సెలవులకు ఇంటికొస్తే సర్పంచ్‌ను చేశారు 

Oct 18, 2024 - 18:41
Oct 18, 2024 - 18:42
 0  2
సెలవులకు ఇంటికొస్తే సర్పంచ్‌ను చేశారు 

 అప్పట్లో గ్రామంలో ఒకే ఒక డిగ్రీ హోల్డర్‌ను 

 అన్ని తరగతుల్లోనూ నాదే ఫస్ట్‌ ర్యాంక్‌ 

 ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఉండేది 

 రాగి సంకటి, అంబలే టీ, టిఫిన్లు 

 ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణే విజయ రహస్యం 

 ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ 

షాద్‌నగర్‌ : అన్ని తరగతుల్లోనూ ఆయనే ఫస్ట్‌. క్లాస్‌ లీడర్‌గాను గుర్తింపు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యం. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి మరీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌ అంటే మహా ఇష్టం. ఆటల్లోనూ అగ్రస్థానమే.. డిగ్రీ అనంతరం వచ్చిన వేసవి సెలవులు ఆయన జీవితాన్ని మార్చాయి. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి శాసనసభలో అడుగుపెట్టిన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఇన్నర్‌ వ్యూ ఆయన మాటల్లోనే..

 వీర్లపల్లి.. 

మా సొంతూరు షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని వీర్లపల్లి. తల్లిదండ్రులు కాసులబాద్‌ రాజయ్య, అంజమ్మ. మా ఇంట్లో నేనే పెద్ద. నాతో పాటు ముగ్గురు సోదరిమణులు. మాది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచే నాకు చదువులపై ఆసక్తి ఎక్కువ. నిరుపేద కుటుంబం కావడంతో చదువుకోవడానికి పుస్తకాలు కొనలేని దుస్థితి. అయినా అమ్మానాన్నలు చదువులో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ల ఆశయాలను గౌరవిస్తూ అన్ని తరగతుల్లోనూ ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాను. డిగ్రీ పూర్తి చేయడంతో పాటు, ఎంఏ, బీఈడీలో కూడా మంచి ర్యాంకుతో సీటు సంపాదించాను. కాగా, అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేయాల్సి వచ్చింది. లేకుంటే నేను కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగిగానో స్థిరపడే వాడిని.

 క్లాస్‌ లీడర్‌గా అవకాశం 

విద్య పట్ల నాకున్న ఆసక్తిని గుర్తించిన మా టీచర్లు నాకు క్లాస్‌ లీడర్‌గా అవకాశం ఇచ్చారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు మా తరగతిలో నేనే క్లాస్‌ లీడర్‌ను. ఆ రోజుల్లో అది నాకు చాలా గర్వంగా ఉండేది. ఆ సమయంలో క్లాస్‌లోనే కాదు.. జీవితంలోనూ లీడర్‌గా ఎదుగుతావని తన స్నేహితులు అన్న విషయాలు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయి. క్లాస్‌ లీడర్‌ అయినందుకో ఏమో కానీ లీడర్‌గా ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణే నా విజయ రహస్యం.

 ఇంటర్‌ వరకు కాలినడకే 

మా స్వగ్రామం వీర్లపల్లిలో 5వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత ఆ గ్రామం నుంచి రోజు రానుపోనూ 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి నందిగామ గ్రామం(ప్రస్తుతం మండల కేంద్రం)లోని ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివాను. అదే ఉత్సహంతో మళ్లీ 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న షాద్‌నగర్‌ పట్టణానికి నడుచుకుంటూ వెళ్లి ఇంటర్‌ పూర్తి చేశాను. ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వడంతో చదువులపై ఆసక్తి పెరిగింది. ఎలాగైన మంచి ఉద్యోగం సంపాదించాలన్న తపనతో హైదరాబాద్‌లోని సిటీ కాళాశాలలో బీకాం పూర్తి చేశాను. అందులోనూ ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ కావడంతో ఎంఏలో సీటు వచ్చింది. అదే సమయంలో బీఈడీ కోర్సులో కూడా సీటు వచ్చింది. నాకు క్రీడల పట్ల కూడా ఆసక్తి ఎక్కువ. ప్రతీ రోజు స్నేహితులతో కలిసి క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌ ఇలా రోజు ఏదో ఒక ఆట ఆడేవాళ్లం. ఇందులోనూ కూడా నాదే లీడర్‌షిప్‌.

 గ్రామ పెద్దల ప్రోత్సాహంతోనే.. 

నా డిగ్రీ 1995లో పూర్తయింది. అనంతరం వేసవి సెలవులని ఇంటికి వచ్చాను. అదే సమయంలో సర్పంచ్‌ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్‌ పదవిని బీసీలకు కేటాయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రాందేవ్‌రెడ్డి తనను ఎన్నికల బరిలో నిలబడమని సూచించాడు. వెంటనే నాకు ఇష్టం లేదని చెప్పాను. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలన్నదే నా లక్ష్యమని చెప్పాను. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో నీవు ఒక్కడివే డిగ్రీ పూర్తి చేసిన యువకుడవు.. చదువుల్లో మాదిరిగానే రాజకీయాల్లోనూ రానిస్తావంటూ గ్రామ పెద్దలు పాలకొంల్లు నారాయణరెడ్డి, శేఖర్‌రెడ్డి నవాజ్‌రెడ్డి ఎన్నికల బరిలోకి దిగేలా ప్రోత్సహించారు. ఆ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన నేను అందరి సహకారంతో సర్పంచ్‌గా గెలిచాను. అక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అప్పటి నుంచి చదువులు స్వస్తి పలికి రాజకీయాలకు అంకితమయ్యాను.

 పూర్తి శాఖాహారిగా.. 

నాకు రాగి సంకటి.. అంబలి చాలా ఇష్టం. మేము మొదట మాంసాహారులమైనప్పటికీ 1986 నుంచి పూర్తి శాఖాహారిగా మారాను. ప్రతీ రోజు ఇంట్లో రాగి సంకటి తిని, అంబలి సేవించిన తర్వాతనే ఇంటి నుంచి కాలు బయట పెడుతాను. మధ్యాహ్నం భోజనంలో ఏదైనా కూర, పప్పు, పెరుగు మాత్రమే తీసుకుంటాను. రాత్రి వేళలో కూడా జొన్న రొట్టె, లేదా చపాతి ఇతర వెజిటేరియన్‌ కర్రీస్ తో తింటాను.

 సరదాగా స్నేహితులతో.. 

వెంకట్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు నా ప్రాణ మిత్రులు. చిన్నతనంలో సెలవులు వచ్చాయంటే వారతో కలిసి షాద్‌నగర్‌ పట్టణానికి నడుచుకుంటూ వెళ్లి సినిమాలు చూసేవాళ్లం. కానీ ఎప్పుడూ కూడా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు, శికారులకు వెళ్లలేదు. అందుకే తమకు క్రమశిక్షణ గల విద్యార్థులుగా ఉపాధ్యాయులు గుర్తించారు. నా స్నేహితులు సైతం ఇప్పటికీ నాతోనే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి శంకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్ది, సీనియర్‌ నేత ఎల్లారెడ్డి నాకు రాజకీయ గురువులు. నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా, జిల్లాలో కమిటీ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులు ఇప్పించారు. రాజకీయాల్లో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది కూడా వారే. వారివల్లనే నేను ఈ స్థాయికి ఎదిగాను..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333