కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్ర ద్వారా నేటి తరం ఏం నేర్చుకోవాలి

Sep 27, 2024 - 13:54
 0  4

 నేటి రాజకీయ పార్టీలకు గుణపాఠం జరిగితే అంతే చాలు

వడ్డేపల్లి మల్లేశము9014206412
27...09....2024
(27సెప్టెంబర్  కొండా లక్ష్మణ్109వ  జయంతి సందర్భ వ్యాసం)

కొండా లక్ష్మణ్  జీవిత నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం  నేటితరం  బాధ్యత  ప్రముఖ దేశభక్తులు, పోరాట యోధులు, సామాజికవేత్త ల  జయంతి వర్ధంతి కార్యక్రమాలను  మొక్కుబడిగా భారీగా నిర్వహించడం ఇటీవల మామూలైన  వేల
ఆనాటి ప్రత్యేకతలను సూక్ష్మంగా పరిశీలించడం  బుద్ధి జీవుల బాధ్యత.  అంతేకాకుండా నేటితరం యువత ,విద్యార్థి రంగానికి  ఈ కార్యక్రమాలను విస్తృతంగా పరిచయం చేయడం ద్వారా  భవిష్యత్తు తరాలకు వారసత్వ  మేధో సంపదను అందించిన వారిమి   అవుతాము . ఇటీవ ల సంబంధిత వ్యక్తులే కాకుండా  విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘం,  దళిత బీసీ సంఘాలు కూడా  కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాలను 21 సెప్టెంబర్ న  నిర్వహించిన విషయాన్ని గనక మనం గమనిస్తే  సమాజంలో కొంత చైతన్యం   కన పడినప్పటికీ  ఆ చైతన్యం మొక్కుబడిగా కాకూడదు అనేదే విజ్ఞుల ఆవేదన .
   బాపూజీ జీవితంలోని కొన్ని సంఘటనలు-  నేటి పరిస్థితులకు అన్వయింపు:-
కొండా లక్ష్మణ్ బాపూజీ తన 97 సంవత్సరాల సుదీర్ఘ జీవితం లో  5 సార్లు శాసన సభ్యునిగా 2సార్లు మంత్రిగా ఎన్నికైన ప్పటికీ  మానవీయ విలువలకు కట్టుబడి ప్రజాసేవకు కొత్త భాష్యం చెప్పి  ప్రజల మధ్యన జీవించి నిజమైన ప్రజా సేవకుడు గా పేరుగాంచిన విషయాన్ని ఇప్పటి తరానికి ఆలోచిస్తే గాని తెలియదు.  1977లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత  అప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి కావడానికి  అనేక మార్గాలు ఉన్నప్పటికీ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ద్రోహం తలపెట్టననీ ముఖ్యమంత్రి  అవకాశాన్ని తృణ ప్రాయంగా వదిలి పెట్టినటువంటి త్యాగశీలి . ముఖ్యంగా అట్టడుగు వర్గాలు ఆదివాసీలు దళితులు  బీసీ వర్గాలకు  చదువు కీలకమని విద్య ద్వారానే సామాజిక ఎదుగుదల సాధ్యమని నమ్మిన లక్ష్మణ్  గారు  అన్ని వర్గాలకు హాస్టల్ సౌకర్యాలను కల్పించే బృహత్ ప్రణాళిక లో భాగమై  ఉన్నత స్థాయి విద్య వరకు కూడా  ఉచితంగా కల్పించడానికి కృషి చేసి నేడు ఎంతోమంది విద్యావంతులకు ఆదర్శప్రాయంగా నిలిచినాడు.  ఈ చరిత్ర విద్యావంతులు నేటితరం పాతతరం ఆలోచించితే ప్ప  అర్థం కాదు  .పద్మశాలి కులంలో జన్మించిన0త మాత్రాన కేవలం ఒక కులానికి పని చేసిన వాడు కాదు.  ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ,రాజకీయ రంగాలను ప్రభావితం చేసి  అనేక సార్లు గెలిచినా కొన్నిసందర్భాలలో ఓడిపోయిన సందర్భాలు కూడా జీవితంలో లేకపోలేదు. అయినప్పటికీ  ప్రజల కోసం పని చేసి ప్రజల కోసమే పదవులను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా  96 ఏళ్ల వయసులో ఢిల్లీలో దీక్షలు నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాన్నుంచి  ఏం నేర్చుకుంటారు? యువత ఒక్కసారి ప్రశ్నించుకోవాలి.  అంత వయసులో ఎందుకోసం ఆరాటపడి నాడు?  నేటి యువత ఎందుకు నిర్లిప్తంగా నిర్వేదంగా అసాంఘిక కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారు?  అని తెలుసుకోకపోతే  ఆయన జీవితము నుండి మనము ఏమి  నేర్చుకో నట్లే లెక్క.
             

మూడు ఉద్యమాల భాగస్వామి:- తెలంగాణ స్వాతంత్ర పోరాట0 లో  మిత వా దులుగా పని చేసినా చాలా మంది చాలా కాలం బ్రతికి  అహింసా మార్గంలో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ లో  కొండా లక్ష్మణ్ బాపూజీ అగ్రగణ్యుడు అని చెప్పడంలో సందేహం లేదు.  ముఖ్యంగా అతివాదులు గా  ముద్ర పడిన టువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ఉరికంభం ఎక్కగా  ఇక చంద్రశేఖర్ ఆజాద్  వంటి అనేక మంది దేశ భక్తులు  చిన్న వయసులోనే దేశ మాత సేవలో తమ జీవితాలను అర్పించారు.  వారిని కూడా నేటి తరం గుర్తించుకుంటే తప్ప త్యాగశీలత, పోరాటపటిమ,  దేశభక్తిని పెంపొందించ లేము.  కొండా లక్ష్మణ్ బాపూజీ  స్వాతంత్ర పోరాటంలో శాంతియుతంగా అహింసా పద్ధతిలో పోరాటం చేయగా,  తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పల  ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యమానికి ఊతం అందించిన  పోరాట యోధులలో పేరెన్నికగన్న వాడు. నిజాం   నిరంకుశ పరిపాలనను, రజాకార్ల దౌష్ట్యాన్ని వ్యతిరేకించే  క్రమంలో  అనేక సార్లు జైలు పాలై శిక్ష అనుభవించిన కొండా లక్ష్మణ్  సాయుధ పోరాటంలో పాల్గొన్న టువంటి అనేక మంది పైన మోపిన కేసులను పరిష్కరించడంలో కూడా  న్యాయవాదిగా ఆయన చేసిన సేవ చిరస్మరణీయమైనది . ముఖ్యంగా చాకలి ఐలమ్మ మిగతా కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రమహాసభ కార్యకర్తలపై నాటి ప్రభుత్వం మోపిన కేసులను ఉచితంగా వాదించడం ద్వారా  తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమానికి   తోడ్పాటు అందించిన కొండాలక్ష్మణ్ గారి నుండి  నేటి యువతరం  లాయర్లు,  సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, విద్యారంగ నిపుణులు  ఎన్నో అనుభవాలను ఆదర్శంగా తీసుకోవచ్చు. తమ జీవితాలకు వెలుగును ఇచ్చే విధంగా ముందుకు తెచ్చే విధంగా  త్యాగనిరతి ని ప్రదర్శించే నేటి సామాజిక  రుగ్మతల పై  సమరభేరి మ్రోగించిన డానికి ముందువరుసలో ఉన్నప్పుడు మాత్రమే వారి జీవితానికి సార్థకత ఉన్నట్లు లెక్క.  ఇక  తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో  ముందు వరుసలో నిలబడి మంత్రి పదవిని అనేకసార్లు ముఖ్యమంత్రి పదవిని ఒకసారి త్యాగం చేసిన చరిత్ర  కొండా లక్ష్మణ్ బాపూజీ  1967లో మంత్రిగా నియామకమైన తర్వాత  1969లో వచ్చిన ఉద్యమకాలంలో  తాను తెలంగాణ ఉద్యమకారులకు    మద్దతుగా నిక్కచ్చిగా  తన మంత్రి పదవికి రాజీనామా చేసి   ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం  జైలు శిక్ష విధించిన విషయాన్ని మరచిపోగలమా ?
1996 లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో కూడా  చురుకుగా పాల్గొని   అన్ని ఉద్యమాలకు మద్దతునిస్తూ చివరగా 2011  లో  96 సంవత్సరాల వయస్సులో  ఢిల్లీలో నిరసన దీక్ష  చేపట్టిన సంఘటన  ఇప్పటికీ  ఉద్యమకారుల చెవులలో నాటి తరం నేటి తరం  పోరాట వీరుల లో  మారుమోగుతూనే ఉన్నది.

రాజకీయ సామాజిక  ప్రజా సేవకు సంబంధించిన వారి జీవితాన్ని అధ్యయనం చేయడం ఒక ఎత్తు అయితే పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టి  త్యాగానికి నిలువెత్తు జీవితంగా  విద్యార్థులు భావించే విధంగా కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఎంతగానో ఉన్నది.
       

రాజకీయ పార్టీలకు గుణపాఠం కావాలి :- పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సందర్భంలో తన కొడుకు  పైలెట్గా పని చేయగా తన భార్య వైద్యురాలిగా అనేకమంది  క్షతగాత్రులకు  చికిత్స అందించిన చరిత్ర   వారి కుటుంబానిది  .తెలంగాణ సాయుధ పోరాట కాలంలో  1947 తర్వాత దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాక    ఎగిరిిిిితే  హైదరాబాద్ తెలంగాణ  ప్రాంతాలలో మాత్రం  మువ్వన్నెల జెండా ఎగరడానికి వీలులేకుండా నిజాము ఆంక్షలు విధించిన నేపథ్యంలో  హైదరాబాదులోని కోటి కొన్ని ఇతర ప్రాంతాలలో  సాహసోపేతంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి తన సత్తాను చాటిన టువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ నుండి నేటి రాజకీయ నాయకులు ఏం నేర్చుకుంటారు? ఒక్కసారి పరిశీలించండి .రాజకీయాలలో రాణించాలంటే కేవలం అవకాశవాదంతో, ప్రలోభాలు, రాజకీయాలు, వాగ్దానాలతో పని చేయడం కాదు అని తన జీవితాచరణ తో చూపిన   లక్ష్మణ్ బాపూజీని     ఏ రాజకీయ పార్టీ అయినా  అనుకరించడానికి సిద్ధంగా ఉన్నదా?  ఉప ఎన్నికలు  ఇతర ఎన్నికలు ఎప్పుడు వస్తాయి?  ఏ రకంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేద్దాం? డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశాలు మార్గాలు ఏమిటి? అనే దుర్మార్గపు ఎత్తుగడలతో నేటి రాజకీయ పార్టీలు దుష్ట చరిత్రను నిర్మించుకుంటే  మచ్చలేని  జనం కోసం, ప్రజల అందరి కోసం,  అన్ని వర్గాల కోసం,  చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని రాజీనామా చేయడమే కాకుండా వచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని కూడా వదిలిపెట్టిన   గొప్ప త్యాగశీలిని   నెమరు వేసుకునే ఓపిక చైతన్యము బాధ్యత జ్ఞానము ఇప్పటి తరానికి ఉన్నదా? చెప్పండి . చరిత్ర నుండి మంచిని సేకరించాలి  . త్యాగాన్ని ఆచరించాలి. ఉద్యమ నేపథ్యాన్ని జీవన  మార్గంగా స్వీకరించాలి.  విలువలు లేని రాజకీయాలను,  దిగజారుడు తనాన్ని,  అవినీతి భ్రష్టుపట్టినటువంటి రాజకీయ  విధానాలను   ఛీత్కరించి నప్పుడు మాత్రమే నేటి రాజకీయ పార్టీలకు  ప్రజల మధ్యన బ్రతికే అర్హత ఉన్నది అని  చెప్పుకోవచ్చు.  రాజకీయ అవినీతిని నిర్మూలించ కుండా ఉద్యోగ స్వామ్యం లో అవినీతిని నిర్మూలించడం సాధ్యం కాదు అనే విశ్లేషకుల అభిప్రాయం మేరకు  నేటి రాజకీయ పార్టీలు పక్కా భూకబ్జాలు, అక్రమార్జన, అవినీతి వైపు మాత్రమే ఆరాటపడుతూ  సామాజిక జీవితాన్ని సేవాతత్పరతను  గాలికి వదిలిన  నేపథ్యంలో ప్రజలు అసహ్యించుకుంటున్నారు అనే సోయి రాజకీయ పార్టీలకు లేకపోతే ఎలా?.
  రాజకీయాలంటే పదవులు, గుర్తింపు, సభలు, సమావేశాలు,  హోదాలు అని  కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏనాడు కూడా అనుకోలేదు.  తన సమకాలీన సమాజంలో కూడా తన ఆదర్శ జీవితాన్ని  అనుకరించిన కొంతమంది  నైతిక విలువలకు కట్టుబడి జీవించినట్లు గత చరిత్ర ద్వారా మనం నెమరు వేసుకోవచ్చు . ఆయన సమకాలికులు కాకపోయినా ఆయన జీవితాన్ని, వారసత్వ నేపథ్యాన్ని చదువుకొని  పుక్కిట పట్టి  రేపటి తరానికి అంది0చినప్పుడు మాత్రమే  విలువలు  ఒక తరం నుండి మరొక తరానికి  ప్రసారమవుతాయి . కలుషితం అయినటువంటి రాజకీయ నాయకులు  కొండా లక్ష్మణ్ బాపూజీ గారి లాంటి దేశభక్తుల జీవిత చరిత్రలను చదవటం, అధ్యయనం చేయడం,  వారి గురించిన కథనాలు వినడం ద్వారా  నేటి తరం తో పాటు రేపటి తరాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం మన ముందు ఉన్నది.  ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే క్రమంలో విద్యార్థులు యువతతో పాటు నేటి రాజకీగయ పక్షాల వాళ్లు ముఖ్యంగా పాలకులు  తప్పుడు విధానాలకు స్వస్తి పలికి ప్రజాసేవకు పాకులాడి  అవినీతిని ఆమడదూరం తరిమి  రాజకీయాలకు పరిపాలనకు  ప్రజల భాగస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇవ్వవలసిన అవసరం ఎంతగానో ఉన్నది .అప్పుడు మాత్రమే నేటి రాజకీయ పార్టీలకు పాలకులకు యువతకు కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడి  కార్యక్రమాలు నిర్వహించే అర్హత ఉంటుంది.  .అవినీతి పరులయిన  రాజకీయ పార్టీలకు  ఆయన ఉత్సవాలను నిర్వహించే  నైతిక హక్కు లేదని  ప్రజలు గా మనము శాసించినప్పుడు మాత్రమే వ్యవస్థలో మార్పు వస్తుంది .రాజకీయాలు ప్రక్షాళన చెందుతాయి  .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333