జివో 26 ను దుర్వినియోగం చేస్తూ బిల్లులు ఆమోదం చేస్తున్నారు

Jun 28, 2024 - 20:33
Jun 28, 2024 - 20:43
 0  7
జివో 26 ను దుర్వినియోగం చేస్తూ బిల్లులు ఆమోదం చేస్తున్నారు

మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్

కౌన్సిలర్ లకు విలువ లేకుండా చేసి,  

కౌన్సిల్ కు కేవలం సమాచారం మాత్రమే ఇస్తున్నారు

మున్సిపాలిటీలో పెద్దఎత్తున అవినీతి జరిగింది

సూర్యాపేట. 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జివో 26 దుర్వినియోగం చేస్తూ సూర్యాపేట మున్సిపాలిటీ లో  ప్రతి బిల్లునహ కలెక్టర్ ద్వారా  ఆమోదం చేస్తూ కౌన్సిలర్ లకు విలువ లేకుండా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ  మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో , వరదలు, భూకంపాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు  మాత్రమే జివో 26 ద్వారా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తారని, కాని సూర్యాపేట మున్సిపాలిటీ లో మాత్రం ప్రతి పనికి జివో 26 ను ఉపయోగిస్తూ, కౌన్సిలర్ లను డమ్మిలను చేస్తూ చైర్మన్ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. బిఆర్ ఎస్ నాయకులు, కాంట్రాక్టర్ లను బాగు చేయడానికి  నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

 గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 28 బిల్లులు జివో 26 ద్వారా ఆమోదింప చేసి , కౌన్సిల్ కు సమాచారం కోసం తెలియజేశారని అన్నారు. బాలెంల వద్ద గల డంపింగ్ యార్డ్ లో  90 లక్షల వ్యయంతో మిషనరీని  మున్సిపాలిటీ కొనుగోలు చేసి, 13 మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ద్వారా పనులు చేపిస్తూ, కాంట్రాక్టర్ కు సంవత్సరానికి 35 లక్షల రూపాయలు చెల్లింపులు చేస్తున్నారని, మున్సిపాలిటీ కి  ఎటువంటి ఆదాయం లేకున్నా, మూడేళ్ల నుండి కోటి రూపాయలు చెల్లించి అవినీతి కి పాల్పడ్డారని అన్నారు. హరితహారంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, మినీ ట్యాంక్ బండ్ పక్కన మొక్కలు మేకలు తిన్నాయని చెబుతూ అవినీతి కి పాల్పడ్డారని అన్నారు. ఐటి హబ్ కు బిటి రోడ్ పేరుతో 41 లక్షలు వ్ర్రధా చేశారని, ప్రైవేటు వ్యక్తి భవబానికి బిటి రోడ్ ఎలా వేశారని ప్రశ్నించారు. కాలువలలో షీల్డ్ తొలగించడం పేరుతో 56 లక్షల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించారు.

 పాత మున్సిపల్ కార్యాలయం నిర్మాణం పూర్తి అయిన తరువాత కాంపౌండ్ వాల్, పచ్చదనం పేరుతో 30 లక్షలకు బిల్లులు పెడితే తాము తిరస్కరించామని అన్నారు.    అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిసి రోడ్ల మీద బిటి రోడ్లు వేయడమే కాకుండా ప్యాచ్ వర్క్ పేరుతో 13లక్షలు బిల్లులు పెట్టి దోచుకున్నారని అన్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వార్డులకే ఎక్కువగా నిధులు మంజూరు చేసి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు వున్న వార్డులలో అభివృద్ధి చేయలేదని చెప్పారు. కబడ్డీ పోటీలలో 12 మంది గాయపడితే వారిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏనాడూ పరామర్శ చేయలేదని, మెయిన్ రోడ్ దుకాణాలను బలవంతంగా కూలగొట్టారని, వారికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు.  30 కోట్లతో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకు పనికిరాకుండా నిరుపయోగంగా పడి వుందని, గాలి, వెలుతురు లేని చోట తాము వుండలేమని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారని అన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో దోసపాడు నుండి 17 వార్డులకు, పాలేరు నుండి 17 వార్డులకు అప్పటి మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంచినీటి సరఫరా చేస్తే, బిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పధకాలను పక్కన బెట్టడంతో సూర్యాపేట కు మంచినీటి సరఫరా కష్టాలు మొదలయ్యాయని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు అవంతిపురం, ఇమాంపేట ల నుండి సూర్యాపేట కు రావాలని, ఎక్కడ కరెంటు సమస్య వున్నా, పైపులు పగిలినా నీళ్లు రావడం లేదని అన్నారు. దోసపాడు నుండి మంచినీటి సరఫరా కు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 60 లక్షల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభం చేస్తారని ఆయన అన్నారు.  కొత్తగా ఆసుపత్రి నిర్మాణం చేయకుండా ఏరియా ఆసుపత్రి ని , మెడికల్ కాలేజ్ హాస్పిటల్ గా మార్చారని ఆరోపించారు.  మున్సిపాలిటీ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడుతున్నారని, అందులో తమ పార్టీ కి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.  

కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు మున్సిపల్ చైర్మన్ ను గౌరవిస్తున్నారని, కాని చైర్మన్ మాత్రం  పట్టణ ప్రగతి నిధులను కేవలం బిఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ లు వున్న వార్డులకే కేటాయించి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ల పట్ల వివక్ష ను చూపారని అన్నారు. మున్సిపల్ చైర్మన్  అధికారులను ఇంటికి పిలిచి కౌన్సిల్ ఎజెండా తయారు చేశారని, కనీసం ఫ్లోర్ లీడర్ లతో చర్చించలేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు బైరు శైలేందర్, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, కుంభం  రాజేందర్, బచ్చలకూరి శ్రీనివాస్, ధరావత్ రవికుమార్, నాయకులు సిరివెళ్ల శభరినాధ్, మాలోతు చంద్రు నాయక్ , ఆలేటి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333