పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Feb 23, 2026 - 19:41
 0  0
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

 జోగులాంబ గద్వాల 23 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి. ఎం. సంతోష్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 8110 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలను కలెక్టరేట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి జిల్లాలోని 9 పోలీస్ స్టేషన్లకు పంపించి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు నాలుగు రూట్లను ఏర్పాటు చేశామని, పటిష్ట పోలీస్ బందోబస్తు  నియమించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ తరఫున ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స తో పాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు నిర్దేశిత సమయంలోగానే తమ పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ తరఫున అదనపు బస్సులను నడిపేందుకు కృషి చేయాలన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుండడంతో పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తపాలా, ట్రెజరీ, మున్సిపల్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు కూడా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, డీఈవో విజయలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
.............................................................

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333