జిల్లాలో వైభవంగా ప్రారంభమైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ తొలి టైలరింగ్ శిక్షణ బ్యాచ్
జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గ్రామీణ మహిళలు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్‌ఎస్ఈటిఐ శిక్షణలు ఎంతో దోహదపడతాయని యూబీఐ-ఆర్‌ఎస్ఈటిఐ డైరెక్టర్ డి.ఎమ్.శ్రీనివాస్ నాయక్ అన్నారు. గురువారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా 31 రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామీణ మహిళలు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్‌సెఈటిఐ శిక్షణలు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. శిక్షణ అనంతరం మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఉద్యోగాలు వెతికే స్థాయి నుండి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని శిక్షణార్థులను ప్రోత్సహించారు. తొలి బ్యాచ్‌లో 30 మంది గ్రామీణ మహిళలకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.31 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో ప్రొఫెషనల్ టైలరింగ్‌తో పాటు వ్యాపార నిర్వహణ,స్వయం ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించిన సర్టిఫికెట్లు అందజేయబడతాయని అన్నారు. జిల్లాలో ఇప్పటికే ఆర్‌సెటి శిక్షణల ద్వారా అనేక మంది యువతీ యువకులు విజయవంతమైన స్వయం ఉపాధిదారులుగా నిలిచారని పేర్కొన్నారు. శిక్షణార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో శిక్షణను పూర్తి చేసి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎల్.శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగేశ్వర గౌడ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. చరణ్, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసులు, డీపీఎం సలోమి, తదితరులు పాల్గొన్నారు.