ఏజెన్సీలో ఎస్టీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ చెప్పటాలి
అర్హత లేని వారికి ధృవీకరణ పత్రాలు జారీ చేయొద్దు.
ఆదివాసుల హక్కుల పోరాట సమితి వాజేడు మండల అధ్యక్షులు తొర్రమ్ సంతోష్.
వాజేడు, 24 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఆదివాసుల హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వాజేడు మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గిరిజనుల రాజ్యాంగబద్ధమైన హక్కులు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ అవకాశాలు సంక్షేమ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఎస్టీ సర్టిఫికెట్ల జారీ సమయంలో దరఖాస్తుదారుల పూర్వీకుల కుల రికార్డులు పాత పాఠశాల రికార్డులు రెవెన్యూ రికార్డులు నేటివిటీ తదితర చట్టబద్ధమైన ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వ్యక్తులకు కేవలం ప్రస్తుత నివాసం ఆధారంగా ఎస్టీ ప్రయోజనాలు కల్పిస్తున్నారనే ఫిర్యాదులపై కూడా నిబంధనల ప్రకారం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం లేదా తప్పుడు పత్రాల ఆధారంగా ఎస్టీ సర్టిఫికెట్ పొందినట్లు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే జారీ చేసిన అనుమానాస్పద ఎస్టీ ధృవీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం పునఃపరిశీలించాలని, సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో స్థానిక రికార్డులు మరియు సంబంధిత అధికారుల నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.అర్హత ఉన్నవారికి మాత్రమే ఎస్టీ ధృవీకరణ పత్రాలు జారీ చేయాలి. అర్హత లేని వారికి లేదా తప్పుడు పత్రాలతో పొందిన సర్టిఫికెట్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గిరిజనుల హక్కులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసుల హక్కుల పోరాట సమితి పాయం జానకి రమణ వాజేడు మండల అధ్యక్షుడు తొర్రెమ్ సంతోష్ ఉపాధ్యక్షుడు వాసం సంతోష్ మండల కార్యదర్శి చాప లక్ష్మణ్ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌కు చెందిన జిల్లా అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.