వి బి జి రామ్ జి బిల్లును రద్దు చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని 

Jun 27, 2026 - 18:21
 0  1
వి బి జి రామ్ జి బిల్లును రద్దు చేయాలి. ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని 

జూలై 1న జరిగే గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి.

 సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నేతల పిలుపు.....

 సూర్యాపేట:కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వి.బి.జి. రామ్‌జీ బిల్లు గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, ఉపాధి హామీ కూలీల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ బిల్లును వెంటనే రద్దుచేసి ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జూలై 1న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది  వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను బలహీనపరిచే ఎలాంటి చర్యలనైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే గ్రామాల్లో పని అడిగిన కూలీలకు తగినంత పని కల్పించడం లేదన్నారు. చేసిన పనులకు కూలి చెల్లింపులు వారాలు, నెలల తరబడి ఆలస్యం అవుతుందన్నారు . పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలి రేట్లు లేకపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం, పనిదినాలను పరిమితం చేయడం, సాంకేతిక నిబంధనల పేరుతో కూలీలను ఇబ్బందులకు గురిచేయడం వల్ల గ్రామీణ పేదల జీవనం సంక్షోభంలో పడిందని ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితుల్లో వి.బి.జి. రామ్‌జీ బిల్లు అమల్లోకి వస్తే గ్రామీణ పేదల ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోవడంతో పాటు, ఉపాధి హామీ చట్టం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గి, వలసలు పెరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు.

అందువల్ల కేంద్ర ప్రభుత్వం వి.బి.జి. రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు, పనులు కోరిన ప్రతి కుటుంబానికి తగిన ఉపాధి కల్పించి, పెండింగ్ కూలి బకాయిలను వెంటనే చెల్లించి, ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించాలని  నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 1న జరిగే గ్రామీణ సమ్మెను ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని  పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333