బీసీల రాజ్యాధికారానికి చట్టసభల్లో రిజర్వేషన్ తప్పనిసరి

Apr 9, 2024 - 16:16
Jun 30, 2024 - 13:19
 0  22
 బీసీల రాజ్యాధికారానికి చట్టసభల్లో రిజర్వేషన్ తప్పనిసరి

రాజకీయ పార్టీల ద్రోహం,  ప్రభుత్వాల నిర్లక్ష్యం  

మెజారిటీ బీసీలను  వంచించడమే .

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం  సాచివేత నాన్చివేత వైఖరితో  

బీసీల పట్ల  వ్యవహరించిన   తీరుకు

బీసీ వర్గాలు  వచ్చి ఎన్నికల్లో గుణపాఠం నేర్పాలి .


---వడ్డేపల్లి మల్లేశం


సుమారు గత దశాబ్ద కాలంగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు భారీగా కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బీసీ సంఘాల యొక్క ఉమ్మడి కృషిని  పోరాటాన్ని రాజకీయ పార్టీల పైన ఒత్తిడిని అభినందించక తప్పదు. అయితే  అదే సందర్భంలో జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం పైన బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోసం రిజర్వేషన్ బిల్లును  ప్రవేశపెట్టాలని కోరినప్పటికీ ప్రభుత్వం దాటవేత సాచివేత వైఖరిని అవలంబించడాన్ని  దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో  తమ వ్యతిరేక నిర్ణయాన్ని ప్రకటించడం ద్వారా గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉన్నది.  అదే సందర్భంలో ఇండియా కూటమి వచ్చే ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారంలో వాటా కోసం ఇచ్చిన హామీని కచ్చితంగా అమలు చేసేలా  ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా దేశ బీసీ వర్గాల పైన ఉన్నది.

  ప్రధానమంత్రి కి రాష్ట్రపతికి ఉత్తరాల ద్వారా  ఉద్యమ కార్యచరణ,  సర్వోన్నత న్యాయస్థానంలో  పిటిషన్ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి బీసీ వర్గాలు చేసిన ప్రయత్నాలు,  ఢిల్లీ పురవీధుల్లో జంతర్ మంతర్ వద్ద అనేక సార్లు చేసినటువంటి బీసీ సంఘాలు, రాజకీయ పక్షాల పోరాట బావుట  కేంద్రాన్ని ఏమాత్రం కదిలించకపోవడం విచారకరం. కానీ అదే సందర్భంలో బీసీ వర్గాలకు బీసీ ప్రధాని పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్న పట్టించుకోని నిర్లక్ష్యానికి  తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే హెచ్చరిక  గమనించవలసిన అవసరం ఉన్నది.

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులకు టికెట్ ఇచ్చే క్రమములో  జనాభా, సామాజిక వర్గాల దామాషా ప్రకారం గా  ఆయా వర్గాలకు  ప్రాతినిధ్యం కల్పించినట్లయితే  ఈ రకంగా  బీసీ వర్గాలు సంఘాలు  ఇంతగా పోరాటం చేయవలసిన అవసరం ఉండేది కాదు. కానీ  సుమారు 56 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే మలచుకొని  రాజకీయ ప్రాధాన్యతను విస్మరించి  ఎన్నికల సమయంలో డబ్బున్న వారికి ఆధిపత్య వర్గాలకు మాత్రమే టికెట్ ఇస్తున్న కారణంగా బీసీ వర్గాలు రాజ్యాధికారం కోసం  చట్టసభలలో రిజర్వేషన్ కై పోరాడక  తప్పడం లేదు  .ప్రధానమంత్రి ఈ విషయం పైన స్పందించి  రాజ్యాధికారంలో వాటా కోసం బీసీ వర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు  కులపరమైన రిజర్వేషన్ ద్వారా  కులతత్వం మరింత పెచ్చు మీరే ప్రమాదం ఉంటుందని అందుకోసమే కేంద్రం సిద్ధంగా లేదని చల్లటి కబురు  తెలియజేయడం కోట్లాది ప్రజానీకాన్ని అవమానపరచడమే  .ఈ రకమైన సోయి స్పృహ బీసీ వర్గాలకు లేనంతవరకు పాలకవర్గాలు,  ఆధిపత్య వర్గాల చేతిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు  బీసీ వర్గాలను మోసం చేస్తూనే ఉంటాయి .

  సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ పైన  సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి  అభిప్రాయాన్ని తెలియజేయాలని నోటీసు ఇచ్చినప్పటికీ  ప్రభుత్వం స్పందించకపోవడం,  పైన తెలిపిన చల్లటి కబుర్లు అందించడం  ఈ దేశంలో మెజారిటీగా ఉండి కూడా మైనారిటీగా పడిపోవడానికి  అధికారానికి దూరంగా  బానిసలుగా పడి ఉండడానికి మాత్రమే బీసీలు అక్కరకొస్తారా?  ఉప ఎన్నికలతో మొదలుకుంటే సార్వత్రిక అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు  అభ్యర్థుల ఎంపిక సమయంలో బీసీ సంఘాలు ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ ఏనాడు కూడా పట్టించుకోని విషయాన్ని మనం గమనించవచ్చు . అనేక సందర్భాలలో లక్షలాది మందితో బీసీ గర్జన ,బీసీ సభలు ,ధర్నాలు ,పోరాట కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ,  అనేక ప్రతిపక్షాలకు చెందినటువంటి రాజకీయ పార్టీలు ఈ సమావేశాలు ధర్నా నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికీ  తీరా థా ము టిక్కెట్లు కేటాయించే సందర్భంలో మాత్రం  సామాజిక  నీతిని పాటించకపోవడం వలన  ఆయా వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కడం లేదు.

 ఆ వర్గ ప్రజల యొక్క ప్రయోజనాలు కూడా  నెరవేరకపోగా తాకట్టు పెట్టబడుతున్న విషయాన్ని  బీసీ వర్గాలతో పాటు సమాజంలోని భిన్న వర్గాలు కూడా ఆలోచించాలి ఇది నిజమా? కాదా? ప్రతి ఎన్నిక సందర్భంలోనూ, ఎన్నికల అయిన తర్వాత, ఫలితాలు ప్రకటించిన, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా, మంత్రివర్గంలోనూ ఇలాంటి తేడాలు  ఏకపక్షం కొన్ని వర్గాలకే ప్రాతినిధ్యం ఉండడాన్ని మనం గమనిస్తే  బీసీ వర్గాలు ఎందుకింత నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా  సోయి లేకుండా ఉంటున్నాయో అర్థం కావడం లేదు .

పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేష్ స్పందిస్తూ  గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో  రాష్ట్ర ప్రభుత్వంలో 4 గురు బీసీ మంత్రులు ఉంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం 2కి మాత్రమే అవకాశం ఇచ్చినట్లు  సామాజిక వర్గాలకు పౌర ప్రజాస్వామిక హక్కులకు ప్రాతినిధ్యం  ప్రాధాన్యత కల్పిస్తామని ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఉన్నదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో  పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు గాను  బి ఆర్ ఎస్  6గురు బీసీ అభ్యర్థులకు, బిజెపి 5 గురు బీసీ అభ్యర్థులకు  అవకాశం కల్పిస్తే,  కాంగ్రెస్ మాత్రం 3కీ మాత్రమే ఇప్పటివరకు అవకాశం కల్పించినట్లు ఇక రెండు స్థానాలకు పెండింగ్లో ఉన్నట్లు తెలియజేస్తూ  56% ఉన్నటువంటి బీసీ వర్గాలకు మొత్తం 17 స్థానాలలో సగానికి పైగా సీట్లు కేటాయించవలసిన విషయాన్ని ఈ రాజకీయ పార్టీలు ఎందుకు విస్మరించినట్లు అర్థం చేసుకోవాలని ప్రశ్నించడాన్ని బీసీ వర్గాలు స్వాగతించాలి.

  అదే సందర్భంలో  ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలను ప్రశ్నించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది.  కులపరమైన ప్రస్తావని తీస్తే కులతత్వం  అని మాట్లాడుతున్నటువంటి రాజకీయ ఆధిపత్య అధికారంలో ఉన్న పార్టీలు  ఏ నాయకత్వం  చేతిలో ప్రభుత్వం ఉంటుందో వారి సామాజిక వర్గానికి మాత్రమే అవకాశం కల్పించిన దాఖలాలను మనం గమనించవచ్చు . టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో  వెలమ సామాజిక వర్గం 0.5 శాతం ఉన్నప్పటికీ అనేక మందికి అవకాశం ఇవ్వడంతో పాటు అధికారుల స్థాయిలో కూడా రిటైర్డ్ అయిన వాళ్లను కూడా తీసుకువచ్చి వారికి ప్రాధాన్యతను ఇచ్చిన విషయాన్ని గమనిస్తే ఇది  నిజంగా ఇది కులతత్వం అనబడుతుంది. కానీ అధికారానికి నోచుకోని వర్గాలకు  అధికారం కావాలని కోరడం కులతత్వం ఎలా అవుతుందో  కుహనా రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో  కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత  అధికారులు ఇతర  పదవులు  నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీ వర్గాలకు అల్ప ప్రాధాన్యత,రెడ్డివర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా విమర్శకులు  విశ్లేషకులు అభిప్రాయపడుతున్న తరుణంలో  రాజకీయ పార్టీలను నమ్ముకుంటే  బీసీ వర్గాలకు న్యాయం జరగదు కనుక పార్లమెంటులోనే చట్టసభల  రిజర్వేషన్లు బిసి వర్గాలకు సాధించడానికి  పోరాటాన్ని ఉధృతం చేయడమే ఏకైక పరిష్కారంగా మనకు కనిపిస్తున్నది .

  ఈ విషయంలో దేశంలోని బీసీ సంఘాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి  అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటo ,హెచ్చరికలు జారీ చేసి  రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తమ సత్తాను చూపించినట్లయితే  కనీసం రాబోయే పార్లమెంటు  లోనైనా  బిల్లును అమలు చేసుకునే అవకాశం ఉంటుంది . విడివిడిగా బీసీ సంఘాలు ఎక్కడికక్కడ మాట్లాడడంతో సరిపెట్టకుండా  ఉమ్మడి పోరుబాట చేసినప్పుడు మాత్రమే బీసీ వర్గాలు ప్రజలు కిందిస్థాయి వరకు చైతన్యంతో ఎక్కడికక్కడ నిలదీసి తమ హక్కుల కోసం పోరాడినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది .సంఘాలకు మాత్రమే బాధ్యతను కట్టబెట్టకుండా ప్రజలు కూడా బి  బీసీ నాయకత్వానికి తమ చేయూత అండదండలు అందించినప్పుడు మాత్రమే  చట్టసభల రాజ్యాధికారం బీసీలకు సా కారం అవుతుంది . అప్పుడు మాత్రమే ఆధిపత్య వర్గాలు, అధికారం తమదే అనుకునే అహంకారంతో విర్రవీగే పాలకవర్గాలు తోక ముడుచుకొని పారిపోయే అవకాశం ఉంటుంది  .బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నా ప్రస్తుత  ప్రధాని కూడా తన హయాములో ఏ మాత్రం బీసీ వర్గాలకు న్యాయం చేయకపోగా  జరిగిన ద్రోహానికి  ఇప్పటికైనా పశ్చాత్తాప పడి  పొరపాటును అంగీకరించి వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది.అదే సందర్భంలో  ప్రస్తుతం హామీ ఇచ్చినటువంటి ఇండియా కూటమి పైన  కూటమిలోని రాజకీయ పార్టీల పైన  ప్రధాన బాధ్యత ఉన్నది అనే విషయాన్ని మరిచిపోకూడదు .

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333