మొబైల్ చోరీ చేస్తే రూ. 25 వేల జీతం.. 45 రోజుల శిక్షణ కూడా!

Feb 14, 2024 - 13:13
Feb 14, 2024 - 13:13
 0  120
మొబైల్ చోరీ చేస్తే రూ. 25 వేల జీతం.. 45 రోజుల శిక్షణ కూడా!

అవును నిజమే! మొబైల్ దొంగతనం చేసి ఇస్తే నెలకు రూ. 25 వేల జీతం. అనుభవంతో పెద్దగా పనిలేదు. 45 రోజులపాటు వారే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత రద్దీ ప్రాంతాలను చూసుకుని మొబైల్స్ దొంగతనం చేసి ఇస్తే చాలు. ఎంచక్కా నెలకు రూ. 25 వేలు సంపాదించుకోవచ్చు. గుజరాత్‌‌లో ఇప్పుడిదో రకం దందా యథేచ్ఛగా సాగుతోంది. అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం వెలుగు చూసింది. 

చోరీ చేసిన మొబైల్స్‌ను ముఠా నిర్వాహకులు అన్‌లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాల్ పంపి సొమ్ము చేసుకుంటారు. నిందితులను సూరత్‌కు చెందిన అవినాశ్ మహతో (19), శ్యామ్ కుర్మి (26)గా గుర్తించారు. వారి నుంచి 58 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 29 ఐఫోన్లు, 9 వన్‌ప్లస్ ఫోన్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 20 లక్షల పైమాటేనని పోలీసులు తెలిపారు. 

అవినాశ్, శ్యామ్ ఇద్దరూ ఝార్ఖండ్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు. అవినాశ్ సోదరుడు పింటూ మహతో.. రాహుల్ మహతో అనే వ్యక్తితో కలిసి గుజరాత్‌లో మొబైల్స్ చోరీచేసేవాడు. చోరీ చేసిన ఫోన్లను అన్‌లాక్ చేసి బంగ్లాదేశ్, నేపాల్ పంపేవారు. వీరిద్దరూ కలిసి అవినాశ్, శ్యామ్‌ను పనిపేరుతో పిలిపించి శిక్షణ ఇచ్చి నెలకు రూ. 25 వేల వేతనంతో మొబైల్స్ చోరీ పనిలో పెట్టుకున్నారు. కాగా, అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, అనంద్, రాజ్‌కోట్ వంటి ప్రాంతాల్లో మొబైల్స్ దొంగతనం చేసేవారని, ఇందుకు సంబంధించి 19 ఫిర్యాదులు అందినట్టు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333