ఒక్క రోజుతో అనుబంధం తీరేది కాదు
నిరంతరం కొనసాగిస్తేనే రక్షాబంధన్ కు అర్థం ఉంటుంది .కుట్రలు కు తంత్రాల మధ్యన కొనసాగుతున్న మానవ సంబంధాలు పునరుద్ధరించబడితేనే రాఖీ పండుగకు సార్థకత
-- వడ్డేపల్లి మల్లేశం
సందర్భం రాఖీ పౌర్ణమి..అన్నా తమ్ముళ్లు అక్కచెల్లెళ్ల మధ్యన బంధానికి ప్రత్యేకగా కొనసాగుతున్నరక్షాబంధన్ మొక్కుబడిగానే మిగలకుండా దానిని శాశ్వతం చేసుకోవడం అందుకోసం రెండు వర్గాల మధ్యన కూడా విస్తృతమైన విశాల భావనతో మానవ సంబంధాలను కుటుంబ బంధాలను కొనసాగించడమే పండుగ యొక్క గొప్పతనానికి ప్రాచీన నేపథ్యానికి గల అర్థం సార్థకమవుతుంది. బహుశా బతుకమ్మ పండుగ తరువాత ఇంత పెద్ద మొత్తంలో అక్క చెల్లెల్లు తల్లి గారి ఇంటికి చేరుకొని అన్నదమ్ములకు రాఖీలు కట్టే శుభాకాంక్షలు చెప్పి ఆశీస్సులు అందించి ప్రయాణించే తీరు రోడ్డు రహదారులను జన సమర్థముతో నింపేస్తున్నది. సమాజం నిరంతరము సజీవంగా కొనసాగాలంటే మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో అంతే స్థాయిలో కుటుంబ బంధాలు కూడా కొనసాగడం అత్యవసరం. ఎక్కడో జన్మించి ఎక్కడో రెండు కుటుంబాల సమన్వయం కారణంగా జంటగా మారి పిల్లలకు జన్మనిచ్చి అందులో అన్నదమ్ములు అక్క చెల్లెలుగా చిన్ననాటి నుండి కలిసి జీవించి పెళ్లిళ్ల కారణంగా కుటుంబాన్ని విడిచి దూర ప్రాంతాలకు చేరుకున్నప్పటికీ సందర్భోచితంగా తల్లి గారి ఇంటికి రావడానికి ఉన్న అనేక సందర్భాలలో రాఖీ పండుగ కూడా ఒకటి. నిజంగా బంధాలను శాశ్వతం చేసే క్రమంలో పండుగలు ఎంతో తోడ్పడుతున్నాయి. అందులో ప్రధానమైనది రాఖీ పండుగ.
చారిత్రకమైనటువంటి విశేషాలు ఈ పండుగకు సంబంధించి అన్నాచెల్లెల అనుబంధానికి సంబంధించి ఎన్ని ఉన్నప్పటికీ వాస్తవ జీవిత గమనంలో అందులో ముఖ్యంగా మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా కొనసాగుతున్న నేటి తరుణంలో ఈ ఒక్క రోజైనా పండుగ వాతావరణం కనిపించడం కారు చీకట్లో కాంతిరేఖ వంటిది. కానీ ఆ ఒక్క రోజుతోనే పరిమితం కాకూడదని, వేసే ప్రతి అడుగు జీవిత గమనంలోని రోజులు సంవత్సరాల లో ఈ పండుగ ఒకటిగానే ఉండాలి కానీ పండుగనాడు మాత్రమే బంధాలు ఆ తర్వాత నిర్బంధాలు అనే పద్ధతిలో కొనసాగితే దీనికి అర్థం ఏముంటుంది ?
కుటుంబాల ఆర్థిక పరిస్థితులు భిన్నమైన స్థితి లో ఉండవచ్చు. కానీ బంధుత్వంలో అన్నా చెల్లెల్ల అనుబంధంలో అసమానతలు అంతరాలకు తావుండకూడదు. నిత్యజీవితంలో అనేక కుటుంబాల మధ్యన సంవత్సరాల తరబడిగా మాటలు లేకపోవడం, ఒకరంటే మరొకరు చిరాకు, విద్వే శాలు,అసూయ దేశాలు, కుట్రలు కుతంత్రాలతో జీవితం గడపడాన్ని మనం గమనించవచ్చు. ఇలాంటి పండుగ సందర్భంగా మాట వరసకైనా తోటి వాళ్ళు ఏమనుకుంటారు అనే ధ్యాసతోని అయినా అన్నా తమ్ముళ్లు ఆహ్వానించడం అక్కా చెల్లెలు ఇష్టం లేకపోయినా కనీసం లోక బాధకు వెళ్లి రాఖీలు కట్టి రావడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో అక్కా చెల్లెలు తల్లి గారింటికి వెళ్లడానికి అన్నదమ్ములకు రాఖీలు కట్టి తమ సంతోషాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అన్నదమ్ములు ఆహ్వానించనటువంటి కరుడుగట్టిన మనస్తత్వాలను కూడా మనం గమనించవచ్చు.కొందరింట్ల స్త్రీలు తాను మాత్రం తన అన్నా తమ్ముళ్ల ఇంటికి వెళుతుంది కానీ తన ఇంటి ఆడపడుచులను మాత్రం ఆహ్వానించడానికి ససే మిరా అంగీకరించదు ఇది ఎక్కడి న్యాయం? గూడు క ట్టుకున్న టువంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు, ఇతరులను చిన్నచూపుతో అవమానించే ధోరణి, తమ స్థాయికి సరిపోరనె మూర్ఖపు ఆలోచనలు, ఏనాడో కుటుంబాల మధ్యన రగిలినటువంటి చిచ్చును పెద్దగా చేసుకుని శాశ్వతంగా తలుపులు మూసుకోవడం వంటి అజ్ఞానపు ఆలోచనలు స్వార్థపు ఎత్తుగడలతో కుటుంబాల మధ్యన బంధాలు అత్యంత క్షీణ దశలో ఉన్న పరిస్థితులను కూడా సమాజంలో మనం గమనించవచ్చు. నిత్య నూతనంగా జీవితాన్ని కొనసాగించడం ద్వారా మానవ జన్మకు సార్థకతను చేకూర్చడం కనీస లక్ష్యంగా జీవించవలసిన తరుణంలో అందుకు భిన్నంగా గూడు కట్టుకున్నటువంటి స్వార్థపు ఆలోచనల మధ్య కుటుంబాలు పంతాలు పట్టింపులతో నలిగిపోతున్నాయి. మనుషులు దుఃఖ భారంతో కృంగిపోతున్నారు. కొందరు అయితే ఇదే అవకాశం గా భావించి దూరమైనందుకు సంతోషిస్తున్నారు. ఇదేనా నాగరికత, సంస్కృతి? తోటి మనిషిని సాటి మనిషిగా చూడవలసిన ఈ వ్యవస్థలో తోబుట్టువుల మధ్యన ఇంత విషం చిమ్మడం వెనుక ఉన్న ప్రయోజనాలు ఏమిటి? విశాల హృదయానికి పరిమితి విధించుకోవడం, లేనిపోని చాడీలను పెంచుకోవడం, ఆధిపత్యం అహంకార భావనలతో ఏర్పడ్డ పగుళ్ళు ప్రధానంగా నేడు కుటుంబ బంధాలలో కనిపిస్తున్నటువంటి అంశాలు .సంవత్సరాంతం ఎవరింట్లో వాళ్ళు క లో గంజో తాగి బతుకుతూ జీవన గమనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పటికీ పెళ్లిళ్లు, పండుగలు, జాతరలు, శుభ కార్యక్రమాలలో తరచుగా కలుసుకోవడానికి అవకాశాలు ఉంటున్నాయి. అలాంటి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోకుండా, మాటలు దూరం చేసుకుని, శత్రుత్వాన్ని పెంచుకోవడం ద్వారా సంబంధాన్ని కట్ చేసుకోవడానికి కొందరు ఇష్టపడుతున్నారంటే.... ఎంత బాధాకరం...
విధి లేని పరిస్థితిలో కనీసం ఏడాదికి ఒక్క మారు ఇలాంటి సందర్భంలోనైనా కలుసుకోవడానికి కొందరు ఉత్సాహపడుతుంటే మరి కొందరు మనసు చంపుకొని అసంతృప్తితో ఆవేదన ఆందోళనకు గురై కన్నవారి ఇంటికి వెళ్లడానికి మనసు ఒ ప్పక కన్నీరు కార్చే సోదరీమణులను వ కూడా మనం కనులారా చూడవచ్చు .ఒక ఇంటి కోడలు మరొక ఇంటికి ఆడబిడ్డ కదా! ఈ సంబంధం ప్రతి ఇంటికి ఒకే మాదిరిగా ఉంటుందనె వాస్తవాన్ని గమనించి కూడా అతీతంగా వ్యవహరించడం అంటే మానవత్వాన్ని సజీవ దహనం చేయడo, అహంకారం తో విర్రవీగడమే అవుతుంది . కాటికి కాళ్లుచాపే వరకు కూడా తల్లిగారిల్లు అనే ఆత్మీయతతో వుండే స్త్రీ మూర్తులకు వున్న ఈ ఒక్క అవకాశా న్ని అయినా నిరోధించక ఆహ్వాణించడం తల్లిగారింటి
సంస్కారం.
అన్నా తమ్ముళ్లలో హశ్చాత్తాపం రావాలి
తమ ఇంటి ఆడబిడ్డలు ఏదో సందర్భానుసారంగా కొంత దూరమైనప్పటికీ ఎక్కడో ఒక దగ్గర మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి అన్నదమ్ములు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అలాంటి దానికి రాఖీ పండుగ ఒక ఎత్తుగడగా సందర్భంగా పనిచేస్తుంది. చొరవ తీసుకొని పలకరించి ఇంటికి ఆహ్వానించి సాదరంగా తోచిన రీతిలో కట్నకానుకలతో సాగనంపితే ఆడపిల్లలు కట్టిన రాఖీతో ఆశీస్సులతో మనసు పులకరిస్తే అంతకుమించిన ఆనందం మరేముంటుంది? ఆ సోయి బంధాలు మరిచిన రెండు వర్గాలకు కూడా ఉండవలసిందే. బాధ్యత మరిచిన వాళ్ళు ఎవరైనా పశ్చాత్తాపముతో తమ బాధ్యతలను గుర్తించి సామాజిక బంధాలను జీవన గమనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని నూరేళ్ల పండుగను తృప్తికరంగా కొనసాగించడానికి షరతులను అహంకారాన్ని పక్కన పెట్టి ప్రేమతో అనురాగంతో ఆత్మీయతతో ఆప్యాయతతో ఆడపడుచులను ఆహ్వానించడం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని ప్రదర్శించుకోవలసిన బాధ్యత కొంత మగవాళ్ళ పైన వారి భార్యల పైన ఎక్కువగా ఉంటుంది. అంతే స్థాయిలో బాధ్యతను విస్మరించి అన్న తమ్ముళ్ల పైన కక్షతో జీవిస్తున్న ఆడపడుచులు ఎవరైనా ఉంటే వాళ్లు కూడా మనసు మార్చుకుని సంబంధాలు కొనసాగించడానికి ఇష్టపడితే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. ఎందుకంటే జీవితం ఒక్కటే మళ్లీ తిరిగి రాదు ఈ సత్యాన్ని తెలుసుకుంటే అంతకుమించిన జ్ఞానోదయం మరొకటి ఉండదు .రాఖీ పండుగకు ఉన్న నేపథ్యం ఎంత చారిత్రాత్మకమైనదో ఆ చారిత్రాత్మక బంధాన్ని అనుబంధాన్ని కొనసాగించవలసిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. "మా మతం మానవత్వం మా కులం మంచితనం" అంటూ కుల మతాలకు అతీతంగా కూడా రాఖీ పండుగను నిర్వహించుకుంటున్న ఈ తరుణంలో ఒకే కులంలో ఒకే ఇంటిలో ఓకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్యన ఇంత వైరుధ్యం వ్యత్యాసం కక్షలు కార్పన్యాలు అవసరమా? ఆలోచించండి! తిరిగి రాదు జీవితం అవగాహన చేసుకోండి! శత్రుత్వానికి అడ్డుకట్ట వేయండి! అక్క చెల్లెల్లారా అన్నదమ్ముల్లారా మన బంధాలను ప్రజల పరచుకుందాం! మనమంతా ఒకే కుటుంబం లాగా కలిసి జీవించి మన మధ్యనున్నటువంటి అంతరాల తరిమికొడదాం.
వృద్ద తల్లితండ్రులు కూడా తమ కొడుకులు బిడ్డల మధ్య వైరుద్యం రాకుండా చూడాలి.
( ఈ వ్యాస కర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)