వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి.
వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. పోషకాహారం, ఆరోగ్యం, వైద్యం కీలకం. ప్రైవేట్ రంగాన్ని విలీనం చేసుకొని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వాలు నిబద్దతను చాటుకోవాలి.
వడ్డేపల్లి మల్లేశం
27...10...2024
ఆహారమే ఆరోగ్యము, ఆరోగ్యమే జీవితము, ఆరోగ్యమే మహాభాగ్యం అని నినదించడానికి కారణం సరైన పోషక విలువలతో కూడిన ఆహారము శరీరాన్ని కాపాడడంతోపాటు మనసును ఆహ్లాదంగా అన్నింటికీ సిద్ధంగా ఉంచుతుంది . ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం చేసిన, పోషక విలువలు లేకపోయినా , ఆహారము విషతుల్యమైనా, ప్రజలకు సక్రమా హారాన్ని అందించడంలో ప్రభుత్వాలు బాధ్యత విస్మరించిన దాని ప్రభావము ప్రజల ఆరోగ్యం మీద కుటుంబ ఆర్థిక పరిస్థితుల మీద అంతా కాదు. అంతెందుకు సరైన ఆహారాన్ని తీసుకోకపోతే రోగాల బారిన పడితే అంతకు రెట్టింపు స్థాయిలో డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అంతేకాదు ఉన్న ఆస్తిపాస్తులను ఇళ్లను కూడా అమ్ముకోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు విషపూరిత వాతావరణం అలాంటి పరిణామాలను మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. వైద్యము ఆరోగ్యము పట్ల ఇంత స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఆచరణలో సరైనటువంటి అవగాహనను ప్రజలకు అందించకపోవడం, పేదరికం, పోషకాహారం ప్రజలకు అందకపోవడం, రసాయనఎరు వులు పురుగు మందులు రసాయన పదార్థాల వినియోగం పంటల ఉత్పత్తిలో విరివిగా వినియోగించడం, గొర్లు మేకలు, కోళ్లు ఇతర మాంసాహారం విషయంలో కూడా మందుల వాడకం ఘననీయంగా పెరగడంతో రోగాల బారిన పడక తప్పడం లేదు. ఇన్ని రకాలుగా అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తగిన వైద్యాన్ని ఉచితంగా నాణ్యమైన స్థాయిలో అందించడానికి ప్రభుత్వానికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండాలి కదా! భారతదేశవ్యాప్తంగా బడ్జెట్ కేవలం రెండు శాతం కూడా దాటనటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యశాలల మీద ఆధారపడి ఆరోగ్యశ్రీ ఇతర రియంబర్స్మెంట్ పేరుతో ప్రైవేట్ హాస్పిటలకు వైద్య చికిత్సకు పంపిస్తూ ఉంటే ఒకవైపు ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నాయి అదే స్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు. ఈ పరిస్థితులలో కోట్లాది రూపాయలను ప్రైవేటు హాస్పిటల్ లకు ఖర్చు చేసే బదులు ఆ నిధులతోనే ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు అమలులో ఉన్నటువంటి ప్రైవేటు ఆసుపత్రులకు డబ్బులు చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా యంత్ర పరికరాలు సౌకర్యాలు సిబ్బంది మందులు భవనాలను సంతృప్తి స్థాయిలోపల ప్రజలకు అందించవచ్చు కదా అని ప్రజలు కోరుతున్నారు.
ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి:- రాజ్యాంగంలో హామీ ఇచ్చిన విధంగా ఉచిత, నాన్యమైన విద్యతోపాటు వైద్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం ప్రభుత్వాల యొక్క కనీస బాధ్యత అయినప్పటికీ స్వాతంత్ర అనంతరం 77 సంవత్సరాల లో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికీ హామీఇచ్చింది లేదు ఆలోచన కూడా చేయకపోవడం మరీ విడ్డూరం. ప్రైవేటు పెట్టుబడిదారులకు మద్దతుగా ప్రభుత్వాలు మొక్కుబడి విద్య వైద్య రంగాలను కొనసాగిస్తున్నాయి కానీ చిత్తశుద్ధిగా అమలు చేసినట్లయితే మరింత పెద్ద మొత్తంలో ప్రజలకు ఉచితంగా సేవలు అo దే అవకాశం ఉంటుంది తద్వారా వాళ్ళ కొనుగోలు శక్తి పెరగడం ఖర్చులు తగ్గడంతో పేదరికం కూడా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రాథమిక అవసరాలు మాత్రమే ప్రభుత్వ వైద్యశాలలో తీరుతుంటే మిగతా అన్ని రకాల పరీక్షలు స్కానింగ్ ఎంఆర్ఐ ఇతరత్రా ఖర్చుతో కూడుకున్న పరీక్షలు చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లక తప్పడం లేదు. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పటికీ కూడా కిందిస్థాయి సిబ్బంది సిఫారసు చేస్తే పై స్థాయి సిబ్బంది ఆమోదించకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, చికిత్స చేయకపోవడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం ఒకే రంగంలో కొనసాగినట్లయితే సేవలు ప్రజలకు మరింత నాణ్యతగా అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు చికిత్స ఉచితంగా అందించడం తన సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవడం ద్వారా నష్టపరిహారాన్ని చెల్లించి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత వైద్యాన్ని అందించడానికి పూనుకున్నప్పుడు మాత్రమే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు. కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ఎక్కడ కూడా అలాంటి మెరుగైన చికిత్స విధానం అమలులో లేదు దీనికి పాలకులు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఎంతగానో. ఉన్నది. ఇప్పటికైనా ఉచితాలు ప్రలోభాలు తాయిలాలను పక్కనపెట్టి విద్యా వైద్యాన్ని బృహత్ కార్యక్రమంగా తీసుకొని అమలు చేసినట్లయితే ఆ ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్తారు ప్రజల ఆకాంక్షలు అప్పుడు మాత్రమే నెరవేరినట్లు లెక్క. పాలకులు ఇతర రాజకీయ పార్టీల యొక్క బంధువులు దగ్గరి వాళ్ళు ప్రైవేట్ రంగంలో కొనసాగిస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడం, స్థలాలు ఇతర రాయితీలను సమకూర్చడం ద్వారా ప్రభుత్వమే ప్రైవేటు రంగాన్ని పెంచి పోషించిన విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి తమ నిర్బంధంగా స్వాధీనం చేసుకోవడం ద్వారా తన యొక్క సామాజిక బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తద్వారా లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్న చికిత్సకు కూడా పేద వర్గాలు అయితే ఒక రూపాయి చెల్లించకుండా చికిత్స పొందడం వలన నిజమైనటువంటి సౌకర్యం ప్రజలకు లభించినట్లు అవుతుంది.నిబద్దత గల వైద్య సిబ్బంది నిపుణులకు సరైన ప్రోత్సాహ o, గుర్తింపు రావాలాన్నా, అనుభవాలు వినియోగించి మెరుగైన చికిత్స అందించాలన్నా ప్రయివేటు రంగంలోని సిబ్బంది వనరులను వినియోగించుకోవాలి. అనుభవాన్ని బట్టి హెచ్చు వేతనాలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ పద్ధతిని మానుకొని హెచ్చుగా సేవలు పొందడం పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించాలి.
ప్రభుత్వ రంగాన్ని కూడా సంస్కరించాలి :- క్రింది స్థాయి వైద్యశాలలోని సిబ్బంది సిఫారసు చేస్తే పై స్థాయిలో ఉన్న ఆసుపత్రి డాక్టర్లు విధిగా పరిశీలించి ఆ చికిత్సను అందించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి. నిర్లక్ష్యానికి అవినీతికి దుర్వినియోగానికి ఎలాంటి తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ రంగంలో మరీ కీలకం. జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తున్నటువంటి వెల్నెస్ సెంటర్లలో ఉద్యోగులు పెన్షనర్లు పోలీస్ సిబ్బంది జర్నలిస్టులకు ప్రత్యేకమైన చికిత్స కొనసాగుతున్నది. అయితే అక్కడ కూడా అన్ని రకాల పరీక్షలు స్కానింగ్ ఎంఆర్ఐ వంటి సౌకర్యాలతో పాటు వివిధ రంగాల నిపుణులను ఏర్పాటు చేయడం ద్వారా సీనియర్లకు అవకాశం ఇస్తే మరింత నాణ్యమైన చికిత్స అందే అవకాశం ఉంటుంది. ఇక ఉపకేంద్రం నుండి ప్రాథమిక కేంద్రం, సామాజిక కేంద్రము, 100, 200 పడకలు ఈ రకంగా అత్యున్నత స్థాయి ఆసుపత్రుల వరకు కూడా అన్ని రకాల చికిత్సలు నిపుణులను నియమించడం ద్వారా రోగులకు సమీపంలోనే చికిత్సలు అందే ఆస్కారం ఉంటుంది. వెల్నెస్ సెంటర్లలో ఏ రకమైనటువంటి మందులు చికిత్సలు అందుతున్నాయో అందవలసిన అవసరం ఉందో అలాంటి ఏర్పాట్లనే మిగతా అన్ని ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేయడం ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన చికిత్సకు అవకాశాలుంటాయి. ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాల్లో సరఫరా చేస్తున్న మందులలో నాణ్యత మరింత పెంచాలి. ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ స్థాయిలో నాణ్యమైన చికిత్సలను అందించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూర గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత పెద్ద చికిత్స అయినా ప్రభుత్వ రంగంలోనే కొనసాగినట్లయితే ప్రజలు మరింత ఉత్సాహంగా చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది. అరకొ ర సౌకర్యాల మధ్య ప్రైవేటు ఆసుపత్రిలోకి లక్షల రూపాయలు ఖర్చు చేయాలని అనుకున్నప్పుడు ప్రజలు నిర్లక్ష్యం చేయడంతో రోగాలు ముదిరి మరింత వీధిన పడుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించాలి. విద్యార్థులతో పాటు ప్రజలందరికీ కూడా ప్రతి ఏటా విధిగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితిలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తద్వారా ముందు జాగ్రత్తగా చికిత్సలను అందించడానికి వీలుపడుతుంది. గతంలో కొనసాగిన మాదిరిగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల యొక్క వైద్య ప్రగతి నివేదికలను నిర్వహించడం ద్వారా నేటి బాల భారతాన్ని రేపటికి సంసిద్ధం చేయవలసిన అవసరం ఉంది. అంతే కాకుండా అనారోగ్యం బారిన పడుతున్నటువంటి వ్యవస్థను అట్లాగే కొనసాగిస్తే నిర్లక్ష్యంగా పట్టించుకోకుంటే దాని ప్రతిఫలం ప్రభుత్వాలు అనుభవించవలసి వస్తున్నది. అంటే మితిమీరిన ఖర్చుతో కూడుకున్న చికిత్సలు భవిష్యత్తులో చేయవలసి ఉంటుంది. తగు సమయంలోనే చేసినట్లయితే ఆ వృధా తప్పుతుంది కదా! ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం ఒక విప్లవాత్మక చర్య అప్పుడు బడ్జెట్ను కనీసం 10 శాతానికి పెంచినట్లయితే మాత్రమే ఈ రకమైనటువంటి సేవలు సంతృప్తికరంగా అందించడానికి అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రం ముందుగా పోటిపడుతుందో వేచి చూద్దాం.
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు,అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు సిద్దిపేట తెలంగాణ)