పాత టైర్లతో పర్యావరణానికి జరిగే ముప్పును తప్పించుకోలేమ ?

Mar 30, 2024 - 23:27
 0  6

 ప్రజారోగ్యం చిధ్ర మవుతుంటే  ఇంకెంతకాలం ఈ నిర్లక్ష్యం ?

ప్రత్యామ్నాయ  ఆలోచన  పరిష్కార మార్గాలను  వేగవంతం చేస్తే  సరిపోదా?

----వడ్డేపల్లి మల్లేశం 


ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ  వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతుండడంతో  టైర్ల ఉత్పత్తి అవసరం పెరుగుతుంది. అంతేకాదు  వాడి పడవేసిన టైర్లను ఇండియా విదేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకొని  వాటిని సవరించి తిరిగి అమ్మడం వలన కూడా  టైర్ల వినియోగం అధికమవుతున్నది . దానివల్ల ప్రజారోగ్యానికి పర్యావరణానికి ముప్పు పొంచి ఉన్న విషయం  పాలకులకు తెలిసినప్పటికీ ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించకుండా  పెట్టుబడిదారుల ప్రయోజనాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం వల్ల ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు నెలకొంటున్నాయి.  .అభివృద్ధి పేరున జరిగే విధ్వంసాన్ని  అదుపు చేయడానికి ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించగలిగితేనే శాస్త్రీయ దృక్పథంతో  ఆ ప్రమాదం నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది.  పెద్ద ప్రాజెక్టులు ఎంత అభివృద్ధికి నిదర్శనం అని భావిస్తున్నామో అంతే స్థాయిలో  ప్రజా విధ్వంసానికి కూడా  కారణమవుతున్నట్లు సామాజిక పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు . అడవులు , పంట భూములు, ముంపు ప్రాంతాలు,  లక్షలాది మంది  వసతిని కోల్పోవడం, కోట్ల రూపాయలు  పరిహారం పేరున చెల్లించడం వంటి  అంశాలు చోటు చేసుకున్న కారణంగా ప్రయోజనం కంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తున్నది.  అలాగే టైర్ల వాడకాన్ని  తగ్గించలేకపోవచ్చు కానీ ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించడం ద్వారా  కొంతవరకు వాటి ముప్పును తట్టుకునే అవకాశం ఉంటుంది అది ప్రభుత్వ విధానంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది.

.కొన్నిసమస్యలు -,పరిష్కారమార్గాలు:-

      వాడి పడవేసిన టైర్ల  సంఖ్య భారీగా పెరగడంతో పాటు  యూకే ,ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి   ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల  వాడిన టైర్లను దిగుమతి చేసుకుని  వాటిని రిపేరు చేసి తిరిగి  మార్కెట్లోకి తీసుకురావడం వల్ల కూడా  ప్రతిరోజు 2.75 వాడేసిన టైర్లు  పుట్టుకొస్తుండడంతో పర్యావరణ సమస్యగా మారి  పోయినట్లు తెలుస్తున్నది.  ఇవి తేలికగా భూమిలో కలిసిపోవు , కాల్చితే పర్యావరణం లోకి విషవాయువులు విడుదల అయ్యే ప్రమాదం ఉన్నది . వాడి పడవేసిన టైర్ల  కాల్చడం ద్వారా  పైరోలిసిస్  అనే ఆయిల్ ను భారత్ లో ఉత్పత్తి చేస్తున్నట్లు దీన్ని సిమెంటు, పింగాణి, ఇతర పరిశ్రమలలో ఇందనంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది.  అయితే ఈ క్రమంలో మండించడం వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ ఉధ్గా రాలు వాతావరణంలోకి విడుదల కావడం వల్ల  పర్యావరణ సమస్యలు అంతకుమించిన స్థాయిలో ఏర్పడుతున్నట్లు తెలుస్తున్నది . ఇతర పరిశ్రమలలో వినియోగానికి అవకాశం ఉన్నప్పటికీ కాల్చడం అనే దానివల్ల పర్యావరణం దెబ్బతినడం ఇదొక  సైడ్ ఎఫెక్ట్ గా భావించాలి.  భారతదేశంలో 800 టైర్ల పునసిద్ధి కేంద్రాలు ముఖ్యంగా  ఉత్తరప్రదేశ్ హరియానా రాష్ట్రాలలో నెలకొన్నాయి . అయితే ఇందులో 650 కర్మాగారాలు  పైరోలిసిస్ ఆయిల్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు  అందులో 46% ప్లాంట్లు మాత్రమే కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తున్నట్లు  మిగతా 54 శాతం ప్లాంట్లు  నిబంధనలను ఉల్లంఘిస్తున్న  కారణంగా మిగతా 250  కర్మాగారాలను  మూసివేయాలని 2019లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి  ఆదేశించినట్టు తెలుస్తున్నది.  ఇదే సందర్భంలో భారతదేశంలో టైర్ల వ్యర్థాల నిర్వహణకు సంబంధించి  ప్రణాళిక, ప్రత్యేక విధానం లేదని  అది ప్రజల ఆరోగ్యానికి గుదిబండగా మారిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆవేదన వ్యక్తం   చేస్తూ  తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలినీ కోరినట్లు తెలుస్తున్నది .అయితే ఆ స్థాయిలో  కాలుష్య నియంత్రణ మండలి చర్యలు లేని కారణంగా  అందుకు ప్రభుత్వాలు సిద్ధంగా  లేకపోవడం రాజకీయాలకు మాత్రమే పరిమితమై ప్రజల ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా  అనేక సమస్యలతో పాటు టైర్ల వ్యర్థాల నిర్వహణ కూడా ఇవాళ జాతీయ సమస్యగా మారిపోయింది .
      వినియోగించిన టైర్లను  విచ్చలవిడిగా పడవేస్తుండడంతో గుట్టలుగా పేరుకుపోయి వర్షాకాలంలో నీరు నిలువచేరి దోమల వృద్ధి, మలేరియా, ఇతర వ్యాధులు రావడానికి కారణం అవుతున్నాయి . ఈ సమస్య పరిష్కారానికి  కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ  2021లో  ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ  టైర్ల తయారీ సంస్థలు  పాత టైర్ల దిగుమతి దా రులే  పున: శుద్ధి బాధ్యత తీసుకోవాలని  ఆదేశించినట్టు తెలుస్తున్నది . అయితే పున: శుద్ధి కేంద్రాలు  దిగుమదారుల మధ్యన కుదిరిన ఒప్పందాలు  సరిగా అమలు కాని కారణంగా  సమస్య సమస్యగానే మిగిలింది .
     నిబంధనలు సరిగా అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వం  కఠినమైన  చర్యలు తీసుకోవడంతో పాటు విదేశాల నుండి వృధా టైర్ల గిర్రుమతులను కూడా భారీగా నియంత్రించాలి . .వాడి  పడవేసిన టైర్లతో కన్వేయర్ బెల్టులు, డోర్ మ్యాట్లు,  షూ లేసులు ,రబ్బర్ సీట్లు , ఇతర పైపులు తదితర వస్తువులను తయారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.  భవనాలు రహదారుల నిర్మాణంలో ఉపయోగించే ముడి సరుకును  ఇతర దేశాల నుండి  దిగుమతి చేసుకునే బదులు  టైర్లను పలు రసాయన చర్యలకు గురి చేయడం ద్వారా ఈ పదార్థాన్ని  స్థానికంగా తయారు చేసుకునే అవకాశం ఉన్నదని నిపుణులు తెలియజేస్తున్నారు . వాహనాల సంఖ్య విలాసాలకు అలవాటు పడిన కారణంగా  అపారంగా పెరిగిపోవడంతో  టైర్లు రబ్బర్లు పునర్ శుద్ధి పరిశ్రమ విలువ  ప్రస్తుతం 3500 కోట్లకు చేరినట్లు  మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో  కాలుష్య నియంత్రణ మండలి  జాతీయ హరిత ట్రిబ్యునల్  ఇందుకు అనుగుణమైన చర్యలను తీసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు భారీగా తనిఖీలు నిర్వహించి ఉల్లంఘించిన  పరిశ్రమలను మూసివేయడంతో పాటు  పునశుద్ధిలో ఎక్కువగా వినియోగించడం వల్ల కొంతమేరకైనా కాలుష్యాన్ని  తగ్గించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది  .ఈ మేరకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల  ఆరోగ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలు  సంయుక్త ఆధ్వర్యంలో  ఉమ్మడిగా కృషి చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు జాతీయ సమస్య కనుక .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నా  బాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333