బరితెగించి మద్యం బజార్లో నాట్యమాడుతుంటే తాగుబోతులు తైతక్కలాడుతున్నారు.
కుటుంబాలు వీధిన పడుతుంటే , తాగుబోతులు అనారోగ్యంతో మృత్యువాత పడుతుంటే ఏ ప్రయోజనం కోసం ప్రభుత్వం అనుమతిస్తున్నది? నిబద్ధత ఉంటే కేంద్రంతో సహా అన్ని రాష్ట్రాలు నిషేధించి చూపాలి
వడ్డేపల్లి మల్లేశం
మద్యం షాపులలో సీసాలో ఉండవలసిన మoదు రెస్టారెంట్లు, దాబాలు, పరిమిట్ రూముల పేరుతో ప్రత్యేక స్థలాలకు చేరుకుంటే మించిన స్వేచ్ఛతో తాగడానికి ఏ ప్రాంతం కూడా నిషేధం కాదు అని తెలియజెప్పే ప్రయత్నమే నేడు అనేకమంది వీధులలో కూడలిలో స్వేచ్చగా మందు త్రాగడం. మద్యం సీసాలు ముందు పెట్టుకుని పదిమందిలో తాగడాన్ని కనుక గమనిస్తే ఈ దేశంలో మనిషి బ్రతకడానికి స్వేచ్ఛ లేదు కానీ మద్యం మత్తులో తాగడానికి మాత్రం స్వేచ్ఛ ఉన్నది అనేది నడుస్తున్న చరిత్ర చెబుతున్న సత్యం . "తన సొమ్ము అయినా దాచుకొని తినాలి" అంటూ ప్రజల నోళ్ళల్లో నానిన మాటకు ఎంతో అర్థముంది తినడానికి, పడుకోవడానికి, మాట్లాడుకోవడానికి కుటుంబాలలో ప్రత్యేక స్థలాలు ఉన్నట్లు విచ్చలవిడిగా అందరి ముందు ప్రదర్శించడానికి కాదు అని మనకు అర్థమవుతున్నది. అనేక అనర్థాలకు కారణమవుతున్నటువంటి ధూమపానము మద్యపానము మత్తు పదార్థాలు డ్రగ్స్ ఇతర అనేక ప్రదర్శనలు కూడా ప్రభుత్వం మద్దతుతో, ప్రభుత్వ ప్రమేయంతో, ప్రభుత్వ పరిమితితో నడపబడుతున్న తీరు ఆక్షేపనేయం కాదా? ప్రజాస్వామిక వాదులు దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదు మద్యం తాగడానికి ఇష్టపడుతున్నటువంటి కొద్ది మంది శ్రమజీవుల పేరు చెప్పుకొని డబ్బున్న ప్రతివాడు హోదా కోసం, మత్తు కోసం, ఆడంబరం కోసం, రాజకీయాల కోసం, చివరికి ఓట్ల కోసం మద్యాన్ని వాడుకుంటున్న తీరు సమాజంలోని కోట్లాది ప్రజానీకాన్ని చెడు వైపు లాక్కెళ్ళడానికేనని అర్థమవుతున్నది. స్వేచ్ఛ అనేది తన పరిధిలో తన కోసం మాత్రమే ఉండే విషయం కానీ అది అసంబద్ధమని తెలిసినప్పటికీ ఇతరులు అనుకరించడానికి ఉంటే అది నిజంగా స్వేచ్ఛ కాదు. ఇక్కడ కూడా కొద్దిమంది శ్రమజీవులు కష్టాన్ని మర్చిపోవడానికి బాధలను నివృత్తి చేసుకోవడానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుందని చెప్పబడుతున్నటువంటి మద్యాన్ని సాధారణీకరించి షాపుల పక్కనే పర్మిట్ రూములు, దాబాలు ఇతరత్రా రెస్టారెంట్ల పేరుతో విచ్చలవిడిగా ప్రధాన రహదారుల పక్కనే ఇవి సేద తీరుతున్నాయి అంటే చట్టానికి ఆచరణకు ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన రహదారికి 500 మీటర్ల పరిధిలో ఇలాంటి షాపులు ఉండరాదని చట్టం నిర్దేశిస్తుంటే ఆ నిబంధన ఎందుకు పక్కదారి పట్టింది? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చే సమయంలో మద్యపానాన్ని నిషేధిస్తామని క్రమంగా ధరలను భారీగా పెంచడం ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి కరోనా సమయములో మద్యం షాపుల నియంత్రణ కోసం ఉపాధ్యాయులను నియమించినట్లుగా వార్తలు వచ్చినాయి. అంటే "పాలకులు ఎవరైనా ప్రజల ప్రయోజనాలు ఆరోగ్య పరిరక్షణ చూడరు, వాళ్ళ ఉనికి, ప్రభుత్వ ఆదాయం కోసమే అరులు చేస్తారని మనకు అర్థం అవుతున్నది" .అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత 15 ఏళ్లలో మద్యపానాన్ని నిషేధించాలని కానీ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలని అందుకు ఆటంకం కలిగిస్తున్న మద్యాన్ని ఇతర మత్తు పదార్థాలను ధూమపారాన్ని నిర్మూలించాలని ఆలోచన లేని పేరుకే ప్రపంచం నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన చేస్తామని నినాదాలు పలికినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ కోణంలో అడుగు ముందుకు వేయలేదు . పైగా 2014లో 10వేలకోట్ల ఆధాయముంటే trs హయాంలో అది 30వేలకోట్లు దాటింది. 2023 డిసెంబర్ 9వ తేదీ నుండి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు శుభవార్త చెబుతుందని అనుకుంటే అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఆ ఊసే ఎత్తకుండా గత మాదిరిగానే ఎక్సైజ్ విధానాన్ని కొనసాగిస్తున్నారు ఆ విషయంలో పునరాల్లోచన చేసుకుంటే మంచిది విప్లవాత్మక రీతిలో ప్రభుత్వాన్ని నడపడానికి గత నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసినామని చెబుతున్నప్పుడు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడే విధానాలను ప్రాథమికంగా ప్రాధాన్యత ఇచ్చి ప్రజల రక్షణకు, ఆరోగ్యానికి, భద్రతకు ఆటంకమైనటువంటి మధ్యపానం ఇతరత్రా ధూమపానం చెడు వ్యసనాలను ప్రభుత్వం దృఢ హస్తముతో అణిచివేయాలి గదా! ఇచ్చిన పరిమితులను రద్దు చేసుకోవాలి అలాంటి వ్యాపకాలకు చెక్ పెట్టడం ద్వారా అనేక సామాజిక రుగ్మతలు ముఖ్యంగా హత్యలు,, అత్యాచారాలు, ప్రేమ వైఫల్యాలు, ఆత్మహత్యలు, కూడా కట్టడి అయ్యే అవకాశం ఉంటుంది .
విధిలేని పరిస్థితిలో నియమిత సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల ద్వారా కొనుగోలు చేసిన మద్యాన్ని ఆ కోణంలో అలవాటు పడిన వాళ్ళు ఇంటికి తీసుకువెళ్లి త్రాగడానికి అవకాశం ఉండాలి కానీ ప్రక్కనే పరిమితి రూములను కేటాయించి మరింత సౌకర్యవంతంగా ధాబాలు రెస్టారెంట్లను ఏర్పాటు చేసి తృప్తికరమైన రుచికరమైన అల్పాహారాలను అందుబాటులో ఉంచి అక్కడే మద్యాన్ని తాగి అనంతరం ఇంటికి పోవడానికి ప్రయత్నించినప్పుడు రెస్టారెంట్ నుండి బయటకు రాగానే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పరిశీలించి తాగినట్లు తేలితే వాహనాలను సీజ్ చేయడం ఇబ్బందుల గురిచేయడాన్ని మనం గమనిస్తున్నాం .
ఇక్కడ తాగడానికి అనుమతించింది, అమ్ముకోవడానికి మద్యం షాపులకు అనుమతించింది, రెస్టారెంట్లు దాబాల పేరుతో స్వేచ్ఛనిచ్చింది కూడా ప్రభుత్వమే. వీటన్నింటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయము సమకూర్చి పెడుతుంటే ఆ ఆదాయమంత కూడా శ్రమజీవుల యొక్క చెమట రూపంలో ప్రభుత్వ ఖాతాకు జమ అవుతుంటే తాగుమని చెప్పి తాగినావా అని ప్రశ్నించడం తాగినట్లు తేలింది కనుక శిక్షించడం జరిమానాలు విధించడం ఇది ఏ పాటి విజ్ఞత అవుతుందో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. " ఈ విషయమై ఒక పోలీసు ఉన్నతాధికారిని నాకున్న చను వుతో ప్రశ్నించినప్పుడు అవును తాగడానికి అనుమతించి తాగిన తర్వాత పట్టుకోవడం అంటే న్యాయపరంగా నేరమే . బయట తాగడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా ఇంటికి తీసుకువెళ్లి తాగినప్పుడు ఈ సమస్య రాదు" అని ఆ అధికారి అన్న మాటలు నాకు చాలా వాస్తవం అనిపించినాయి. ఇదే సందర్భంలో తాగి వాహనాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని పోలీసులు ప్రశ్నించినప్పుడు మేము తాగడం వల్ల వచ్చిన డబ్బుతోనే ప్రభుత్వం కూడా పరిపాలన చేస్తుంది కదా అలాంటప్పుడు ప్రభుత్వం కూడా నేరం చేసినట్లేనా? అని కొందరు ప్రశ్నించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అంటే తాగడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు నిత్యం మత్తులోనే ప్రభుత్వాలను మెచ్చుకుంటారని అనుకోకూడదు. ప్రశ్నించడానికి సిద్ధపడతారు అని కూడా తెలుసుకుంటే మంచిది. చివరికి "మీరు అలవాటు చేయడం వలనే మేము తాగుబోతులమై అనారోగ్యం పాలైనాము, కుటుంబాలు వీధిపాలై అనేకమంది చనిపోయినాము అని సమాజం నుండి నిరసన ప్రశ్నల వర్షం కురిసే అవకాశం కూడా లేకపోలేదు . "చాలా సున్నితమైన ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఆలోచనలను కలిగించడం ద్వారా, పోషకాహారాన్ని వీలైతే పేద కుటుంబాలకు సరఫరా చేయడం ద్వారా ప్రత్యామ్నాయ వ్యవస్థ వైపు ప్రజలను తీసుకు వెళ్ళవలసిన అవసరం చాలా ఉన్నది.
ఈ విషయంలో ఏమీ చేయలేమా?:-
**********
మద్యం తాగి తనను తాను ఆత్మహత్య చేసుకున్న వారు, భార్యా పిల్లలను చంపిన వాళ్ళు, అలాగే భర్త భార్యకు అలవాటు చేసి ఇద్దరు తాగుబోతులైన కుటుంబాలు, మద్యం మత్తులో అరాచకాలకు పాల్పడిన వాళ్లు, రోడ్డు ప్రమాదాలకు బలైన వాళ్ళు , చేయకూడని పనులు చేసిన వాళ్ళు అనేకమంది తారసపడుతున్నారు. అంటే రోడ్లమీద రోడ్డు పక్కన చౌరస్తాలో గ్లాసుల్లో మందు పోసుకుని ప్రజల ముందే తాగుతూ తమ సత్తాను చూపిస్తున్నటువంటి అక్రమార్కులు, దుర్మార్గులు, తాగుబోతులు, తాగుడుకు బలే నటువంటి యువత ప్రధానంగా ఈ విషయంలో నష్టపోతున్నది. మద్యం తాగిన తర్వాత ధూమపానం మత్తు పదార్థాలు తీసుకోవడం అలవాటైన వర్గంలో యువత ఎక్కువగా ఉండడం దేశాన్ని కలచివేస్తున్న సమస్య .అది కేవలం దేశ సమస్య కాదు కుటుంబాల విచ్ఛిన్నం కావడానికి తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నష్టం చేయడానికి భయంకరంగా మారినటువంటి విష పరిణామం. క్రియాశీలకంగా ఆలోచించి నిర్మాణాత్మకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించుకోవడం లేదా ఉద్యోగం కోసం పోటీ పరీక్షలలో పాల్గొని సత్తా చాటడం అలా వీలుకానప్పుడు ప్రభుత్వ సహకారం తీసుకొని స్వయం ఉపాధిని కల్పించుకొని కుటుంబ పోషణను బాధ్యతగా స్వీకరించడం నుండి దృష్టి సారించి మద్యం మచ్చకు మత్తు పదార్థాలకు ఇతర క్లబ్బులు పబ్బులకు బానిసలు అయినటువంటి కోట్లాదిమంది యువత ఈనాడు రోడ్లమీద కనపడుతూ కొందరిని బెదిరిస్తూ మరికొందరిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కూడా ప్రభుత్వము పోలీసులు అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే అప్పుడు ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ మద్యపానం ధూమపానం ఇతర అశ్లీల దృశ్యాలు ఇతర కార్యక్రమాల వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని నివేదిక ఇచ్చేవరకు అలాగే కొనసాగిస్తాయి ప్రభుత్వాలు . నివేదిక ఇచ్చినప్పుడు కొంచెం వెనుక ముందు ఆలోచిస్తాయి. ఆ తర్వాత సర్వే రిపోర్టు చెత్తబుట్టలో దాకలవుతుంటే అదే విధంగా ఆదాయం కోసం ఆరాటపడుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయల గురించి ఆలోచించడం లేదు .ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో 1960 ప్రాంతంలోనే మద్యపానాన్ని నిషేధించడం జరిగింది ఆ తర్వాత ఇటీవల కాలంలో బీహార్, మిజోరాం , నాగాలాండ్, రాష్ట్రాలు కూడా అదే దారిలో పయనిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నాయి గుజరాత్ కు చెందినటువంటి మోడీ గారు దేశ ప్రధానిగా ఉన్నారు కదా దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని ఉద్యమంగా తీసుకురావడం ద్వారా క్రమంగా ఈ దేశంలో నిషేధం వైపు దృష్టి సారించడానికి ప్రయత్నం ఎందుకు చేయడం లేదో కేంద్రం సమాధానం చెప్పాలి. అదే సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో19 91 లో దూబగుంటకు చెందిన శేషమ్మ అధ్వర్యంలో మద్యపాన నిషేధ ఉద్యమం తీవ్రతరమైతే 19 94లో అధికారానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తూ తన తొలి సంతకాన్ని చేసిన విషయం మనందరికీ తెలుసు. "ఆమాత్రమైన ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు, ప్రజలు సహకరిస్తే , పెట్టుబడిదారులను అదుపు చేస్తే, తాగుబోతులు మనసు మార్చుకుంటే, కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మహిళలు పోరాటాలు చేసి భర్తలను మార్చుకుంటే ఆరోగ్యవంతమైన భారతావని ఏర్పడడం పెద్ద కష్టమేమీ కాదు . ముందుగా నిబద్ధత గల ప్రభుత్వాలు ఈ దేశంలో చాలా అవసరం లేకుంటే ప్రజల మూలుగలను పిల్చడానికైనా ప్రభుత్వాలు వెనకాడవు అని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి."
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)