయారు చేసినట్లు ఆ అసోసియేషన్ పేర్కొన్నది.  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న 151 మoదిలో16 మంది ఎంపీలు 135 మంది ఎమ్మెల్యేలు  ఉంటే  లైంగిక దాడి కేసులు ఎదుర్కొంటున్న 16 మందిలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు 14 మంది సెట్టింగ్ ఎమ్మెల్యేలు  ఉండగా  వీరిపై నేరాలు రుజువైతే  పదేళ్లు లేదా జీవిత కారాగార శిక్ష అనుభవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
       నేరచరిత్ర ఉన్న వాళ్లకు  ఆయా పార్టీలు టికెట్ ఇవ్వకుండా ఎన్నికల సంఘం నిఘా ఉంచాలి.  విచారణ ఎదుర్కొంటున్న వారి పైన సమగ్ర దర్యాప్తు  జరిపించి  కేసు లోతుపాతులపై నిగ్గు తేల్చాలి . అంతేకాదు  నేరచరిత్ర క్రిమినల్ కేసులు ఉన్న వారిని ప్రజలు  ఎన్ని క లలో  నిరాకరించే చైతన్యం రావాల్సిన అవసరం ఉంది . అన్నిటికి మించి న్యాయ వ్యవస్థ  ఎన్నికల సంఘం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పరిశీలించి  ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు కేసులు నమోదైన వాళ్ళు  ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేయగలిగితే  చట్టసభలలో  నేర చరిత్ర గల వాళ్లు ఉండే ఆస్కారం ఉండదు.  అప్పుడు మాత్రమే చట్టసభలు దేశ ప్రజలకు అనువైన చట్టాలు చేయగలవు.  నేర ప్రవృత్తిని, నేరస్తులను కట్టడి చేయలేని పాలకుల  ఏలు బడిలో సామాన్యులకు న్యాయం జరిగనప్పుడు  న్యాయస్థానమే  అధికారాన్ని కైవసం చేసుకొని   చట్టసభలకు ఎంపికయ్యే ప్రజాప్రతినిధుల  స్వచ్ఛతను ధృవీకరించే  పరిస్థితులు రావాలి.  ఏడిఆర్ నివేదిక ప్రకారంగా  బిజెపి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు   నేరం ఆరోపించబడినందున  ఆ పార్టీలు వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333