పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించాలి.

Aug 20, 2026 - 19:07
Aug 20, 2026 - 19:07
 0  1
పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించాలి.
పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించాలి.

 ఎస్ఐఆర్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.

విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి.

జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ సురేంద్రమోహన్.

జోగులాంబ గద్వాల 20 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేసి పారదర్శకమైన ఓటరు జాబితా  రూపకల్పనకు సంబంధిత అధికారులతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులందరూ సహకరించాలని వ్యవసాయ, సహకార శాఖల రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరోల్ అబ్జర్వర్ సురేంద్రమోహన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గురువారం ఐడిఓసి సమావేశపు మందిరంలో ఎస్ఐఆర్ పై జిల్లా ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తో కలిసి పరిశీలకులు ప్రసంగించారు. అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లు ఓటరుగా నమోదు కావడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా కాపీలను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినందున బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో క్షేత్రస్థాయిలో సంబంధిత ఎన్నికల అధికారులకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్ఐఆర్ కు సంబంధించి ఇది మొదటి పర్యటన గా పేర్కొంటూ, మరో పర్యటనలో పోలింగ్ స్టేషన్లను కూడా సందర్శిస్తూ, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అప్పట్లోగా జిల్లా ఎన్నికల అధికారులు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా పరిశీలకులు పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది ఓటర్లు అనామలీస్ జాబితాలో ఉన్నారని తెలిపారు. మ్యాపింగ్ జరగని ఓటర్లు 22,000 గా పేర్కొంటూ వీరందరికీ నోటీసులు అందజేయనున్నట్లు తెలిపారు. మండలాలతో పాటు మున్సిపాలిటీలలో ఏఈఆర్వోలు నిర్దేశిత తేదీల్లో అవసరమైన ఓటర్లందరికి నోటీసులు ఇచ్చేందుకు టామ్ టామ్ చేయించడం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం ఇస్తామన్నారు. సంబంధిత ఎన్నికల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కును కలిగి ఉండేందుకు కృషి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ కూడా పూర్తి కావడంతో జిల్లాలో ప్రస్తుతం 594 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఎస్ఐఆర్ ను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులతో తరచూ గూగుల్ మీట్ లు, ఇతర సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే క్రమం తప్పకుండా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివరించారు. అనంతరం పరిశీలకులు మండలాల, మున్సిపాలిటీల వారీగా అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ కార్యకలాపాలపై సమీక్షించారు. అంతకుముందు పరిశీలకులు కలెక్టర్ తో కలిసి ఉద్యానవన, సహకార శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలపై ఏర్పాటుచేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, ఎన్నికల విభాగం అధికారి మంజుల, వివిధ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State