పోలీస్ కుటుంబాల సంక్షేమానికి ఆధునిక వసతులతో నూతన క్వార్టర్స్
➤ నూతన పోలీస్ నివాస సముదాయాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.,
జోగులాంబ గద్వాల 20 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. ప్రజల రక్షణ కోసం ఎండనక, వాననక, రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమానికి జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖ మరో ముందడుగు వేసింది. జిల్లా కేంద్రంలోని పాత పోలీస్ క్వార్టర్స్ స్థలంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన పోలీస్ క్వార్టర్స్‌ను టి. శ్రీనివాసరావు పరిశీలించారు.
జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కుటుంబాలు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో నివసించేలా నిర్మించిన మొత్తం 12 నూతన క్వార్టర్స్‌ను ఎస్పీ గారు క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
పోలీస్ సిబ్బంది కేవలం విధుల్లోనే కాకుండా కుటుంబాలతో గడిపే సమయాల్లో కూడా సౌకర్యవంతమైన జీవనం పొందాలని జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
క్వార్టర్స్ పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేలా అందమైన గార్డెన్ ఏర్పాటు చేయాలని పోలీస్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ కుటుంబాల సంక్షేమమే పోలీస్ వ్యవస్థ బలోపేతానికి పునాది అని పేర్కొన్నారు. విధుల్లో నిత్యం ఒత్తిడిని ఎదుర్కొనే సిబ్బందికి ఇలాంటి సౌకర్యవంతమైన నివాసాలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని జిల్లా ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ ఎ.ఈ. అనిల్, ఏ.ఆర్. డీఎస్పీ టి. నరేందర్ రావు, ఆర్.ఐ. అడ్మిన్ నరేష్, ఆర్.ఐ. హరీఫ్, ట్రాఫిక్ ఆర్.ఐ. విద్యాసాగర్, ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ, ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
....