ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలంటే బాధ్యతాయుత డ్రైవింగ్ అవసరం: ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్
జోగులాంబ గద్వాల 20 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం జోగులాంబ గద్వాల జిల్లాలో విస్తృతంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్., ఆలోచనతో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం, ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రజల మధ్యకు చేరింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర రోడ్డు భద్రత, హెల్మెట్ ఆవశ్యకత, సీట్ బెల్టు ఆవశ్యకత, రాంగ్ రోడ్ డ్రైవింగ్ వల్ల జరిగే నష్టాలు, రేష్ డ్రైవింగ్ వల్ల కుటుంబాలకు జరిగే నష్టాలు, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్ధాల గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతను సమర్థవంతంగా అమలులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లోని పోలీస్ అధికారులు వారి వారి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్లి అక్కడ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటు అక్కడికి వారి పనుల నిమిత్తం వచ్చిన స్థానిక ప్రజలకు కూడా అరైవ్ అలైవ్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ — “నేటి ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యమే. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం, సీట్‌బెల్ట్‌ను పట్టించుకోకపోవడం, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం — ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమే” అని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణం క్షేమంగా ముగియాలంటే బాధ్యతాయుత ప్రవర్తనే ముఖ్య మార్గమని తెలిపారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వాహన నియమాలు కేవలం నిబంధనలు కాదని, అవి ప్రాణ రక్షకాలు అని అన్నారు. మరి ముఖ్యంగామైనర్ డ్రైవింగ్‌ను అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు.
అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో వాహనాల పార్కింగ్ క్రమశిక్షణ గురించి వారికి తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని నో హెల్మెట్ నో ఎంట్రీ అని నినాదాలు ఇచ్చారు.*అదేవిధంగా నో హెల్మెట్ నో ఎంట్రీని అమలు పరచాలని పోలీసు అధికారులు ఆయా కార్యాలయాల అధికారులను కోరారు. ప్రభుత్వ వాహనాలను నడుపుతున్న వారు సురక్షితంగా డ్రైవింగ్ చెయ్యాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, క్రమశిక్షణతో కూడిన పార్కింగ్ లవర్చుకోవాలని తెలిపారు.
‘Arrive Alive’ అనేది ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ఇది ప్రతి పౌరుడి మనసులో మార్పు తీసుకురావాల్సిన ఉద్యమమని పోలీసులు అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ నిబంధనల అమలు పోలీసులకే పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను అరికట్టగలమని తెలిపారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రానున్న రోజుల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టనుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ ప్రాంతాలలోని ప్రభుత్వ కార్యాలయాల ఆఫీసర్స్, సిబ్బంది, స్థానిక ప్రజలు చురుకుగా పాల్గొన్నారు.
..