దైవ దర్శనానికి వెళ్లి గుండెపోటుతో ఏ.ఎస్సై కన్నయ్య మృతి

Aug 28, 2026 - 18:05
 0  1
 దైవ దర్శనానికి వెళ్లి గుండెపోటుతో ఏ.ఎస్సై కన్నయ్య మృతి

నిబద్ధత కలిగిన పోలీసు అధికారిని కోల్పోయాం... జిల్లా పోలీసు వ్యవస్థకు తీరని లోటు: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,

జోగుళాంబ గద్వాల 28 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-  గద్వాల్. జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఏ.ఎస్సై కన్నయ్య అకస్మాత్తుగా మృతి చెందడం పట్ల జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు,  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. శాంతినగర్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రస్తుతం జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.ఎస్సై కన్నయ్య గురువారం రాత్రి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి, మొక్కు తీర్చుకునే క్రమంలో మెట్ల మార్గం గుండా కాలినడకన కొండపైకి వెళ్తుండగా, ప్రయాణం చివరి దశలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. 1989 బ్యాచ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన కన్నయ్య , తన సుదీర్ఘమైన 37 సంవత్సరాల 8 నెలల పోలీసు సేవలో హెడ్ కానిస్టేబుల్‌గా, అనంతరం ఏ.ఎస్సైగా పదోన్నతులు పొందుతూ వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విశేష సేవలు అందించారు. తన విధుల్లో నిబద్ధత, సౌమ్యత, బాధ్యతాయుతమైన పనితీరుతో ఉన్నతాధికారులు, తోటి పోలీసు సిబ్బంది, ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా ఎంతో బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో కొనసాగుతున్న కన్నయ్య  ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని జిల్లా ఎస్పీ  పేర్కొన్నారు.

సుదీర్ఘకాలం పోలీసు శాఖకు అంకితభావంతో సేవలందించిన మంచి అధికారి, మంచి మనిషిని కోల్పోవడం జిల్లా పోలీసు వ్యవస్థకు తీరని లోటు” అని ఎస్పీ  ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ , జిల్లా పోలీసు అధికారులు, సహచర ఉద్యోగులు కన్నయ్య పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్నయ్య తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు. కన్నయ్య కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ  తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, పోలీసు వ్యవస్థ తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333