తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క
బంజారా సంస్కృతి సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీక
ములుగు జిల్లా, ఆగస్టు :27 : గోవిందరావుపేటలోని బంజారా సోదర సోదరీమణులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే తీజ్ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో సర్పంచ్ భూక్యా సుమలత ఇంటివద్ద ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొని బంజారా సోదర సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తీజ్ పండుగ శుభసందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించిన మంత్రి సీతక్క బంజారా సమాజం అభివృద్ధి సంక్షేమం కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.బంజారా సమాజానికి తీజ్ పండుగ ఎంతో ప్రత్యేకమైనదని మంత్రి సీతక్క అన్నారు. ప్రకృతి పట్ల ప్రేమ కుటుంబ బంధాలు మహిళల భక్తిశ్రద్ధలు సంప్రదాయాల పరిరక్షణ వంటి అనేక గొప్ప విలువలను తీజ్ పండుగ ప్రతిబింబిస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న బంజారా సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.తీజ్ పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పాటలు పాడుతూ నృత్యాలతో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం బంజారా సంస్కృతిలోని వైవిధ్యాన్ని చాటుతుందని మంత్రి సీతక్క అన్నారు.సమాజంలో ఐక్యత సోదరభావం పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బంజారా సమాజ సంక్షేమం వారి హక్కుల పరిరక్షణ విద్య ఉపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఆత్మగౌరవంతో జీవించేలా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్ తో పాటుగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు యూత్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.