మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని సంబరపడుతుంటే
మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని సంబరపడుతుంటే
ఆత్మహత్యల్లో కూడా అగ్ర బాగాన ఉండడం ఆందోళన కలిగించే విషయం.
సామాజిక, ఆర్థిక కారణాలు ఎన్నున్నా పాలనా వైఫల్యాలు కూడా కారణమౌ తున్నాయి కదా!
--వడ్డేపల్లి మల్లేశం
భారతదేశం ఇటీవల ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రభుత్వంతో సహా అన్ని వర్గాలు నొక్కి చెబుతుంటే మానవ వనరుల ఉనికికే విగాథము కలిగించే ఆత్మహత్యలు కూడా భారతదేశంలో పెద్ద మొత్తంలో జరగడం ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ లాంటిది. కారణాలను విశ్లేషిo చి, గణాంకాలు పొందుపరిచి ప్రజలకు తెలియజేస్తారు కానీ పాలనాపరమైన వైఫల్యాలు ఉన్నచోట నొక్కి చెప్పడం ద్వారా నిర్వహణ లోపాలను సవరించుకున్నట్లయితే సామాజిక ఆర్థిక రంగాల్లోని అనేక అంశాలలో ఆత్మహత్యలను తగ్గించే అవకాశం మెండుగా ఉంటుంది. ఉపాధి లేక పేదరికంతోని అవమానాలు, పిల్లలను చదివించుకోలేక, కుటుంబ భారాన్ని మోయలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈ దేశంలో ఇప్పటికీ తాండవిస్తుంటే మూడవ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా కొలమానం అవుతుందో ఒక్కసారి పాలకులు కూడా ఆలోచించాలి. 2024 కేంద్ర ప్రభుత్వ యాక్సిడెంట్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారంగా 2024 సంవత్సరంలో కారణాలు ఏవైతే నేమి మొత్తంగా 1,70,000 మంది మరణాలకు పాల్పడ్డారనేది చేదు నిజం. సహజంగా కుటుంబ సమస్యల వల్లనే ఎక్కువ కలహాలు కయ్యాలు చివరికి ఆత్మన్యునతకు గురికావడంతో అవమాన భారం మోయలేక ఆత్మహత్యలు చేసుకోవడంలో మేధావులు బుద్ధి జీవులు కూడా ఉన్నారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఆత్మహత్యల గణాంకాలను పరిశీలిస్తే
ప్రతి ఏటా కొనసాగుతున్న ఈ ఆత్మహత్యల పర్వం అభివృద్ధి చెందుతున్న మన భారతదేశానికి ఎంతో అవరోధం. ప్రజాసామిక వ్యవస్థ మన గలిగిన ఈ దేశంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుకోవలసిన తరుణంలో వాడిపోయిన పువ్వుల్లా నేలరాలుతూ ఉంటే ప్రణాళికలు ఎన్ని వేసుకున్న ఫలితం ఏముంటుంది? ముఖ్యంగా ఈ వర్గాలలో కాయకష్టం చేసే వాళ్ళు, కార్మికులు,రైతులు, చేతివృత్తుల వాళ్ళు, వీధి, చిరు వ్యాపారులు, శ్రమజీవులే ఎక్కువగా ఉంటారనేది నగ్న సత్యం. అంటే దేశ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈ వర్గాలు కనుమరుగైతే ఒక్కసారి ఆలోచించండి .
కుటుంబ సమస్యల వల్ల 33.5%, అనారోగ్యంతో 17.9%, మత్తు పదార్థాలు మద్యానికి బానిస కావడం వల్ల 7.6%, వైవాహిక అంతర్గత సమస్యల వాళ్ల 5 శాతం, ప్రేమ విఫలం కావడం వల్ల 4.6%, ఇక అప్పులపాలై సమాజానికి ముఖం చూపించుకోలేక దివాలా తీసిన వాళ్లు 4.4% చనిపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయి 1.2% ఆత్మహత్యలు చేసుకుంటే ఇక తమకు ఉద్యోగం రాదని ఆవేదనతో చనిపోతున్న వాళ్ళు 1.5%, ఆత్మీయుల మరణం తట్టుకోలేక 1.2% వృత్తి సమస్యల వల్ల 1.2%, ఆస్తి తగాదాల్లో విఫలం కావడం వల్ల 0.7, ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న కారణంగా పేదరికం కాటుకు బలవుతున్న వాళ్లు 0.6% ,సామాజిక హోదా- అవమాన భారంతో 0.5%, అక్రమ సంబంధాలు 0.5%, ఇతర వైయక్తిక కారణాలు 9.5% కాగా 10.1% మరణాలకు అంతుచిక్కని పరిస్థితులని నివేదిక సారాంశం.
ప్రభుత్వ పాత్ర ప్రతి చోట కీలకం:-
ఆత్మహత్యలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులను విశ్లేషిస్తే పాలనాపరమైన లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మత్తు పదార్థాలు డ్రగ్ మద్యాన్ని ప్రభుత్వమే పెంచి పోషించి దురలవాటు చేసి అనారోగ్యం పాలయితే ఆత్మహత్యలు చేసుకునేది పాలకుల వల్ల కాదా?. ఇక ఉపాధి కల్పించి పేదరిక0 బారిన పడకుండా ఆత్మగౌరవంగా బ్రతికే పరిస్థితి కల్పించవలసిన ప్రభుత్వాలు వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ప్రమేయం లేకుండా ప్రజలను గాలికి వదిలితే అవమాన భారంతో కృంగిపోరా? విద్యా వ్యవస్థలోని లోపాలు పేపర్ లీకేజీ వంటి కారణాలు కూడా ఆత్మహత్యలను పురి కొలుపుతున్నాయంటే ఇవన్నీ చట్టబద్ధమైన హత్యలు కాక మరేమిటి? ఇక పేదరికం కాటు వేసిన అనేకమంది కొనుగోలు శక్తి లేక కనీస జీవితం గడపడమే కష్టమవుతున్న తరుణంలో అనారోగ్య భారాన్ని భరించలేక చికిత్స చేయించుకోలేక కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాత పడడానికి గమనిస్తే ఇదంతా ఎవరి దయవల్ల ప్రభుత్వాల బాధ్యత లేదా? ఇప్పటికీ ఉచిత విద్య వైద్యం గాలిలో దీపం లాగా వేలాడుతూ ఉంటే భరోసా ఇవ్వని పాలకుల కర్కశత్వం వల్ల కార్మికులు, రైతుల మాదిరిగా తమ పిల్లలను చదివించుకోలేక పెట్టుబడులు పెట్టలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కోట్లాదిమంది తల్లితండ్రులు.....
ఇక సామాజిక పరమైన సందర్భాలలో అక్రమ సంబంధాలు ఆస్తి తగాదాలు వృత్తిపరమైన సమస్యలు ప్రేమ వ్యవహారాలు వివాహ సంబంధ కుటుంబ పరమైన సమస్యల విషయంలో కూడా ప్రజలకు భద్రతను భరోసాను ఇవ్వవలసినటువంటి ప్రభుత్వాలు మిన్నకుండడం వల్ల కోర్టుల చుట్టూ పోలీసు వ్యవస్థ మధ్యన తిరుగుతూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఖర్చులకు డబ్బులు లేక నా అనే వాళ్ళు లేక న్యాయసహాయం అందక చనిపోతున్న వాళ్లు కోకొల్లలు. నేరం ఆరోపించబడి ఆ కారణంగా అరెస్ట్ చేస్తే జీవితాంతం జైలు శిక్ష అనుభవించి ఎందుకు జైలు శిక్ష విధించబడిందో వాళ్ల నేరం ఏమిటో తెలియకుండానే మృత్యువాత పడుతున్నటువంటి తీరు భారత దేశంలో ఒక ప్రత్యేకత. తీరా దశాబ్దం తర్వాత న్యాయవ్యవస్థ నిర్దోషి అని తీర్పిస్తే అప్పటికే వాళ్లు అనారోగ్యం పాలై మృత్యు స్థాయికి చేరుకుంటుంటే ఇక వీళ్ళ మరణాలకు ప్రభుత్వం కొంతైనా బాధ్యత లేదా? చట్టబద్ధమైన కేసుల విషయం లోపల కూడా దశాబ్దాల తరబడి కాలయాపన కావడంతో కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తమ ఆస్తిత్వాన్ని కోల్పోయి యావదాస్తిని అమ్ముకొని దగ్గరి మార్గము కానరాక కుటుంబాలకు కుటుంబాలే కనుమరుగవుతున్న సంఘటనలు ఎన్నో. ఈ రకంగా ప్రజల్లో భద్రతా భరోసాను నింపకపోవడం, సకాలంలో న్యాయవ్యవస్థ పరిష్కారాలు చూపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం, అకారణంగా అరెస్టు చేసి హింసించి ఆదరువు లేనటువంటి పేద వర్గాలు ఆత్మహత్యలనే ఆశ్రయిస్తూ ఉంటే సామాజిక రాజకీయ ఆర్థిక జీవన విధానం భారత దేశంలో ప్రజలు తల ఎత్తుకొని బ్రతికే విధంగా లేకపోవడం వల్ల సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై పేదరికం వెక్కిరిస్తూ ఉంటే అయోమయానికి గురై నా అనే వారు లేని దుస్థితిలో ఇక మరణమే శరణ్యం అనుకుంటున్న సందర్భాలు ఎక్కువే.
ఆత్మహత్యలకు కారణాలు, సాంకేతికపరమైన అంశాలు, నివారణోపాయాలు, పాలనాపరమైన చర్యలను ప్రభుత్వాలు మానసిక వేత్తలు సామాజికవేత్తలు అధికారులతో సమీక్షించడం ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలిగితే, ఉచిత విద్య వైద్యాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగితే, ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగితే, చిన్నాచితకా సామాజిక ఆర్థిక కుటుంబ సమస్యలు పెద్దగా ప్రభావితం చేయవు. కానీ ఆర్థికంగానే కృంగిపోయి తట్టుకోలేని పరిస్థితిలో చిన్న సమస్య కూడా పెద్ద కారణమవుతుంటే నేలరాలడం వాంఛనీయం కాదు. మెజారిటీ యువత ఉన్న భారతదేశంలో యువశక్తిని కాపాడుకోవాల్సిన అవసరం వాళ్ల తల్లిదండ్రులకు మాత్రమే కాదు పాలకులకు కూడా ఉంది. వివిధ రంగాలలో నిపుణులుగా తయారు చేసుకోవడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని ప్రభుత్వాలు స్వీకరించగలిగితే శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని విభాగాలలోను నిపుణులు ఉండే ఆస్కారం ఉంటుంది.
యువత మరింత చైతన్యమై ప్రజా జీవితంలో ప్రగతి వైపు కొనసాగాలంటే యువతను చెడు దారి పట్టిస్తున్నటువంటి మధ్యము డ్రగ్స్ మత్తు పదార్థాలు ధూమపానము క్లబ్బులు పబ్బులు ఈ ఈవెంట్లను కనుచూపు మేరలో లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు హత్యలు అత్యాచారాలు ఆత్మహత్యలు జరిగిన తర్వాత విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేస్తే ప్రయోజనం ఏముంటుంది? కుటుంబాల ఆర్థిక సామాజిక పరిస్థితులు బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుంది అప్పుడు సమస్యలు లేని భారతావని ఆవిష్కృతమవుతుంది. కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు తమ మనుగడ కోసం ప్రతిపక్షాలతో విమర్శలతోనే కాలం గడిచిపోతూ ఉంటే ప్రజల గురించి పట్టించుకునే అవకాశం పాలకులకు ఎక్కడిది? అందుకే ప్రతి ఏటా ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? కారణాలను అన్వేషించి పరిష్కారాలను వెతికి సామాజిక ఆర్థిక రాజకీయపరమైనటువంటి ప్రజా జీవితంలో మెరుగైన పరిస్థితులను తీసుకు రాగలిగితే సగానికి పైగా ఆత్మహత్యలను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కావలసింది ప్రభుత్వ పరంగా ప్రజలకు యువతకు భరోసా, కొనుగోలు శక్తిని పెంచడం, సంపదను అందరికీ సమానంగా పంచడం, అంతిమంగా ఆత్మస్థైర్యాన్ని ప్రజలలో పెంపొందించడం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)