విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
విద్యలో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వడ్డించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని, ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం కేటీ దొడ్డి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, అభ్యసన సామర్ధ్యాలను తెలుసుకున్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పాత ప్రశ్న పత్రాలను పునఃశ్చరణ చేయించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఖాన్ అకాడమీ ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికతో బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. గతేడాది ఫలితాలపై ఆరా తీసి ఈసారి కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాక అత్యధిక విద్యార్థులు 500కు పైగా మార్కులు పొందాలని ఆకాంక్షించారు. త్వరలో జరగబోయే ఎస్ఎ1 పరీక్షల్లోనూ విద్యార్థులు ప్రతిభ చాటాలని సూచించారు. విద్యార్థుల దినచర్యను తెలుసుకొని వారికి విద్యాలయంలో కల్పించిన మౌలిక వసతులపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. వంట, స్టోర్ గదులను పరిశీలించి పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కేజీబీవీకి సంబంధించిన హాజరు, ఇతర రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్ తగు సూచనలు చేశారు. ఈ పర్యటనలో తహసిల్దార్ కరుణాకర్, ఎంపీడీవో రమణారెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.