శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం కోదాడలో
శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో లారీ ఓనర్లకు, డ్రైవర్లకు ఉచిత ఆరోగ్య శిబిరం
తెలంగాణ వార్త ప్రతినిధి :- శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ 50 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని, తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ రవాణా వాహన రంగంలో ఉన్న లారీ యాజమాన్యాలు, డ్రైవర్ల శ్రేయస్సు కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. సోమవారం కోదాడ లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో నిర్వహించిన శ్రీ ‘ఆరంభం వెహికల్ లోన్స్’(ఢిల్లీ నుండి దిండిగల్) కార్యక్రమంలో భాగంగా భారీ ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద సంఖ్యలో లారీ డ్రైవర్లు, యాజమాన్యాలు హాజరై సేవలు పొందారు.
ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలాని కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని, డ్రైవర్లు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ అందిస్తున్న వివిధ రుణ పథకాలు, బీమా సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు డ్రైవర్లకు అవసరమైన సలహాలు అందిస్తూ, సంస్థ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హమ్‌జా హలీ, జోనల్ బిజినెస్ హెడ్ మహిపాల్ రెడ్డి, స్టేట్ హెడ్ ప్రదీప్, రీజనల్ మేనేజర్ రామారావు, బ్రాంచ్ మేనేజర్లు శ్రీనివాస్, శ్రవణ్, శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.