కాంగ్రెస్ పార్టీ VOA లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. CITU డిమాండ్
జోగులాంబ గద్వాల 20 మే 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఐకేపి VOA లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ,వివి నరసింహ డిమాండ్ చేశారు.బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక వాల్మీకి కమ్యూనిటీ హల్ లో జరిగిన ఐకేపి VOA జిల్లా జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఐకేపి VOA లకు 20000 వేతనం ఇస్తామని,అర్హులైన VOA లకు సీసీ లుగా పదోన్నతులు కల్పిస్తామని, అదనపు పని భారాలు తగ్గిస్తామని తదితర అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు.కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగ,జాబ్ చార్ట్ లో లేని పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు నిర్వహించవలసిన ధాన్యం కొనుగోలు సెంటర్ ల దగ్గర VOA లదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం చెబుతున్నప్పటికి,క్షేత్ర స్థాయిలో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిందని, రాజకీయ నాయకులు చేసే తప్పిదాలకు VOA లను బలి పశువులను చేస్తున్నారని, అందులో భాగంగానే తెలుగోని పల్లి గ్రామానికి చెందిన VOA అలివేలమ్మను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ సంఘాలకు రావలసిన ఆదాయాన్ని సైతం పక్కదారి పట్టిస్తున్నారని, ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర రాజకీయ నాయకులు చేసే పెత్తనం అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం(సిఐటియు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డ్యామ్ అంజి,తిమ్మప్ప మాట్లాడుతూ ప్రభుత్వం తమ యూనియన్ నాయకత్వంలో చేసిన దశల వారి పోరాటాల ఫలితంగా అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. అదనపు పని భారాలతో VOA లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే,జిల్లాస్థాయిలోని అధికార యంత్రాంగ వేధింపులు సైతం పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ నాయకుల పెత్తందారీతనాన్ని ఏమి చేయలేని అధికార యంత్రాంగం,VOA లను తొలగించడం ఎంతవరకు సమంజసకరమని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద రాజకీయ నాయకులను నిలువరించకుండా అధికార యంత్రాంగం తమపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే 78 రకాల పనులు, 14 రకాల యాప్ లతో వెట్టి చాకిరీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ రెండు లోపు తమకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దీర్ఘకాల ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి తిరుమలేష్,వివిధ మండలాల నాయకులు కృష్ణారావు, మహేంద్ర,సరస్వతి,రాదమ్మ,ఈదన్న,లావణ్య లక్ష్మన్న, జేఏసీ నాయకులు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.