బాలల చట్టాల పై అవగాహన
తిరుమలగిరి 02 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పరిధిలోని అనంతారం లో గల తెలంగాణ మోడల్ స్కూల్ లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సూర్యాపేట జిల్లా వారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు విద్యార్థులకు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులకు బాలల హక్కులు, బాలలపై జరుగుతున్న నేరాలు, వాటి నివారణకు ఉన్న చట్టాలు గురించి వివరించారు.
ప్రతి విద్యార్థి సురక్షితంగా మరియు గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉంటారని తెలిపారు. బాలలపై జరిగే వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి సమస్యలు చట్టపరంగా నేరాలని చెప్పారు. ముఖ్యంగా పోక్సో చట్టం (POCSO Act) గురించి వివరించి, బాలలపై లైంగిక దాడులు జరిగితే వెంటనే ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.
అలాగే, ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలని, సోషల్ మీడియా ద్వారా అపరిచితులతో మాట్లాడకూడదని విద్యార్థులకు తెలియజేశారు. సందేహాస్పద పరిస్థితులు ఎదురైతే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు కాల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో బాలల హక్కులపై అవగాహన పెరిగి, తమను తాము రక్షించుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ Dr.సంజీవ్ కుమార్ మరియు DCPU సిబ్బంది లక్ష్మీనర్సయ్య చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కేస్ వర్కర్ ఉమామహేశ్వరి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.