అక్రమ రేషన్ బియ్యంపై పోలీసుల ఉక్కుపాదం.. 6 క్వింటాళ్లు స్వాధీనం
జోగులాంబ గద్వాల 4 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యాన్ని మల్దకల్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉలిగేపల్లి గ్రామానికి చెందిన యెరుకలి పరుశురాముడు (తండ్రి: అంజనేయులు)పై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రేషన్ లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరకు విక్రయించేందుకు పరుశురాముడు తన ఇంట్లోని బాత్రూమ్లో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 5:50 గంటల సమయంలో బ్లూకోల్ట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు తిప్పారెడ్డి (PC-1037), సుధాకర్ (PC-833) ఇంటిని తనిఖీ చేయగా 14 సంచుల్లో నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల రేషన్ బియ్యం గుర్తించారు. దీంతో బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మల్దకల్ పోలీసులు తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని పోలీసులు హెచ్చరించారు.