విద్యలో జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి
ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు.
శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 24 జూలై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి విద్యలో జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు దశలవారీగా నిర్వహించే ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గద్వాలలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తుండగా శుక్రవారం కలెక్టర్ సందర్శించి మాట్లాడారు. ఉపాధ్యాయులు వివిధ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని తమ పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. బోధన అభ్యసన నైపుణ్యాలతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించి మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పునఃశ్చరణ తరగతులను నిర్వహించాలని, ప్రతి తరగతిలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండి ఒకరు పాఠాలు చెబుతుంటే మరొక ఉపాధ్యాయుడు విద్యార్థులు ఏ విధంగా వింటున్నారో గమనించాలన్నారు. ప్రాథమిక స్థాయి విద్య నుంచే విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యాలు మెరుగుపడేలా బోధించాలన్నారు. ఫలితంగా విద్యార్థులు భవిష్యత్తులో వివిధ పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందని తద్వారా వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ఏఐ వంటి సాంకేతికతను కూడా వినియోగించి ఉపాధ్యాయులు పాఠాలు బోధించేందుకు కృషి చేయాలని సూచించారు.
గతేడాది కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారని, ఎంతవరకు తమ పాఠశాలలలో శిక్షణ ద్వారా తెలుసుకున్న విషయాలను అమలు చేస్తున్నామని ప్రతి ఒక్క టీచర్ తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. విద్యార్థులు బట్టి విధానంలో చదవకుండా పాఠ్యాంశాలను అర్థం చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంచుకొని పరీక్షల్లో ప్రతిభ చాటే అవకాశం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి మైఖేల్, శిక్షకులు గోపాల్, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుకా దేవి, తదితరులు పాల్గొన్నారు.