చట్టసభల్లో చర్చకు రావాల్సిన మరెన్నో కీలక అంశాలు.
చట్టసభల్లో చర్చకు రావాల్సిన మరెన్నో కీలక అంశాలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి నిర్మూలనకు, సమానత్వ సాధన, సుపరిపాలన మరెన్నో చట్టాలకోసం.
వడ్డేపల్లి మల్లేషము 25..10..2024
పదునైన చట్టాలు లేక తప్పించుకునే నేరస్తులను అదుపు చేయలేకపోవడం, రాజ్యాంగంలో రాసుకున్నా సోయి, బాధ్యత లేని కొందరు దుష్ట పాలకుల స్వార్థం కారణంగా సమానత్వం అంతరాలు లేని వ్యవస్థను సామ్యవాదాన్ని అంతిమంగా సమ సమాజాన్ని ఆవిష్కరించు కోలేకపోవడం, ఆదేశిక సూత్రాలలో స్పష్టంగా పాలకులకు ప్రజాధనాన్ని కొద్దిమంది చేతుల్లో పోగు పడకుండా చూడాలని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఈ దేశంలో అమలు కావడం లేదు. అంతరాలు భారీగా పెరగడాన్ని గమనించినప్పుడు ప్రస్తుతమున్న వ్యవస్థకు మరింత భిన్నమైన పాలనకు పదునైన చట్టాలు పాలకుల పని పట్టే ఆలోచన యంత్రాంగం అవసరమని తెలుస్తున్నది. అంతేoదుకు దేశంలోని సామాన్యులు పేద వర్గాల గురించిన చర్చ పేరుకే కానీ ఆచరణలో, బడ్జెట్ అంచనాలు, పంచవర్ష ప్రణాళికలలో 10 శాతం కూడా అమలుకు నోచుకోవడం లేదంటే పాలకులు పేద వర్గాలను ఎంత మోసం చేస్తున్నారో పసిగట్టవలసిన అవసరం చాలా ఉన్నది. ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రి ప్రధాని వరకు కూడా తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతి సందర్భంలోనూ వివిధ రకాల పేరుతో చేస్తున్న ఖర్చు తడిసి మోపెడు అవుతుంటే ఆ భారాన్ని సామాన్య మధ్యతరగతి పేద వర్గాలు మోయవలసి వస్తున్నది అనే ఆలోచన ఎప్పుడైనా పాలకులకు తట్టిందా? అంతెందుకు సామాన్య ప్రజలు కూడా తోటివాడు బాగుపడితే కష్టపడి చెమటవడిసి సంపాదించుకొని ఉత్పత్తిలో భాగస్వాములై తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటే సహించలేరు కానీ అవినీతి పద్ధతుల్లో అధికారులు ప్రజాప్రతినిధులు ఎందరో అక్రమ మార్గాల ద్వారా భూ కబ్జాల ద్వారా కోట్లు సంపాదించుకుంటే ఇదేమిటి అని ప్రశ్నించ లేకపోవడం కూడా ఈ వ్యవస్థ ఇలాగ ఉండడానికి ప్రధాన కారణం. ఇప్పటికీ చేతివృత్తులతో బతికే వాళ్ళు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, సంచార జీవులు, వలస కార్మికులు, రోజువారి పనులు చేసుకొని బ్రతికే వాళ్ళు, పెట్టుబడికి లేక ప్రభుత్వ ఉద్యోగం రాక అవకాశాలు లేక స్వయం ఉపాధిని నమ్ముకుని పని చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ భరోసా లేక బికారుల్లాగా తిరుగుతూ పని లేక వస్తులుండి కుటుంబాన్ని సంరక్షించుకోలేక చదువుకు వైద్యానికి ఖర్చులకు లేక ఈ అసమ సమాజంలో కొట్టుమిట్టాడుతున్న కొట్టాది ప్రజల గురించి ఎప్పుడైనా అసెంబ్లీ పార్లమెంట్లలో చర్చ జరిగిందా? "పెన్షన్లు, రాయితీలు, ఆకర్షణ పథకాలు, నగదు బదిలీ వంటి వాటితో ప్రజలను మభ్యపెట్టి ఇదే సుపరిపాలన అంటూ ప్రజలను నమ్మించి రెచ్చగొట్టి యాచకులుగా బానిసలుగా మార్చి తలవంచుకొని ఓటు వేసే ఓటర్లు గా మార్చుకోవడమే నిజంగా పాలకుల దృష్టిలో పరిపాలన అయితే అది అవసరమే లేదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ దేశ సంపద ప్రజలందరికీ సమానంగా చెందాలని, కొద్దిమంది సంపన్నుల చేతిలో ఈ దేశ సంపద బందీ కాకూడదని, అసమానతలు అంతరాలు దోపిడీపీడన ఉండకూడదని, ప్రతి వ్యక్తి మరొకరిని సాటి మనిషిగా చూడగలిగే మానవీయ కోణంలో సామాజిక వ్యవస్థ కొనసాగాలని ఆశిస్తున్నారు.అంతేకాదు ఈ వివక్షత ఇలాగే కొనసాగితే పాలకులను శాసించడానికి వెనుకాడరు అప్పుడు వచ్చే ప్రజా ఉద్యమాలు పోరాటాలు మరింత ఘాటుగా ఉంటాయి. ఇప్పటికే దశాబ్దాల తరబడి పౌర హక్కులు మానవ హక్కుల కార్యకర్తలు మేధావులు బుద్ధి జీవులు ప్రజా సంఘాలు ఉద్యమకారులు అసమానతలు లేని వ్యవస్థ కోసం పోరాడి అలసిపోయి రాజ్య హింసకు బలైన విషయం తెలుసు. కానీ ఓటమి ఎప్పుడు ఓడిపోదని గెలుపుకు పరాకాష్ట అని పాలకులు తెలుసుకుంటే మంచిది." లెనిన్ అన్నట్టుగా ఓటమి గెలుపుకు తొలిమెట్టు అని అటు పాలకులు గుర్తించాలి. ప్రజలు కూడా తమ ఆత్మ స్థైర్యాన్ని మరింత పెంపొందించుకొని,తగిన చట్టాల కోసం, చట్టసభల సద్వినియోగం కోసం, రాజ్యాధికారంలో వాటా కోసం, అన్ని వర్గాలకు తగిన సామాజిక ప్రయోజనం కోసం, గౌరవంగా ప్రతి కుటుంబానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఆర్థిక స్వావలంబనకోసం, ప్రజాస్వామిక విలువల నేపథ్యంలో కొత్త తరహా పోరాటానికి సిద్ధం కావాల్సిందే." కవు లు కళాకారులు మేధావులు, విద్యావంతులు బుద్ధి జీవులు ఉత్పత్తిలో భాగస్వాములయ్యే ప్రతి వర్గం ఈ వైపుగా ఆలోచించి హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడడం ద్వారా పౌర సమాజాన్ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. చట్టసభల్లో మార్పుల కోసం పోరాటం కూడా అనివార్యం.మరో ప్రపంచం చూడాలంటే పోరాటం కూడా వినూత్నంగా రావాల్సిందే ! దుర్మార్గులు, నేరస్తులు, ఆగంతకులు, పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థల దోపిడీని అంతం చేయడానికి ప్రజలకు సాధ్యం కావడం లేదంటే పాలకుల అండ కారణంగానే అని గుర్తించాలి. ఓట్లు వేసి గెలిపించి సీట్లలో కూర్చుండబెట్టేది ఓటర్లుగా ఉన్న ప్రజలు అయితే ఎన్నికల తర్వాత ఆ ప్రజలను విస్మరించి తమ సీట్లను చూసుకుంటూ రక్షకులుగా ఉన్నటువంటి పెట్టుబడిదారుల వైపు పాలకులు చూస్తూ మద్దతు ప్రకటించడం కారణంగా సమాజం నేరపూరితంగా మారిపోతున్న విషయాన్ని లోతుగా పరిశీలించి సూటిగా ప్రశ్నించడం వల్ల పాలకులకు కనువిప్పు కలగాలి ."పేదవాడు ప్రభుత్వం దగ్గర రుణం తీసుకుంటే అవమానించడం వేధించడం చివరికి ఆ కుటుంబాన్ని లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు అధికారులు పెట్టుబడిదారులు మాత్రం రుణాలు తీసుకుంటే ప్రభుత్వం ఎదురేగి స్వాగతం పలికి రుణాలను మాఫీ చేసి వాళ్లను ఇతర దేశాలకు భద్రంగా పంపిస్తున్న ధోరణి ఇంకా నా ఇకపై సాగదు అని నినదించగలిగితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు " స్త్రీల వైపు కన్నెత్తి చూస్తే అదే చివరి రోజు అవుతుంది" అన్నట్టు ఈ దేశంలో అవినీతి బంధుప్రీతి ఆగడాలు అకృత్యాలు అత్యాచారాలకు చివరి రోజు కాగలదు". రైతుల సమస్యల పైన పార్లమెంట్ లోను అసెంబ్లీలోనూ నిరంతరం చర్చ కొనసాగుతున్నది దానికి అభ్యంతరం లేదు కానీ సరైన చట్టాలను తీసుకువచ్చి వాటిని అమలు చేయడం ద్వారా దేశానికి తిండి పెట్టే రైతన్నలకు ఊరట కల్పించవలసిందే అది వారి రాజ్యాంగపరమైన హక్కు. కానీ తోటి సమాజం ఆదరించని, ప్రభుత్వాలు పట్టించుకోని, ఆర్థికంగా అత్యంత హీనస్థాయిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పేద వర్గాలు ఆదివాసులు బడుగు బలహీన వర్గాల గూర్చి నిజంగా చట్టసభల్లో ఎప్పుడైనా చర్చ జరిగిందా? మనం ప్రశ్నించుకోవాలి పాలకులకు కళ్ళు తెరిపించాలి. "ముఖ్యమైనటువంటి చట్టాల రూపకల్పన విషయంలో ప్రజల సమస్యల పైన చర్చిస్తున్న సందర్భంలో కొన్ని రోజులపాటు విస్తృతంగా చర్చించిన దాఖలా లేదు ఇది పాలకుల పక్షాన జరుగుతున్నటువంటి నేరమయ రాజకీయాలకు ప్రతీక అని గతంలో సిజెఐ గా పని చేసినటువంటి ఎన్వి రమణ గారు హెచ్చరించిన విషయాన్ని ఇక్కడ జ్ఞప్తికి చేసుకోవాలి కూడా." రాజ్యాంగ పీఠికలో న్యాయము, సమానత్వము, స్వేచ్ఛ, సామ్యవాదము, లౌక్యరాజ్యము, సౌబ్రాత్రుత్వం అని గొప్పగా చెప్పుకున్నాం. అంతటి గొప్పగా సమాజం ఆవిష్కరించబడాలని రాజ్యాంగ నిర్మాత ఆశించినాడు కానీ ఆచరణలో దానికి భిన్నంగా పరిపాలన కొనసాగుతున్నదంటే అదంతా గత 77 ఏళ్ల పాలకుల దుర్మార్గమైన ప్రవృత్తి కారణంగానే అని ఇప్పటికైనా చట్టసభల్లో చర్చ జరగాలి నిలదీయాలి. చట్టసభల సభ్యులు పార్టీ ఏదైనా అందరూ ఒక్కటైతే ప్రజా ప్రతినిధులను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలి ."అవినీతి నిర్మూలనకు సమానత్వాన్ని సాధించడానికి చట్టాలు చేయాల్సినటువంటి సభ్యులే అందుకు సిద్ధంగా లేనప్పుడు తమ బండారం బయటపడుతుందని కాలయాపన చేస్తున్నప్పుడు భిన్నమైన రీతిలో ప్రత్యేక యంత్రాంగాన్ని రూపకల్పన చేయడానికి ఎంతటి స్థాయిలో ఉన్న వారి అవినీతినైనా బట్టబయలు చేయడానికి రాష్ట్రపతి గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సుప్రీంకోర్టు ద్వారా ప్రత్యేక యంత్రాంగం రూపకల్పనకు ఏర్పాట్లు జరగాలి." ఈ ప్రతిపాదనకు రాజకీయ నాయకులు చిత్తశుద్ధి ఉంటే అంగీకరించి తమ పైన ఏ సందర్భంలోనైనా చర్చకు విచారణకు సిద్ధమని ప్రకటిస్తే మంచిది. ఈ దేశంలో విద్య వైద్యం సామాజిక న్యాయం ఉచితంగా అందడం లేదు వీటన్నింటికీ పేద ప్రజలు తమ సంపాదన యావత్తు ఖర్చు చేయడం వలన వాళ్ల నిజ జీవితం రోజురోజు దినదిన గండంగా గడుస్తున్నది. ఉపాధి లేదు పెట్టుబడి సాయం లేదు ఖర్చుకు లేవు ఆ పరిస్థితుల్లో సంఘవిద్రోహశక్తులుగా తయారవుతున్న నేపథ్యాన్ని కూడా పాలకులు గుర్తించడం లేదంటే వాళ్ల స్వప్రయోజనంలో లీనమై ఉన్నట్లే కదా! ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజల కోసం వ్యవసాయదారులు రైతుల మాదిరిగా సమాజంలోని అన్ని వర్గాల సమస్యల పైన చర్చ చేసి పరిష్కారాన్ని చూపగలిగితే సంతోషం .లేకుంటే అంబేద్కర్ గారు చెప్పినట్లు తమకు అనుకూలమైన పాలన కోసం చట్టం కోసం యంత్రాంగం కోసం ప్రజలు పోరాడుతారు అనేది నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)