ప్రాణాలైనా అర్పిస్తాం అండర్ పాస్ అడ్డుకుంటాం

Sep 22, 2024 - 16:55
Sep 22, 2024 - 23:17
 0  773
ప్రాణాలైనా అర్పిస్తాం అండర్ పాస్ అడ్డుకుంటాం

తిరుమలగిరి 22 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో సూర్యాపేట_జనగాం హైవే పైన ఏర్పాటు చేసే అండర్ పాస్ ను ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను పణంగా పెట్టైనా అడ్డుకుంటామని అండర్ పాస్ నిర్మాణ వ్యతిరేక కమిటి సభ్యులు అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలోని వంగపల్లి నర్సయ్య ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ చౌరస్తాలో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే ఎంతోమంది జీవితాలు అండర్ పాస్ నిర్మించడం వల్ల అంధకారమైపోతాయని చెప్పారు. వలిగొండ నుండి తిరుమలగిరి మీదుగా తొర్రూర్ వరకు నేషనల్ హైవే పనులు సాగుతున్నాయని, తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం ఇప్పుడిప్పుడే వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో తెలంగాణ చౌరస్తాలోని హైవే రోడ్డుపై అండర్ పాస్ ఏర్పాటు చేయడంతో పాత గ్రామానికి ఎక్స్ రోడ్డుకు అడ్డంగా గోడ కట్టినట్లుగా ఉంటుందని తెలిపారు. సూర్యాపేట_జనగాం, వలిగొండ_తొర్రూర్ రోడ్డు కు ఇరు ప్రక్కల ఎంతోమంది చిరు వ్యాపారులు చిన్న చిన్న షాపులు, రోడ్డు పక్కన తోపుడు బండ్లు, బట్టి కొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారని, అండర్ పాస్ తో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని, చిరు వ్యాపారుల సుమారు 500 కుటుంబాలు, ఆయా షాపులలో పనిచేసే మందితో కలిపి 1000 కుటుంబాలు వీధిన పడతాయని తెలిపారు. తిరుమలగిరి అభివృద్ధికి అడ్డుకట్ట వేయకుండా ఉండాలని ఇంతకుముందే అఖిలపక్షం ఆధ్వర్యంలో హైవే రోడ్డు నిర్మాణం అధికారులకు విన్నవించి నిరసనలు తెలిపిన పట్టించుకోకపోవడంతో 23వ తేదీన అఖిలపక్షo ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతున్నామని చెప్పారు. అండర్ పాస్ కాకుండా, తెలంగాణ చౌరస్తాలో రోడ్డు నిర్మాణం చేసి సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, లేకుంటే బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసి వెళ్లాలని ప్రజల అభిప్రాయం కూడా అదే ఉందని చెప్పారు. ప్రజాభి ప్రాయం సేకరించి ప్రజలకు అనుగుణమైన రీతిలో ప్రభుత్వం పనులు చేయాలని తెలిపారు. ఎంతోమంది చిరు వ్యాపారుల జీవితాలు అంధకారం చేసే విధంగా రోడ్డు అండర్ పాస్ నిర్మాణం చేయడం వలన చిరు వ్యాపారుల జీవనాధారం పోతుందని ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధపడతామని అండర్ పాస్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వాలు వ్యతిరేకంగా పనులు చేయవద్దని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల అభిప్రాయం మేరకు అండర్ పాస్ లేకుండా బైపాస్ రోడ్డును తీసుకుని, లేదా ఈ ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసి వెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు కొమ్మినేని సతీష్ కుమార్, మూల రవీందర్ రెడ్డి, బత్తుల శ్రీను, గుండా భాస్కర్, గజ్జల శేఖర్, కడెం లింగయ్య, కొత్తగట్టు మల్లయ్య, ఎస్. కొండల్ రెడ్డి, కందుకూరి సోమన్న, రాంబాబు, భాస్కర్, మధు, నాని, కందుకూరి ప్రవీణ్, అనగందుల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034