స్వేచ్ఛ పేరుతో మోసపోవద్దు!
‘నైతికతే నిజమైన స్వేచ్ఛ’ సెప్టెంబర్ 1 నుండి 30
వరకు దేశవ్యాప్త జాగృతి ఉద్యమం.
(జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్)
‘నైతికతే నిజమైన స్వేచ్ఛ’ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్త జాగృతి ఉద్యమం నిర్వహిస్తుందని జమాఅతె ఇస్లామీ హింద్ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వేచ్ఛ.. అంటే కళ్లెంలేని గుర్రంలా ఇష్టమొచ్చినట్లు జీవించడమా.. లేట్ నైట్ పబ్ కల్చర్.. నచ్చినట్లు ఉండటం.. ఇదే ఇప్పుడు స్వేచ్ఛగా మారిపోయింది. ఎలాంటి హద్దులు లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడమే స్వేచ్ఛగా భావిస్తున్నారు. ఈ మితిమీరిన స్వేచ్ఛ ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నైతికత లేని స్వేచ్ఛ సమాజాన్ని ఎటు తీసుకెళుతుందో నిత్యం జరుగుతున్న ఘటనలే నిదర్శనం. నైతికంగా దిగజార్చే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ పేరుతో మన సంస్క్కతి, సంప్రదాయాలపై జరుగుతున్న దాడిగా చెప్పొచ్చు స్వేచ్ఛ అనేది నైతికతకు పునాదులు వేయాలే కానీ, అనైతిక కార్యకలాపాలకు కారణం కాకూడదు. నైతిక సరిహద్దులలో ఉండే స్వేచ్ఛ మనిషిక రక్షణ కవచంలా ఉంటుంది. నైతిక పరిధి దాటిన స్వేచ్ఛ ఎన్నో అనార్థాలకు కారణమవుతుంది. మితిమీరిన స్వేచ్ఛతో బ్రతికే వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. వారినెవరూ ప్రశ్నించరు. కానీ నైతిక స్వేచ్ఛపై ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు అన్నారు. ఖిల్లా అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్ మాట్లాడుతూ ప్రజలైనా, సమాజమైన, ప్రభుత్వాలైనా నైతిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. యువతను తప్పుదారిపట్టించే అర్ధనగ్న దుస్తులు ధరిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇది అమ్మాయిల స్వేచ్ఛ అని అంతా గొప్పగా చెప్పుకుంటారు. అదే అమ్మాయిలు నైతికంగా, హుందాగా ఉండే హిజాబ్ ధరిస్తే మాత్రం ఎక్కడ లేని అభ్యంతరాలు పుట్టుకొస్తున్నాయి. నైతిక స్వేచ్ఛను పాటించేందుకు సుప్రీంకోర్టు మెట్టెక్కాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఇంద్రనగర్ అధ్యక్షురాలు హుస్సేన్ బీ మాట్లాడుతూ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న మితిమీరిన స్వేచ్ఛ అనర్థాల గురించి రాసుకుంటూ పోతే పేజీలు సరిపోవు. ముఖ్యంగా మన సొసైటీలో స్త్రీలు, అమ్మాయిలు, యువతులు స్వేచ్ఛ, సమానత్వం పేరుతో మోసపోతున్నారు. స్త్రీలను డబ్బు సంపాదించే యంత్రంగా, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునే సాధనంగా వాడుకుంటున్నారు. సమాజంలో ప్రబలుతున్న జాడ్యాలను అడ్డుకోవాలంటే స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవాలి అన్నారు. ఇస్లాంపేట అధ్యక్షురాలు ఖాసిమ షాహిన్ మాట్లాడుతూ క్యాంపెయిన్ లో భాగంగా నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛ గురించి అవగాహన కల్పించడానికి మహిళలకు మరియు కాలేజీ విద్యార్థినిలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తామని అన్నారు, నైతిక స్వేచ్ఛ గురించి, స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి కరపత్రాల ద్వారా వివరిస్తామని, నైతిక విలువల్ని ప్రోత్సహించే పలు వీడియో సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. విద్యావంతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జాగృతి ఉద్యమం లోగో ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, విద్యార్థినిలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సమీనా, నుసరత్, హాజీర సదఫ్, నాజియా తబస్సు , ఫర్జానా , నసీమా, జహీరా నూర్జహాన్ ఆరిఫా, ఫాతిమా పాల్గొన్నారు.