అస్తి కళేబరాలపై ఆధిపత్యమా?

అస్తి కళేబరాలపై ఆధిపత్యమా? ఎండిన డొక్కలపై వెటకారమా?

Feb 23, 2025 - 09:50
Feb 23, 2025 - 09:49
 0  5

అస్తి కళేబరాలపై ఆధిపత్యమా?

ఎండిన డొక్కలపై వెటకారమా? వృద్ధ తల్లిదండ్రులపై జాలి చూపండి

 బ్రతికినంత కాలం ప్రేమలు పంచండి.

జీవితం మళ్ళీ రాదు బతుకును సార్థకం చేసుకోవడానికి ఇదే అదును.

సామాజిక ఉద్యమాభివందనాలతో.....  

-----వడ్డేపల్లి మల్లేశం 

జీవితం ఒక చదరంగం అని, నాటకమని, పోరాట వేదిక అని, సముద్రం లోతు తెలుస్తుంది కానీ జీవితం యొక్క లోతుపాతులను తరచి చూడలేమని బ్రతుకు చిత్రం గురించి పలు రకాలుగా వ్యాఖ్యానించడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే నూరేళ్ల జీవితానికి సంబంధించిన సంఘటనలు, ఘటనలు, అనుభవాలు, జ్ఞాపకాలు, సంఘర్షణలు, సందిగ్ధతలు, ఇలాంటి సందర్భాలు అనేకం. అయినా జీవన గమనంలో కుటుంబంలో ఉండే భార్యాభర్తల మధ్యన సయోధ్యను సాధించడమే గగనమవుతున్న తరుణంలో కుటుంబ సంబంధాలను బలోపేతం చేస్తూ సామాజిక మానవ సంబంధాలను కాపాడే క్రమంలో కుటుంబ సభ్యులను సమన్వయ పరిచి వృద్ధులైన తల్లిదండ్రులను జాలిగా దయతో ప్రేమానురాగాలతో చూడవలసినటువంటి తరుణంలో ఆధునిక కాలంలో ప్రతి ఇంటా ప్రతిచోట పత్రికల్లో సాంఘిక మీడియాలోచిత్రావిచిత్రాలు. "దయనీయ జీవితం గడుపుతున్న తల్లిదండ్రులు, తప్పిపోయిన వృద్ధ దంపతులు, తిండి పెట్టడానికి నిరాకరించిన కొడుకు కోడలు, మెడబట్టి గెంటివేసిన కుటుంబ సభ్యులు" అంటూ నానా రకాల ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. చాలా కుటుంబాలలో వివక్షతకు అణచివేతకు హింసకు దోపిడీకి అవమానానికి గురవుతున్నటువంటి వృద్ధ తల్లిదండ్రులకు ఆ దుస్థితి రావడానికి మహిళలు ప్రధాన కారణం అయితే మరికొన్ని కుటుంబాలలో కన్న కొడుకుల అరాచక వాదంతో, నిర్లక్ష్యంతో, అణచివేతతో, తాగుబోతులై పట్టించుకోని సందర్భంలో కోడళ్ళు జాలి చూపిన సందర్భాలు కూడా అనేకమే. ఇక చాలా కుటుంబాలలో కొడుకు కోడలు, కుటుంబ సభ్యులు పిల్లలు అందరు కూడా ఒకే మూసలో పోసినట్లుగా కఠినంగా వ్యవహరించిన చోట మాత్రం ఆ వృద్ధ తల్లిదండ్రుల యొక్క జీవితం అడవిలో పొద్దుకి నట్లే. అత్తా కోడళ్ళ ఘర్షణలు, సూటిపోటి మాటలు, వాగ్వాదాలు కూడా వృద్ధాప్యంలో ఈ దుస్థితికి కారణమైతే తమ జీవితం కూడా ఇంతే కదా తాము కూడా వృద్ధాప్యంలోకి రావాల్సిందే అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో అనే ముందు చూపు లేని కారణంగా కూడా వృద్ధులపై దాస్తీకానికి పాల్పడి గెంటివేసి అవమానించి అన్నం పెట్టక హింసిస్తూ నిందిస్తూ ఇష్టమున్న బూతులు మాట్లాడుతుంటే 

  "ఇక జీవితం ఎందుకు ఏదో ఇంత మందు తాగి చచ్చిపోతే మేలు కదా" అనుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న అయ్యవ్వలు కూడా అనేకం .

తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఇద్దరు ముగ్గురు లేదా ఐదుగురు పదిమంది వరకు కూడా కన్న సందర్భం మనకు పూర్వకాలంలోనైతే మరింతగా కనపడుతుంది. కానీ ప్రస్తుత వ్యవస్థలోనైనా ఇద్దరు ముగ్గురు కొడుకులు కలిసి తల్లిదండ్రులను పోషించలేకపోవడం, పోషణ వ్యవహారంలో పంపకాలు జరుపుకోవడం, అన్నదమ్ముల మధ్యన మాటలు లేక కూడా వీళ్ళ పరిస్థితి మరింత దిగజారడాన్ని కూడా మనం పసిగట్టవచ్చు. కొన్నిచోట్ల తల్లిదండ్రుల దుస్థితి పైన స్పందించినటువంటి ఆడపిల్లలు తమ అన్నదమ్ములను వదినలను మరదళ్లను హెచ్చరించిన సందర్భాలు కూడా లేకపోలేదు. కానీ అనేక సందర్భాలలో మా విషయం మీకేం అవసరం అని నిందించినటువంటి అన్నా వదినలను కూడా మనం చూడవచ్చు. ఎక్కడో పుట్టి ఇంటికి ఇల్లాలుగా వచ్చినటువంటి కోడళ్ళు కొంత అవగాహనారహిత్యం లేదా ఆదిపత్యం ఎందుకు సేవ చేయాలి అనే మూర్ఖత్వంతోని కొందరు వ్యవహరిస్తే వ్యవహరించవచ్చు కానీ కడుపున పుట్టిన కొడుకులు తాగుడుకు బానిసలై, జూదము, వ్యభిచారము, ఇతర సామాజిక రుగ్మతల బారిలో చిక్కి పనికి దూరమై సంపాదన లేకుండా ఆడవాళ్ళ సంపాదనపైన ఆధారపడి కుటుంబాన్ని వెతల పాలు చేస్తున్న వాళ్లు కూడా తల్లిదండ్రులను పోషించక తాగుడుకు డబ్బు కావాలని వృద్ధాప్యంలో కూడా వేధించినటువంటి కొడుకులను కూడా మనం చూడవచ్చు. ఇది మరింత నీచమైన దయనీయమైన పరిస్థితి అంతెందుకు అనేకచోట్ల తాగుడు మానాలని కొడుకులను మందలించినందుకు, కష్టపడి పని చేసుకోమని హెచ్చరించినందుకు, తమకు పిడికెడు అన్నం పెట్టి తృప్తిగా సాదుమని కోరినందుకు తల్లిదండ్రులని హత్య చేసినటువంటి కొడుకులను కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ సంఘటనలు ప్రతిరోజు మనకు టీవీలలో పత్రికల్లో కనపడుతూనే ఉన్నాయి.

ఒకవైపు విద్య విజ్ఞానము ద్వారా సంస్కారాన్ని సంస్కృతిని నేర్పడం మానవతా విలువలను పెంపొందించుకోవడం ద్వారా మనిషిని తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలనే ఆరాటం సామాజిక కట్టుబాట్ల ద్వారా కొనసాగుతూ ఉంటే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, బుద్ధి జీవులు మేధావులు కూడా" మనుషులంతా ఒక్కటే, అందరూ కలిసి బ్రతకాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి" అంటూ నిన దీస్తూ ఉంటే కూడా ఇవేవీ పట్టనట్లు మెజారిటీ కుటుంబాలలో ఇలాంటి చెడు ధోరణి కొనసాగడం, చనిపోయిన తర్వాత శవం దగ్గరికి చేరుకున్నటువంటి ఇరుగుపొరుగు కొడుకులను కోడండ్లను నిందించడం, పట్టించుకోని కుటుంబ సభ్యులు మనమలు మనవరాన్లను దూషించడం కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాం. అంతెందుకు బ్రతికినన్నాళ్లు పిడికెడు మెతుకులు, నోటి నిండా అన్నము, కడుపుకు రుచికరమైన ఆహారం పెట్టనటువంటి వాళ్ళు పక్షికి పెట్టే సందర్భంలో చిన్న కర్మ పెద్దకర్మ పేరుతో నెల మాసికం ఏడాది మాషికమంటూ గొప్పగా ఖర్చు చేసి గొర్లు మేకలను కోసి ఊరంతా భోజనాలు పెట్టి సంతోషపడతారు. ఇక మద్యం మత్తులో సంవత్సరకాలం పాటు ఊగుతూనే ఉంటారు. ఇక్కడ కనిపె o చిన తల్లిదండ్రుల పట్ల ఇంత వివక్షత చూపడానికి కారణం ఏమిటి? వాళ్ళు ఎందుకు నేరస్తులుగా మిగిలిపోతున్నారు?

వాళ్ళు ఎందుకు బోనులో నిలబడవలసి వస్తున్నది? వారి పట్ల వివక్షత చూపడానికి కారణాలేమిటి? కుటుంబానికి పెద్దదిక్కుగా ఆలంబనగా మార్గము చూపి బక్క చిక్కినందుకేనా? ఎండిన డొక్కలు మాసిన నెత్తి ) బట్టలు, ఊగుతున్న కండరాలు కుటుంబ సభ్యులకు నచ్చడం లేదా? అని ఆ కుటుంబ సభ్యులందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన చరిత్ర మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ బలమైన కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశంలోని ప్రతి చోట కూడా ఇలాంటి రాక్షస కృత్యాలు, అమానవీయ సంఘటనలు, ఆర్తనాదాలు, ఆకృత్యాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి, తమను తాము సంస్కరించుకోవాలి. తమ పరిస్థితి కూడా ఇంతే ఉంటుందని తాము వృద్ధుల మైన తర్వాత మరింత దయనీయమైన పరిస్థితి రావచ్చునని ఊహ గనుక ఉంటే అంచనా వేయగలిగితే మనం ఎప్పుడూ తప్పు చేయము. కొడుకుల్లారా!కోడంల్లారా! పిల్లలారా! కుటుంబ సభ్యులారా! మీకు చేతులెత్తి వందనం సామాజిక ఉద్యమ అభివందనాలు మన మనసును మార్చుకుందాం! మలినాన్ని కడుక్కుందాం! మానవత్వం పునాదిగా మనిషంటే అంతటా ఒకే రకమని ఎక్కడ కూడా ఇలాంటి వివక్షత కొనసాగకూడదని ప్రతి కుటుంబంలోనూ ఆదరించబడాలని అందరికీ మార్గ నిర్దేశం చూపుదాం! చేసిన పొరపాట్లను సవరించుకుందాం!. తప్పుకు తలవంచుదాం! భవిష్యత్తులో జరగకుండా చూద్దాం! క్రమక్రమంగా ఈ వ్యవస్థనుండి బయటపడి మనిషిని మహోన్నతునిగా గుర్తించే ఉన్నత స్థితికి చేరుకుందాం!. ఒకటే జీవితం పుట్టుక నుండి చావు మధ్యన మన వ్యక్తిత్వం, కర్తవ్యం, కార్యశీలత, ప్రవర్తనను బట్టి మనలను అంచనా వేస్తారు. మన జీవితానికి సార్థకతను సంపాదించుకోవాలన్నా, మనిషిగా బతకాలన్నా, బ్రతికినప్పుడే ప్రేమలు పంచుదాం! అంతకుమించి కడుపునిండా భోజనం పెట్టి కమ్మగా ఆలనా పాలనతో పలకరిద్దాం! కళ్ళల్లో కళ్ళు పెట్టి కనికరం చూపుదాం! మానవత్వానికి ప్రతీ కగా నిలబడదాం!. సమాజానికి పెద్దమనుషులకు తాకిన మానసిక గాయాలను మనమే మాన్పుదాం! ఆ వైపుగా మనలను మనమే మార్చుకుందాం! ఆ వైపుగా రావాలని మనసారా వందనాలతో.......

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333