పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలి:ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

Sep 19, 2024 - 19:14
 0  5
పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలి:ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

జోగులాంబ గద్వాల 19 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతి నిధి: బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వే ప్రక్రియను ప్రణాళిక బద్ధంగా నిర్దిష్ట గడువులో పూర్తిచేసి పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు.గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఒంటెల్ పేట, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల్లో గల  బూత్ లెవల్ అధికారుల ఇంటింటి సర్వే పనులను జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓ లు ఓటరు జాబితా సవరణ పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో అని అడిగి తెలుసుకున్నారు. కొత్త ఓటర్లను జాబితాలో నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను తొలగించడం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. బూత్ లెవల్ అధికారుల రిజిస్టర్ ను  పరిశీలించి, ఆధార్ కార్డ్, ఫోటో సహా వ్యక్తిగత వివరాలు సక్రమంగా నమోదు వంటి అంశాల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. అంతేకాకుండా సర్వే చేసిన వివరాలను మొబైల్ యాప్‌లో ఎంట్రీ చేయడం ఎలా జరుగుతోందని తెలుసుకుని, ఆ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు వారికి సరైన మార్గదర్శకాలు అందించారు. పోలింగ్ కేంద్రం నుండి ఓటర్ల ఇళ్లకు దూరం ఎంత ఉందో తెలుసుకొని, ఓటర్లు సులభంగా చేరుకునేలా సమీప ఎన్నికల కేంద్రాలను కేటాయించాలన్నారు. 18 సంవత్సరాలు దాటిన యువతి యువకులను గుర్తించి, వారికి ఓటరు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు.బూత్ స్థాయి అధికారులు ఇంటింటా సర్వేలో పాల్గొంటున్నప్పుడు, ప్రజలు అవసరమైన సమాచారాన్ని సక్రమంగా అందించి, ఓటరు జాబితా సవరణలో భాగస్వాములు కావాలని సూచించారు.అనంతరం జిల్లా కేంద్రంలోని మూడు ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్‌తో కలిసి సందర్శించారు. గద్వాల కలెక్టర్ కార్యాలయం వద్దగల ఈవీఎం గోడౌను,  ప్రియదర్శిని డిగ్రీ కళాశాల వద్ద ఉన్న ఈవీఎం గోడౌన్లలో భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణా విధానాలను సమీక్షించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఈవీఎం గోడౌన్ల వద్ద ఎఫ్‌ఎల్‌సి (ఫస్ట్ లెవెల్ చెకింగ్) పూర్తయిందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ఎల్‌సి ప్రక్రియను అత్యంత ఖచ్చితంగా నిర్వహించాలంటూ అధికారులకు ఆదేశించారు. గోడౌన్ల పరిసరాలను పరిశీలించి, అక్కడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థను తనిఖీ చేసి, దాని పనితీరును పరిశీలించారు. రిజిస్టర్‌లను పరిశీలించారు . గోడౌన్లలో అవసరమైన భద్రతా చర్యలు, సరైన లైటింగ్ ఏర్పాటు ఉండాలని, అన్ని వసతులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భద్రతా మౌలిక సదుపాయాలలో ఎటువంటి లోపాలు ఉండకూడదని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు  కలెక్టర్ శ్రీనివాస రావు , ఆర్.డి.ఓ రామ్ చందర్, ఎన్నికల విభాగపు సూపరిడెంట్ నరేష్, గద్వాల్ తహసీల్దార్, బి.ఎల్.ఓ.లు,  తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333