బా రాస ప్రభుత్వం గూర్చిన కొన్ని చేదు నిజాలు
తెలుసుకోకుంటే ఈ ఎన్నికల్లో మళ్ళీ మోసపోయే ప్రమాదమే కదా! ఈ నిజాలు రాబోయే ప్రత్యామ్నాయ ప్రభుత్వాలకు గుణపాఠం అయితే సంతోషిద్దాం.*
ప్రజలు మాట్లాడితే ప్రశ్నిస్తే విని సమాధానమిచ్చే ప్రభుత్వాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వం అంటారు . ప్రజలకు అవకాశం లేకుండా ప్రభుత్వమే నిర్బంధంగా ప్రజలతో ఒప్పించి తన విధానాన్ని అమలు చేసే ప్రభుత్వాన్ని నియంతృత్వం అంటారు . కేంద్రంలోని బిజెపి సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలోని brs ప్రభుత్వం రెండు కూడా రెండవ రకానికి చెందినవే .ప్రజల స్వేచ్ఛను అడ్డుకొని, బావ ప్రకటనకు అవకాశం లేని, ప్రశ్నించడానికి అర్హత లేని, రాజ్యాంగబద్ధ హక్కుల కోసం పోరాడే స్వేచ్చ లేని భయంకరమైన నిర్బంధ పూరిత వాతావరణంలో తెలంగాణ ప్రజలు, మేధావులు, హక్కుల కార్యకర్తలు, ప్రజాసంఘాలు పదేళ్లుగా ఆరిగోశపడ్డ విషయాన్ని గమనిస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ రకమైనదో అర్థం చేసుకోవడానికి మరింత సులువు అవుతుంది . పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం లేకుండా, ఉచితాలు ప్రలోభాలను ప్రజల మీద కుమ్మరించి, ప్రజల అవసరాలను గుర్తించని ప్రభుత్వం మూడవసారి అవసరం లేదని ప్రజలు ఓటర్లు ధృడ నిర్ణయం తీసుకోవడమే కాదు అలాంటి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని చూస్తున్న వేళ గత పది ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన , ప్రజలకు తెలవకుండా దాచబడిన కొన్ని విషయాలను చేదు నిజాలను ఈ సందర్భంగా ప్రస్తావించడం చాలా అవసరం .బారాస ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవడానికి రాబోయే ప్రత్యామ్నాయ శక్తులకు గుణపాఠంగా మిగలడానికి కూడా ఈ వాస్తవాలు ఉపయోగపడతాయి .పడాలి కూడా.
ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర పరిపాలన చేస్తామని మాట ఇచ్చి అధికారానికి వచ్చి ప్రధానమైన హామీలను తుంగలో తొక్కి ఉచితాల పేరుతో కొద్దిమందికి మాత్రమే ప్రజలందరి ధనాన్ని పంచి పెడుతూ పెట్టుబడిదారీ ప్రభుత్వంగా మిగిలిన సందర్భంలో ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆత్మగౌరవం అడుగంటి, ఆకాంక్షలు తుంగలో తొక్కబడి, 1400 మంది అమరవీరుల త్యాగాలకు వెలలేని సందర్భంలో అమానవీయ కోణంలో పని చేసిన ప్రభుత్వంగా భావించాలి. అదే సందర్భంలో వాస్తవాలను ప్రజలకు విప్పి చెప్పి మరో మారు మోసపోకుండా చూసుకోవాలి .
కొన్ని వాస్తవాలు చేదు నిజాలు :-
"""""*******""
-- తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ జేఏసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను కేసీఆర్ అడ్డుకున్నట్లుగా ప్రొఫెసర్ కోదండరాం మాటల్లో తెలుస్తున్నది .అందులో భాగమే సాగహారం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉమ్మడి ప్రభుత్వాన్ని గడగడలాడించిన సందర్భంలో అడ్డుకోవడమే కాకుండా హైదరాబాదులో లేకుండా కెసిఆర్ ఢిల్లీ వెళ్లడం ఎవరికి తెలియకుండా దాచబడిన రహస్యం . కెసిఆర్ లేకుండానే సమున్నతంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమం వల్లనే తెలంగాణ ఇచ్చినట్లు పరిశీలకులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-- 2018లో అఖిలపక్ష సమావేశాలను విధిగా నిర్వహిస్తానని హామీ ఇచ్చి ఏనాడు అమలు చేయక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర అందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది.
-- సుపరిపాలన అందించాలన్న, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్న మేధావులు హక్కుల కార్యకర్తలు బుద్ది జీవులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. తెలంగాణ ఉద్యమ కాలంలో వీరి సహకారం తీసుకొని ఏర్పడిన తర్వాత ఏనాడు కూడా పలకరించలేదు, చర్చించలేదు, అవకాశం ఇవ్వలేదు, నిరంకుశంగా వ్యవహరించి కేసులుపెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే .
--- ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ హయాంలో రూపొందిన నిరసన వేదిక ధర్నా చౌక్ ను నిర్బంధంగా రద్దు చేయడమే కాదు, ప్రజాస్వామ్యం గొంతు నొక్కిన మాదిరిగా 16 ప్రజాసంఘాలను నిషేధించి తన అక్కసు తీర్చుకొని ప్రజాసంఘాల పోరాటం తర్వాత విధిలేని పరిస్థితులలో పునరుద్ధరించినట్లు ప్రొఫెసర్ హరగోపాల్ గారి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు.
-- రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పరిపాలన పైన దృష్టి పెట్టవలసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి సుమారు 460 కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ ను నిర్మించుకొని మంత్రులకు శాసనసభ్యులకు అధికారులకు ఎవరిని అనుమతించకుండా ఇప్పటికీ నిర్వహించబడుతున్న నిర్బంధ విధానం ఏ విలువల కోసమో! ఇది నియంతృత్వం కాదా!
-- దాదాపు సచివాలయానికి ఏనాడూ రాకుండా ప్రజలకు కలిసే అవకాశం ఇవ్వకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కంటే కఠినంగా వ్యవహ రించిన విషయం నిజం కాదా!
-- ఫామ్హౌజుల సంస్కృతి కారణంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం సమస్యలు ఎవరితో చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ప్రజలు అనాధలుగా మిగిలింది నిజం కాదా?
-- 9న్నర ఏళ్లలో సుమారు బారాస ప్రభుత్వం 18 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే పేదరికం నిర్మూలించబడలేదు, అక్షరాస్యత దేశ సగటుకు చేరలేదు, నిరుద్యోగం ఆకలి చావులు ఆత్మహత్యలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే .
-- కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో ఉన్న నల్లధనం 72 లక్షల కోట్ల రూపాయలను తెచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలను వేస్తానని ఇచ్చిన హామీ ఎంత అభాసుపాలయిందో అదే స్థాయిలో రైతుబంధులో పేద వర్గాలకు కాకుండా భూస్వాములు పెట్టుబడిదారులు సినిమా యాక్టర్లు క్రీడాకారులు సంపన్న వర్గాలకే 27 వేల కోట్ల రూపాయలు పండిo చకున్నా అప్పనంగా చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అభాసు పాలైన విషయాన్ని అంగీకరించి తీరాలి.
-- ముఖ్యమంత్రి భూముల అమ్మకాలు ప్రాజెక్టులు ఇతర నిర్మాణాలలో మొత్తం లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్లు బిజెపి, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటిస్తుంటే దేశ ప్రధానమంత్రి కూడా అవినీతిపై ఉక్కు పాదం మోపుతామని అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని ప్రకటించడం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టినట్టే కదా!
-- తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టిఆర్ఎస్ ఏర్పడిన నుండి ఎన్నికల్లో మద్యం డబ్బు ఎన్నికల వ్యయం భారీగా పెరిగిందని ,ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడి నియంత పోకడలు కొనసాగుతున్నాయని, కుటుంబ పాలనకే రాష్ట్రం పరిమితమైనదని ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు మేధావులు విమర్శిస్తుంటే ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు .
--- ఉమ్మడి రాష్ట్రం కంటే విద్య వైద్యం మీద అతి తక్కువ ఖర్చు చేస్తూ పై రెండు రంగాలను పూర్తిగా ప్రైవేటుపరం చేయడంతో పేద ప్రజల విద్యా హక్కు తుంగలో తొ క్కబడింది. పేదల కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమాలు లేకపోగా ఉద్యోగ ఉపాది రంగాలు నిర్వీర్యమై 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు పాలు కావడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియ లీకేజీ పరంగా ప్రభుత్వ బాధ్యత లేదా ?
రాష్ట్రవ్యాప్తంగా అత్యాచారాలు, అకృత్యాలు, విచ్చలవిడిగా మద్యం ఏరులై పారి అనేక కుటుంబాలు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే, అశ్లీల క్లబ్బులు పబ్బులు ఈవెంట్లతో రాష్ట్రమంతా అబాసపాలవుతుంటే, ఉచిథా ల పేరుతో కేవలం కొన్ని కుటుంబాలను దగ్గర చేసుకోవడం వలన రాష్ట్రంలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని సుపరిపాలనను మేధావులు మెచ్చిన నిర్వహణ ఇవ్వలేకపోయింది. నిర్బంధం అణచివేత కొనసాగుతూ, ఉపా దేశద్రోహ చట్టం మేధావుల పైన మోపబడుతుంటే సామాన్యుల నుండి అసమానుల వరకు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత కాకుండా ఎందుకు సమర్థిస్తారు ఆలోచించుకోవాలి . ఈ హెచ్చరికలు లోపాలు ప్రస్తుత ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగిస్తే , రాబోయే ప్రత్యామ్నాయ శక్తులకు హెచ్చరికలుగా దారి దీపాలుగా తొందరపాటుకు గురికాకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు. ప్రభుత్వాలు ఎప్పుడైనా మేధావుల పర్యవేక్షణలో అఖిలపక్షాల సూచనలతో కొనసాగితేనే వాటి మనుగడ గొప్పగా ఉంటుంది............... లేకుంటే ప్రశ్నార్థకమే.
---వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )