ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
* దేశ ప్రగతిలో రాజీవ్ గాంధీ పాత్ర స్మరణీయం: జిల్లా ప్రధాన కార్యదర్శి సంకాపురం రాముడు.
జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఐజ. భారత మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అయిజ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జయన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి) సంకాపురం రాముడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంకాపురం రాముడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశాన్ని సాంకేతికంగా, ఆధునికంగా ముందుకు నడిపించడంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి ఎనలేనిదన్నారు. దేశ యువతకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అధికార వికేంద్రీకరణ చేసి గ్రామ స్వరాజ్యానికి పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.