తెలంగాణ సాధించినది ఈ నిర్వాకానికే నా? లక్ష్యాలు ఓడిపోయినవేళ తలదిoచుకోవలసి రావడం  సిగ్గుచేటు?

Oct 1, 2026 - 08:18
 0  0

 హామీలు  వాగ్దానాలను కట్టిపెట్టి, ప్రజలను స్వావ లంబనకు సిద్ధం చేసి, ఆత్మ  గౌర వాన్ని  నిలబెట్టి  చిత్తశుద్ధి చూపాలి.

----  వడ్డేపల్లి మల్లేశం 

ఉమ్మడి రాష్ట్రంలో  వివక్షత కొట్లాటలు అవినీతి  ఆత్మగౌరవం కోల్పోయినా మని నీళ్లు నిధులు నియామకాలను  ఈ ప్రాంతానికి అందకుండా చేశారని  విమర్శించిన మనం పోరాటం చేసి  రాష్ట్రాన్ని సాధించుకుంటే  అంతకుమించిన ప్రయోజనం ప్రస్తుతం ప్రజలు పొందాలి కదా! అలాంటి  ఆన వాళ్లు ఏమైనా ఉన్నాయా ?అన్నింటికి మించి ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తామని తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ పార్టీలు ఉద్యమకారులు  మేధావులు  పిలుపు ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయిన  ప్రజలను ఇప్పటికీ బానిసలుగానే చూసే వ్యవస్థ కొనసాగుతుంది.  అప్పటికి ఇప్పటికీ  వైరుధ్యాలు వివక్షత తగ్గి  అభివృద్ధి సంకేతాలు కనపడాలి కదా!  అలాంటి  గణాంకాలు ఎక్కడ ?అభివృద్ధికి పోటీపడే తత్వం ఏది? పరస్పర విమర్శలతో  ప్రజలను బలి పశువులను చేసే క్రమములో  వాగ్దానాలు హామీలకు అలవాటు చేసి  గతం కంటే మరింత బిచ్చగాళ్ళుగా  తయారుచేసిన మార్పు మాత్రం స్పష్టంగా కనబడుతుంది.  మరి ఇదేనా అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటుకు  గుర్తింపు? "" తెలంగాణ ఉద్యమ కాలంలో  విప్లవకారులు మేధావులు బుద్ధి జీవులు  తమ ప్రసంగాల సందర్భంలోనూ వ్యక్తిగతంగా ప్రశ్నించిన వేళ కూడా  తెలంగాణ రాష్ట్రం వస్తే సకల సమస్యలు పరిష్కారం అవుతాయా? ఇప్పటికంటే మరింత ఉన్నతంగా ఈ రాష్ట్రం వెలుగొందుతుందా? ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవిస్తారా?  విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే పూర్తిగా ఉచితంగా కొనసాగుతుందా?  ప్రధానమైనటువంటి భూమి పంపిణీ జరుగుతుందా?  పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులకు అతీతంగా సమానత్వం సాధ్యమవుతుందా? ""  ఇలాంటి ప్రశ్నలను నేను లేవనెత్తిన సందర్భంలో  ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు గారు  ఇతర బుద్ధి జీవులు మేధావులు  చెప్పిన విషయం నిజంగా ఆశ్చర్యపడాల్సిందే. "" తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం కేవలం  ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేకంగా విడిపోవడం మాత్రమే.  తర్వాత మళ్లీ తెలంగాణకు ఒక ప్రభుత్వం అంటూ ఉంటుంది  ప్రజలను పీడించడం,  కార్పొరేట్ శక్తులను కాపాడడం, ప్రజా చైతన్యాన్ని అడ్డుకోవడం,  భూస్వామ్య వ్యవస్థను  రక్షించడం,  మానవ పౌర హక్కులను  దోచుకోవడం అనేది ప్రతి ప్రభుత్వానికి స్వభావంగా ఉంటుంది. కనుక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వచ్చే ప్రభుత్వాలతో  మనం ఉద్యమ కాలంలో ఆశించిన నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం సమానత్వం  భూమి వంటి అనేక అంశాలను  సాధించాలంటే నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలి.  కేవలం  భౌతికంగా తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు  అనునిత్యం పోరాటమే శరణ్యం"" అని చెప్పిన మాటలు  ఇప్పటికీ నాకు బాగా గుర్తుండడమే కాదు  అందులో ఎంతో అర్థం ఉందని తేలిపోయింది.

 సిగ్గు పడాల్సి రావడమoటే తలదించుకోవడమే:

తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడ మే లక్ష్యమని  ఉద్యమ కాలంలో సబండ వర్గాలు   శ్రమించి పోరాడి  అమరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే 12 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ  గతము కంటే భిన్నమైన పరిస్థితులు లేకపోగా  ప్రజలు ఇప్పటికీ  మరింత తలదించుకునే పరిస్థితుల్లోనే ఉండడం బాధాకరం.  ఈ పరిస్థితికి ముందుగా  ఈ ప్రాంత రాజకీయ నాయకులు  ప్రభుత్వాలు  ప్రజలకు ఉద్యమకారులకు  క్షమాపణ చెప్పాలి.  టిఆర్ఎస్ కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ హామీలు వాగ్దానాలు  గుప్పించడమే తప్ప నిర్మాణాత్మక ప్రణాళిక  బద్ధంగా పరిపాలన కొనసాగించలేదు.  ప్రజలను బలి పశువులను చేసే క్రమంలో ఆధారపడే వాళ్ళుగా   యాచకులుగా  చూడడం తో పేదరికం మరింత పెరిగిపోయింది.  ఆత్మగౌరవం  లోతున పడ్డ నీళ్ల వలె అడుగంటి పోయింది. ఉమ్మడి రాష్ట్రంలోవిద్యకు 17% నిధులు కేటాయిస్తే  ఇప్పుడు 6,7 శాతం దాటడం లేదు. 1973లో కనీసం భూసంస్కరణ చట్టాన్ని చేసి  భూ పంపిణికి  కొంత ప్రయత్నం జరిగినప్పటికీ  12 ఏళ్లలో   దళితులకు మూడెకరాల భూమని హామీ ఇచ్చి కూడా  ఆ ప్రయత్నం జరగకపోవడం సిగ్గుచేటు కాదా! ఇక మీదట పేదవాళ్లకు పంపిణీ చేసేది ఎన్నడు?  నీళ్ల పేరున కొన్ని ప్రాజెక్టులు కట్టిన అరకొర నాణ్యతతో  కట్టలు తెగిపోతూ ఉంటే  పిల్లర్లు కుంగిపోతుంటే
విచారణ పేరుతోనే కాలయాపన కావడం ఇదేనా సొంత రాష్ట్రంలో అభివృద్ధి?  అవినీతిలో మాత్రం నాటినుండి నేటి వరకు 12 ఏళ్లలో  ఒకరిని మించి మరొకరు ప్రభుత్వ భూములను అమ్ముకోవడం,  ప్రజాధనాన్ని దోచుకోవడం, ప్రజల భూములకు కన్నం వేయడం,  ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరించి వేయడంలో పోటీపడిన విషయం మనందరికీ తెలుసు.  బంగారు తెలంగాణ అని ఒకరంటే  ప్రజా పాలన అని మరొకరు  మా పోటీ ప్రపంచం తోనే అనే నినాదంతో  కొనసాగుతున్న వైనం  గర్హనీయం.  గత ప్రభుత్వం  ఉద్యోగులు సర్పంచులు కాంట్రాక్టర్లకు  విద్యార్థులకు భిన్న వర్గాలకు చెల్లించాల్సినటువంటి బకాయిలను చెల్లించకపోగా ఉద్యోగుల పదవీ విరమణ 3 సంవత్సరాలు పెంచి ఆ భారాన్ని ప్రజల పైన వేసింది నిజం కాదా? ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలను చెల్లించడానికి సరిపోతున్నామని  గత 30 నెలలుగా ఉద్యోగుల విద్యార్థుల అన్ని రకాల  పద్దులను పెండింగ్లో పెట్టడం  రాష్ట్రవ్యాప్తంగా భిన్న వర్గాలు ఉద్యమాలతో మారుమోగుతుంటే  టిఆర్ఎస్ వలె కాంగ్రెస్ కూడా మౌనం వహించడం దేనికి సంకేతం?  ఈ పరిస్థితుల మధ్యన  ఒకరు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటే మరొకరు లక్షల కోట్లు  రోజు దోచుకుంటున్నారని  ఢిల్లీకి ముల్లెలు మోస్తున్నారని  విమర్శించడమే తప్ప రుజువు చేసింది లేదు.  ఇక గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన భిన్నమైన అవినీతి  పనుల మీద జరిగిన విచారణలో  తేలింది లేదు నేరస్తులకు శిక్షలు పడ్డది లేదు.  బి ఆర్ఎస్ రైతుబందు పేరుతో  అప్పనంగా   ధనాన్ని రోడ్లకు,  గుట్టలకు, పుట్టలకు చెల్లించి  ద్రోహం చేస్తే  ప్రస్తుత ప్రభుత్వం  మధ్యలో కొన్ని కిస్తులు తప్పించి మోసం చేసిందని మరొక పార్టీ విమర్శిస్తే  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,  బంగారము, నగదు,  స్కూటీలు  తదితర పేర్లతో ఇచ్చిన హామీల పైననే  అధికార ప్రతిపక్షాల విమర్శ తప్ప ప్రజా పాలన గురించి మౌలిక సమస్యల గురించి భూమి పంపిణీ గురించి కానే కాదు.  అధికారంలో ఉన్న నాడు ఏనాడు ప్రస్తావించని టిఆర్ఎస్ భూమి సమస్య,  ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంటే  రెండు ప్రభుత్వాలకు కూడా  అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని సామాజిక రాజకీయ విశ్లేషకులు మేధావులు  హెచ్చరిస్తున్న రు .విద్యా వైద్యం  గాలికి వదిలి  రెండు ప్రభుత్వాలు  పోటీ పడుతున్నాయి  శ్రామికులకు ఉద్యోగులకు పెన్షనర్లకు కార్మికులకు విద్యార్థులకు అధ్యాపకులకు  చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు  రైతులకు ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు కూడా దగా చేయడంలో పోటీ పడినయి.
     420 హామీలు  ఆరు వాగ్దానాలు అమలు చేయడం లేదు అని టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శ చేస్తున్నదే తప్ప  ప్రజలను స్వావలంబన దిశగా  కొనసాగించే క్రమములో ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంతో పాటు విద్య వైద్యం గురించి ఏనాడు ప్రస్తావన లేదు. Brs తమ ప్రభుత్వంలో అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు.  తెలవారితే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి  విమర్శలే తప్ప ప్రజల గూర్చిన ప్రణాళికలు లేని ఈ ప్రతిపక్ష  అధికార పక్షాలు  ఏనాడో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినవి.

చిత్తశుద్ధిఉంటే  ---లేకుంటే...

మిగులు భూమిని గుర్తించి  భూమిలేని పేదలందరికీ పంపిణీ చేసి  ప్రజాస్వామ్య బద్దంగా హక్కులను పునరుద్ధరించి  విద్య వైద్యాన్ని పూర్తిస్థాయిలో  ప్రభుత్వమే ఉచితంగా అందించే ఏర్పాటు తక్షణమే చేయాలి.  ఈ రెండు రంగాలను ప్రైవేట్ లో  నిషేధించాలి.  టిఆర్ఎస్   బిజెపి కూడా  విద్య వైద్యం గురించి ప్రశ్నించడం నేర్చుకొని హామీలను మరిచిపోవాలి.  వాగ్దానాలను పక్కన పెట్టే విషయంలో అఖిలపక్షాలతో  ప్రభుత్వం  కఠోరమైన నిర్ణయం తీసుకోవాలి. చట్టసభలకు రాకపోయినా  తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించకపోయినా  ఉద్యోగుల మాదిరిగానే తగిన శిక్షలు వేయాలి  వేతనంలో కోత విధించాలి.  అవసరమైతే కొంతకాలం పదవి  నుండి భర్త రఫ్ చేయాలి.  ఉద్యోగులకు ఒక నీతి  ప్రజాప్రతినిధులకు మరొక నీతి  నిజంగా అవివేకం. అధికారంతో ప్రజలను  అణచివేస్తామని వంచిస్తామని  అనుకుంటే ఏ ప్రభుత్వానికైనా  ప రాభవం తప్పదు కాకరోచ్ జనతా పార్టీ వల్ల కేంద్రంలోని  ప్రభుత్వం మాదిరిగా.  చట్టసభలకు  దీర్ఘకాలం రాకుంటే  పదవిని రద్దు చేయడం, స్వచ్ఛందంగా తప్పుకుంటే సంస్కారం అవుతుంది. ప్రజలందరికీ భూములను పంచి సంపదను సమానంగా  అందజేసి  దోపిడీ పీడనను అంతం చేసి  ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి  విద్య వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే అందించి  సమ సమాజం వైపు నడిపించే పాలకులే నేడు కావాలి.  ఆ సత్తా ఉన్న పార్టీకి ప్రజలు మద్దతిస్తారు. తల ఊపి హామీలు వాగ్దానాలకు  తలవంచి బతుకుతారు అనుకోవడం కల్ల. చిత్తశుద్ధి ఉంటే ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచి  ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో  మరింత మెరుగైన పరిస్థితులను చూపాలి  లేకుంటే తమ పాలన  ఉమ్మడి రాష్ట్రం కంటే  హీనమైనదని అంగీకరించి తీరాలి. నేడు యువత  గతం కంటే చైతన్యంగా పరిగెడుతున్నది. క్రమక్రమంగా అవినీతి విద్యా వైద్యం పైన శ్రద్ధ, ప్రభుత్వాల  నిర్లక్ష్యం పైన ఉక్కు పాదం మోపడానికి సిద్ధపడుతున్నదని ఇటీవలి ఉద్యమాలు  తెలియచేస్తున్నాయి. ఆ ఉద్యమాల  వలలో పడకుండా  విద్యార్థులు యువత ఉద్యోగులు, సర్వ రంగాల ప్రజలను  జాగృతం చేయడంతో పాటు  కంటిపాపలుగా చూసుకునే పార్టీకి ప్రభుత్వానికే ప్రజలు మద్దతు ఇస్తారు.    అడుగు వేయవలసింది ఇక పార్టీలే  తలవంచుకోవలసిన దుస్థితి నుండి తల ఎత్తుకొని బ్రతికేలా  తీర్చిదిద్దడమే నేడు పాలకుల కర్తవ్యం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333