షాద్ నగర్ లో కమర్షియల్ టాక్స్ అధికారుల దోపిడి

Jun 7, 2024 - 20:28
 0  2
షాద్ నగర్ లో కమర్షియల్ టాక్స్ అధికారుల దోపిడి

జీఎస్టీ పేరుతో లారీల నుండి అక్రమ వసూలు

అడిగినంత ఇవ్వాల్సిందే..లేదంటే కేసులంటూ బెదిరింపులు

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అధికారులు

ఐరన్ కంపెనీలే వారి టార్గెట్

షాద్ నగర్ లో పదిమంది ప్రైవేట్ యువకుల నియామకం

పట్టణంలో స్టీల్, సిమెంటు, ఐరన్ షాపుల ముందు నిఘా

ఇదేమి దోపిడి అంటూ బెంబేలెత్తుతున్న యజమానులు

జీఎస్టీ బిల్లు లేకుంటే ప్రభుత్వానికి కట్టించాల్సింది పోయి చేతివాటం ప్రదర్శన

ఈ అధికారుల నుండి రక్షించండి అంటూ యజమానుల వేడుకోలు షాద్ నగర్  కమర్షియల్ టాక్స్ పేరుతో అధికారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. జీఎస్టీ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తే అందుకు సంబంధించిన నగదును ప్రభుత్వానికి అధికారులు కట్టించాల్సింది పోయి చేతివాటం ప్రదర్శిస్తుండటంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల్లో ఏ చిన్న ఐరన్, రేకులు వంటి సామాగ్రిని తరలిస్తుంటే జిఎస్టి బిల్లు లేదంటూ వచ్చి చేతివాటం ప్రదర్శిస్తున్నారని వాపోతున్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో ఉన్న ఐరన్ పరిశ్రమల వద్ద కమర్షియల్ టాక్స్ అధికారులు కొంతమంది ప్రైవేటు యువకులను అక్కడ అక్కడ పెట్టి పరిశ్రమల నుండి లారీలు ఐరన్ లోడుతో బయటకు వస్తే చాలు ఎలికట్ట చౌరస్తా వద్ద జిఎస్టి బిల్లు చూపించాలంటూ లారీ డ్రైవర్లను బెదిరించడంతోపాటు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ బిల్లు లేదంటే తాము అడిగింది ఇస్తే లారీలు వదిలేస్తాం లేదంటే కేసులు పెడతామంటూ యజమానులను బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు. జీఎస్టీ అధికారుల అక్రమ వసూళ్ల కారణంగా తాము వ్యాపారం చేయలేకపోతున్నామని యజమానులు వాపోతున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయంలో జీఎస్టీ అధికారులు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని, ప్రైవేటుగా నియమించుకున్న యువకులకు నెల నెల జీతాలు సైతం చెల్లిస్తున్నారంటే జీఎస్టీ అధికారులు ఏ స్థాయిలో అక్రమ వసూలు చేస్తున్నారో అర్థమవుతుందని అంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతోనే స్థానికంగా ఉన్న జిఎస్టి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ యజమానులను, వ్యాపారులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎల్లికట్ట చౌరస్తా, నందిగామ, టోల్ గేటు వద్ద జీఎస్టీ అధికారులు ప్రైవేట్ గా నియమించిన యువకులతో నిఘా వేయించి లారీలను పట్టుకుంటారు. వే బిల్లు, జీఎస్టీ కట్టారా అంటూ లారీకి సంబంధించిన కాగితాలను పరిశీలించి లేకుంటే లక్షల్లో అధికారులు వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. షాద్ నగర్ లో ఏ వ్యాపారి వద్దకు వెళ్లిన జీఎస్టీ అధికారులు చేస్తున్న అక్రమ వసూళ్లపై, వారు పడుతున్న బాధలను వివరిస్తారు. ఈ అక్రమ వసూళ్లతో ప్రభుత్వ ఖజానాకు సైతం అధికారులు గండి కొడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333